[1] మోషే ఇస్రాయేల్ ప్రజల గోత్రాల నాయకులతో ఇలా అన్నాడు: “ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి.
[2] ఎవరైనా యెహోవాకు మొక్కుబడి చేసుకొంటే, తాను బద్ధుడు కావడానికి ప్రమాణం చేస్తే ఆ వ్యక్తి మాట తప్పకూడదు. తన నోటి మాట ప్రకారమే చెయ్యాలి.
[3] ఒక యువతి తన తండ్రి ఇంట ఉన్నప్పుడు యెహోవాకు మొక్కుబడి చేసుకొని బద్ధురాలైతే,
[4] ఆమె తండ్రి ఆమె మొక్కుబడి గురించీ తాను బద్ధురాలుగా చేసుకొన్నసంగతి గురించీ విని ఊరుకొంటే, ఆమె మొక్కుబళ్ళంతా నిలుస్తాయి. ఆమె బద్ధురాలు కావడానికి తాను పెట్టుకొన్న ఒట్టు నిలుస్తుంది.
[5] అయితే ఆమె తండ్రి దాని గురించి విన్నరోజున వద్దంటే, ఆమె మొక్కుబళ్ళన్నిటిలో ఏదీ నిలువదు. బద్ధురాలు కావడానికి ఆమె చేసుకొన్న శపథాలలో ఏదీ నిలవదు. ఆమె తండ్రి దానికి ఒప్పుకోలేదు, గనుక యెహోవా ఆమెను క్షమిస్తాడు.
[6] “అయితే ఆమె మొక్కుబడి చేసుకొని సావధానం లేకుండా తనమీద ఒట్టుపెట్టుకొన్న తరువాత ఆమె పెళ్ళి చేసుకొంటుందనుకోండి.
[7] ఆమె భర్త దాని గురించి విని విన్నరోజున ఊరుకుంటే ఆమె చేసుకొన్న మొక్కుబడులన్నీ, ఆమె బద్ధురాలు కావడానికి చేసుకొన్న శపథాలన్నీ నిలుస్తాయి.
[8] ఆమె భర్త దానిగురించి విన్న రోజున వద్దంటే ఆమె చేసుకొన్న మొక్కుబడినీ సావధానం లేకుండా తనమీద పెట్టుకొన్న ఒట్టునూ అతడు రద్దుచేసినట్టే. యెహోవా ఆమెను క్షమిస్తాడు.
[9] “విధవరాలు గానీ విడిచిపెట్టబడ్డ స్త్రీ గానీ తనమీద తాను పెట్టుకొన్న ప్రతి ఒట్టూ మొక్కుబడి నిలుస్తాయి.
[10] “ఆమె తన భర్త ఇంట ఉండి మొక్కుబడి చేసుకొంటే, ఒట్టు పెట్టుకొని తనను బద్ధురాలుగా చేసుకొంటే,
[11] ఆమె భర్త విని వద్దనకుండా ఊరుకొంటే ఆమె మొక్కుబళ్ళన్నీ నిలుస్తాయి. తన మీద పెట్టుకొన్న ప్రతి ఒట్టూ నిలుస్తుంది.
[12] ఆమె భర్త విన్నరోజు వాటిని పూర్తిగా రద్దు చేసుకొంటే ఆమె మాట – అది మొక్కుబడి గానీ తనమీద పెట్టుకొన్న ఒట్టు గానీ – ఏదీ నిలవదు. ఆమె భర్త వాటిని రద్దుచేశాడు. యెహోవా ఆమెను క్షమిస్తాడు.
[13] స్త్రీ చేసుకొన్న ప్రతి మొక్కుబడినీ ఉపవాసం ఉంటానన్న ప్రతి ఒట్టునూ అలాంటి ప్రతి ప్రమాణాన్నీ ఆమె భర్త నిలవనివ్వవచ్చు, రద్దు చేయవచ్చు.
[14] ఆమె భర్త ప్రతి రోజూ మౌనంగా ఉంటే అతడు ఆమె మొక్కుబళ్ళన్నీ ఆమె మీద ఉన్న ఒట్టులన్నీ నిలిచేలా చేస్తున్నాడన్నమాట. వాటిని గురించి విన్నరోజు ఊరుకోవడంవల్ల వాటిని నిలవనిస్తున్నాడు.
[15] గాని అతడు విన్నరోజుగాక, తరువాత వాటిని ఖచ్చితంగా రద్దుచేస్తే అతడే ఆమె అపరాధం భరించాలి.”
[16] ఇవి భార్యాభర్తలను గురించీ బాల్యంలో తన తండ్రి ఇంట ఉన్న కూతురును గురించీ ఆమె తండ్రిని గురించీ యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన చట్టాలు.