Skip to content
Opens in a new window

[1] అప్పుడు బిలాం “ఇక్కడ నాకోసం ఏడు బలిపీఠాల్ని కట్టించు. ఇక్కడ ఏడు కోడెలూ ఏడు పొట్టేళ్ళూ నాకోసం సిద్ధం చెయ్యి” అని బాలాకుతో చెప్పాడు.

[2] బిలాం చెప్పినట్టే బాలాకు చేసిన తరువాత, బిలాం బాలాకు కలిసి ఒక్కొక్క బలిపీఠం మీద ఒక్కొక్క కోడెనూ పొట్టేలునూ అర్పించారు.

[3] బిలాం “మీ హోమం దగ్గర నిలబడండి. నేను వెళ్తాను. ఒకవేళ యెహోవా నా దగ్గరికి వస్తాడేమో. ఆయన నాకు వెల్లడి చేసేది మీకు తెలుపుతాను” అని బాలాకుతో చెప్పి చెట్లులేని ఒక కొండ ఎక్కాడు.

[4] అక్కడ దేవుడు బిలాంను సమీపించాడు. దేవునితో బిలాం “నేను ఏడు బలిపీఠాలు సిద్ధం చేసి ప్రతిదాని మీదా కోడెనూ పొట్టేలునూ అర్పించాన”న్నాడు.

[5] సందేశమొకటి బిలాం నోట ఉంచి యెహోవా “బాలాకు దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఈ మాటలు చెప్పు” అన్నాడు.

[6] బిలాం బాలాకు దగ్గరికి మళ్ళీ వెళ్ళినప్పుడు అతడు మోయాబు నాయకులందరితోకూడా తన హోమందగ్గర నిలబడి ఉన్నాడు.

[7] బిలాం కావ్య రూపంలో ఇలా పలికాడు: “బాలాకు ఆరాం నుంచీ, మోయాబురాజు తూర్పు పర్వత పంక్తినుంచీ నన్ను రప్పించాడు. ‘రండి! నా కోసం యాకోబు ప్రజను శపించండి. రండి! ఇస్రాయేల్ జనాన్ని నిందించండి’ అన్నాడు.

[8] దేవుడే శపించనివారిని నేనెలా శపించగలను? యెహోవా నిందించనివారిని నేనెలా నిందించగలను?

[9] ఎత్తయిన బండలనుంచి ఈ జనాన్ని చూస్తున్నాను. కొండలమీదనుంచి ఈ ప్రజను కనిపెడుతున్నాను. ఈ ప్రజ ప్రత్యేకంగా నివసిస్తుంది. తాను జనాలలో ఒక జనమని భావించుకోదు.

[10] యాకోబు జనం ధూళిరేణువులలాగా ఉంది – వారిని ఎవరు లెక్క పెట్టగలరు? ఇస్రాయేల్ ప్రజ నాలుగో భాగాన్ని ఎవరు లెక్క పెట్టగలరు? న్యాయవంతుల మరణం లాంటి మరణం నేను పొందాలి. నా అంత్యదశ వారి అంతం లాంటిది అవుతుంది గాక.

[11] అప్పుడు బాలాకు బిలాంతో “మీరు నాకేం చేశారు? నా శత్రువుల్ని శపించడానికి మిమ్మల్ని రప్పించాను. అయితే మీరు వారిని గొప్పగా దీవించారే!”

[12] అందుకు బిలాం “యెహోవా నానోట ఉంచే మాటలే నేను శ్రద్ధగా పలకాలి గదా!” అని జవాబిచ్చాడు.

[13] బాలాకు అతడితో అన్నాడు, “దయ ఉంచి వేరే చోటికి నాతో రండి. అక్కడ నుంచి కూడా మీరు వాళ్ళను చూడవచ్చు గాని అందరినీ కాదు. చివరగా ఉన్నవాళ్ళను మాత్రమే చూడగలరు. అక్కడ నుంచి వాళ్ళను నాకోసం శపించండి.”

[14] బాలాకు అతణ్ణి వెంటబెట్టుకొని పిస్గా పర్వత శిఖరం మీద ఉన్న “కావలివాళ్ళ” పొలానికి వెళ్ళాడు. అక్కడ కూడా ఏడు బలిపీఠాలను కట్టించి ప్రతిదాని మీదా కోడెనూ పొట్టేలునూ అర్పించాడు.

[15] బిలాం బాలాకుతో “మీరు ఇక్కడే మీ హోమం దగ్గర నిలబడండి. నేను అక్కడ యెహోవాను కలుసుకోవడానికి వెళ్తాను” అన్నాడు.

[16] యెహోవా బిలాంను సమీపించి అతడి నోట సందేశం ఉంచి, “బాలాకు దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఈ మాటలు చెప్పు” అన్నాడు.

[17] అతడు బాలాకు దగ్గరికి వచ్చినప్పుడు బాలాకు మోయాబు నాయకులతోకూడా తన హోమం దగ్గర నిలబడి ఉన్నాడు. బాలాకు “యెహోవా ఏం చెప్పాడు?” అని బిలాంను అడిగితే బిలాం కావ్యరూపంలో ఇలా పలికాడు:

[18] “బాలాకు! లేచి విను! సిప్పోరు కుమారా! నేను చెప్పేది ఆలకించు!

[19] దేవుడు మానవుడు కాడు – ఆయన అబద్ధమాడడు. మనసు మార్చుకోవడానికి ఆయన మానవుడేమీ కాడు. ఆయన ఏదైనా చెప్పి చేయకుండా ఉంటాడా? ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా?

[20] ఇదిగో విను. దీవించమని నాకు ఆజ్ఞ వచ్చింది. ఆయన దీవించినతరువాత నేను దాన్ని కొట్టివేయలేను.

[21] ఆయన యాకోబు ప్రజలో చెడుగును చూడలేదు, ఇస్రాయేల్ జనంలో తుంటరితనాన్ని కనిపెట్టలేదు. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. రాజు చేసే జయధ్వని వారి మధ్య ఉంది.

[22] దేవుడు ఈజిప్ట్ నుంచి వారిని తీసుకువచ్చాడు. గురుపోతు బలంలాంటి బలం ఆయన వారికిచ్చాడు.

[23] యాకోబు జనానికి విరోధంగా ఏ మంత్రమూ లేదు. ఇస్రాయేల్ ప్రజలకు విరోధమైన శకునం లేదు. దేవుడు చెయ్యబోయేది సరైన సమయాల్లో యాకోబు వంశస్థులైన ఇస్రాయేల్ ప్రజలకు తెలుపబడుతుంది.

[24] ఇదుగో, ఆ జనం ఆడసింహంలాగా లేస్తుంది, అది సింహంలాగా బలంతో నిలబడుతుంది. అది వేటాడి పట్టిన దానిని తిని చంపినదాని రక్తం త్రాగేవరకు మళ్ళీ పడుకోదు”.

[25] అప్పుడు బాలాకు “మీరు వాళ్ళను శపించడం లేదు. పోనీ, గాని వాళ్ళను దీవించకూడదు!” అని బిలాంతో చెప్పాడు.

[26] బిలాం బాలాకుకు “యెహోవా చెప్పినట్టే నేను అంతా చెయ్యాలని నీతో చెప్పాను గదా” అని జవాబిచ్చాడు.

[27] అందుకు బాలాకు బిలాంతో “రండి! నేను మిమ్మల్ని వేరే చోటికి తీసుకువెళ్తాను. అక్కడనుంచి నాకోసం మీరు వాళ్ళను శపించడం దేవునికి నచ్చుతుందేమో” అన్నాడు.

[28] బాలాకు ఎడారికి ఎదురుగా ఉన్న పెయోర్ పర్వత శిఖరానికి బిలాంను వెంటబెట్టుకొనిపోయాడు.

[29] అప్పుడు బిలాం బాలాకుతో “ఇక్కడ నాకోసం ఏడు బలిపీఠాలను కట్టించి ఏడు కోడెలనూ ఏడు పొట్టేళ్ళనూ నాకోసం సిద్ధం చెయ్యి” అన్నాడు.

[30] బిలాం చెప్పినట్టే బాలాకు చేసి ప్రతి బలిపీఠం మీదా కోడెనూ పొట్టేలునూ అర్పించాడు.

సంఖ్యాకాండం (ఎడారి ప్రయాణాలు) — Chapters