Skip to content
Opens in a new window

[1] ఏడాది మొదటి నెల ఇస్రాయేల్ ప్రజలు – ఆ సమాజమంతా – సీన్ ఎడారికి చేరుకొని కాదేషులో దిగారు. అక్కడ మిర్యాం చనిపోయి సమాధి చేయబడింది.

[2] సమాజానికి నీళ్ళు లేకపోవడంవల్ల ప్రజలు మోషే అహరోనులపై విరోధ భావంతో పోగయ్యారు.

[3] వారు మోషేతో జగడమాడుతూ, “అయ్యో, మా సాటివాళ్ళు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేము కూడా చనిపోయి ఉంటే ఎంత బాగుండేది!

[4] ఈ ఎడారిలో మేమూ మా పశువులూ చచ్చిపోయేట్టు యెహోవా యొక్క సమాజాన్ని నువ్వు ఇక్కడికి తెచ్చావేం!

[5] ఈ చెడ్డ చోటికి ఈజిప్ట్‌నుంచి మమ్మల్ని రప్పించావేం! ఇది విత్తనాలు చల్లే చోటు కాదు. అంజూరాలూ ద్రాక్షలూ దానిమ్మలూ ఏమీ లేవు. తాగడానికి నీళ్ళు కూడా లేవు” అన్నారు.

[6] మోషే అహరోనులు సమాజం ఎదుటనుంచి సన్నిధిగుడారం ద్వారందగ్గరికి వెళ్ళి సాష్టాంగపడ్డారు. అప్పుడు యెహోవా మహిమాప్రకాశం వారికి కానవచ్చింది.

[7] యెహోవా మోషేతో ఇలా అన్నాడు:

[8] “నీవు నీ కర్రను చేతపట్టుకొని నీవూ నీ అన్న అహరోనూ ఈ సమాజాన్ని సమకూర్చాలి. అప్పుడు నీవు వారి కళ్ళెదుట ఆ బండతో మాట్లాడు. దానిలోనుంచి నీళ్ళు వస్తాయి. ఈ విధంగా నీవు ఆ బండలో నుంచి నీళ్ళు రప్పించి సమాజానికీ వారి పశువులకూ నీళ్ళు ఇవ్వాలి.”

[9] యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞననుసరించి మోషే ఆయన ముందునుంచి తన కర్ర తీసుకొన్నాడు.

[10] మోషే అహరోనులు సమాజాన్ని ఆ బండ ఎదుట సమకూర్చారు. వారితో, “ద్రోహులారా, వినండి. మేము ఈ బండలోనుంచి మీకోసం నీళ్ళు రప్పించాలా?” అని మోషే అన్నాడు.

[11] అప్పుడు మోషే చెయ్యి ఎత్తి రెండు సార్లు తన కర్రతో ఆ బండను కొట్టాడు. వెంటనే నీళ్ళు ధారలై బయలువెడలాయి. ప్రజలు త్రాగారు, వారి పశువులు త్రాగాయి.

[12] అయితే మోషే అహరోనులతో యెహోవా ఇలా అన్నాడు: “మీరు ఇస్రాయేల్‌వారి కళ్ళెదుట నా పవిత్రతను నిలబెట్టేటంతగా నన్ను నమ్మలేదు గనుక నేను ఈ సమాజానికి ఇచ్చిన దేశంలోకి మీరు వారిని తీసుకువెళ్ళలేరు.”

[13] ఆ నీళ్ళకు మెరీబా అని పేరు. ఎందుకంటే, అక్కడ ఇస్రాయేల్ ప్రజలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారిమధ్య తన పవిత్రతను రుజువుపరచుకొన్నాడు.

[14] ఆ తరువాత మోషే కాదేషునుంచి ఎదోమ్ దేశం రాజుదగ్గరికి రాయబారులను ఈ కబురుతో పంపించాడు: “మీ సోదరుడు ఇస్రాయేల్ ఇలా మనవి చేస్తున్నాడు – మాకు వచ్చిన కష్టమంతా మీకు తెలుసు.

[15] మా పూర్వీకులు ఈజిప్ట్‌కు వెళ్ళారు. మేము ఈజిప్ట్‌లో చాలా కాలం కాపురమున్నాం. ఈజిప్ట్‌వాళ్ళు మా పూర్వీకులనూ మమ్ములనూ బాధించారు. ఇదంతా మీకు తెలుసు.

[16] మేము యెహోవాకు మొరపెట్టినప్పుడు మా మొర విని ఆయన దూతను పంపి ఈజిప్ట్‌నుంచి మమ్ములను తీసుకు వచ్చాడు. ఇప్పుడు మేము కాదేషులో ఉన్నాం. ఈ ఊరు మీ సరిహద్దుల కొనలో ఉంది గదా.

[17] మమ్ములను మీ దేశం మీదుగా దాటిపోనియ్యండి. పొలాలలో ద్రాక్షతోటలలో పడి వెళ్ళము. బావుల నీళ్ళు తాగము. రాజమార్గంలోనే సాగిపోతాం. మీ దేశం సరిహద్దును దాటేవరకూ కుడివైపుకూ ఎడమవైపుకూ తిరగకుండా వెళ్ళిపోతాం.”

[18] అయితే ఎదోంవారు వారికి “మీరు మా దేశంగుండా వెళ్ళకూడదు. వెళ్ళారా, మేం ఖడ్గంతో వచ్చి మీమీద పడతాం సుమా!” అని జవాబిచ్చారు.

[19] అందుకు ఇస్రాయేల్ ప్రజలు “మేము రాజమార్గంలోనే సాగిపోతాం. మేమూ మా పశువులూ మీ నీళ్ళు తాగితే దానికి డబ్బు ఇస్తాం. హాని ఏమీ చెయ్యము. మమ్ములను కాలినడకనే దాటిపోనివ్వండి” అన్నారు.

[20] కానీ వారు “మీరు దాటి రానేకూడదు” అన్నారు. అంతేగాక, ఎదోం రాజు జనసమూహంతో చాలా బలంతో వారికెదురుగా తరలివచ్చాడు.

[21] ఈ విధంగా ఎదోంవాళ్ళు ఇస్రాయేల్ ప్రజలను తమ సరిహద్దులగుండా దాటిపోనివ్వలేదు. గనుక ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళదగ్గరనుంచి తొలగిపోయారు.

[22] ఇస్రాయేల్ ప్రజలు, ఆ సమాజమంతా, కాదేషునుంచి ప్రయాణమై హోరు పర్వతానికి చేరారు.

[23] ఎదోందేశ సరిహద్దుల దగ్గర ఉన్న ఆ హోరు పర్వతంలో యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నాడు:

[24] “మీరు మెరీబా నీళ్ళదగ్గర నా మాటకు ఎదురు తిరిగారు, గనుక నేను ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చిన దేశంలో అహరోను ప్రవేశించడు. అతడు తన పూర్వీకులదగ్గరికి చేరుతాడు.

[25] నీవు అహరోనునూ అతడి కొడుకైన ఎలియాజరునూ వెంటబెట్టుకొని హోరు పర్వతమెక్కి

[26] అహరోను వస్త్రాలు తీసి అతడి కొడుకైన ఎలియాజరుకు తొడిగించు. అక్కడే అహరోను చనిపోయి అతడి పూర్వీకుల దగ్గరికి చేరుతాడు.”

[27] యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే చేశాడు. సమాజమంతా చూస్తూ ఉంటే వారు హోరు పర్వతమెక్కారు.

[28] అక్కడ మోషే అహరోను వస్త్రాలు తీసి అతడి కొడుకు ఎలియాజరుకు తొడిగించారు. అహరోను ఆ పర్వత శిఖరం మీద చనిపోయాడు. తరువాత మోషే, ఎలియాజరు పర్వతం దిగివచ్చారు.

[29] అహరోను చనిపోయాడని సమాజమంతటికీ తెలిసింది. గనుక ఇస్రాయేల్ వంశస్థులంతా అహరోనుకోసం ముప్ఫయి రోజులు శోకించారు.

సంఖ్యాకాండం (ఎడారి ప్రయాణాలు) — Chapters