[1] యెహోవా మోషేతో ఇలా అన్నాడు:
[2] “నీవు ఇస్రాయేల్‌ప్రజలతో మాట్లాడి, వారి పూర్వీకుల వంశాల ప్రకారం వారిదగ్గర పన్నెండు చేతికర్రలను తీసుకో. ప్రతి గోత్రనాయకుడి దగ్గర ఒక కర్రను తీసుకోవాలన్నమాట. ఎవడి కర్రమీద వాడి పేరు వ్రాయి.
[3] లేవీ కర్రమీద అహరోను పేరు వ్రాయి. పూర్వీకుల వంశాల నాయకులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్ర ఉండాలి.
[4] నీవు ఆ కర్రలను తీసుకుపోయి సన్నిధిగుడారంలో నేను మిమ్ములను కలుసుకొనేశాసనాల పెట్టె ఎదుట వాటిని ఉంచాలి.
[5] అప్పుడు నేను ఎవణ్ణి ఎన్నుకొంటానో అతడి కర్ర చిగురిస్తుంది. మీకు విరోధంగా సణుగుతూ ఉన్న ఇస్రాయేల్ ప్రజల సణుగులు నాకు వినిపించకుండా చేస్తాను.”
[6] మోషే ఇస్రాయేల్‌ప్రజలతో మాట్లాడినప్పుడు వారి నాయకులలో ఒక్కొక్కరు ఒక్కొక్క కర్ర అతడికిచ్చారు. వారి పూర్వీకుల వంశాలప్రకారం మొత్తం పన్నెండు కర్రలిచ్చారు. అహరోను కర్ర వారి కర్రలతోకూడా ఉంది.
[7] మోషే ఆ కర్రలను శాసనాల గుడారంలో యెహోవా ఎదుట ఉంచాడు.
[8] మరుసటి రోజు మోషే శాసనాల గుడారంలోకి వెళ్ళి చూశాడు. చిగురించిన కర్ర లేవీ వంశానికి చెందిన అహరోను కర్రే. అంతేగాక, అది మొగ్గలు వేసి పూలు పూసి బాదంపండ్లు కాసి ఉంది.
[9] యెహోవా సన్నిధానంలోనుంచి మోషే ఆ కర్రలన్నీ ఇస్రాయేల్ ప్రజలదగ్గరికి తీసుకువచ్చాడు. వారు వాటిని చూచి ఒక్కొక్కరు ఎవరి కర్రను వారు తీసుకొన్నారు.
[10] అప్పుడు యెహోవా మోషేతో అన్నాడు, “అహరోను కర్రను శాసనాల ఎదుట మళ్ళీ పెట్టు. తిరగబడ్డ వారి విషయం అది సూచకంగా ఉండేలా దాన్ని అక్కడ ఉంచాలి. వారు చావకుండేలా నాకు విరోధంగా ఉన్న వారి సణుగులను ఈ విధంగా మాన్పించాలి.”
[11] మోషే అలా చేశాడు. యెహోవా ఆజ్ఞ ప్రకారమే మోషే చేశాడు.
[12] తరువాత ఇస్రాయేల్ ప్రజలు మోషేతో అన్నారు, “ఇదుగో గతించిపోయాం! గతించిపోయాం! మేమంతా గతించిపోయాం!
[13] యెహోవా నివాసం దగ్గరికి ఎవడైనా వస్తే అతడు చస్తాడు. మేమందరమూ చచ్చిపోవాలా?”