Skip to content
Opens in a new window

[1] యెహోవా మోషే అహరోనులతో ఇలా అన్నాడు:

[2] “యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర శాసనం ఇది. ఇస్రాయేల్ ప్రజలు ఎర్రని ఆవు పెయ్యను మీదగ్గరికి తేవాలని వారితో చెప్పు. అది లోపమూ మచ్చా లేనిదై ఎప్పుడూ కాడిక్రిందికి రానిదై ఉండాలి.

[3] మీరు దానిని యాజి అయిన ఎలియాజరుకు అప్పగించాలి. ఒకడు దానిని శిబిరం వెలుపలికి తోలుకుపోయి ఎలియాజరు ఎదుట దానిని వధించాలి.

[4] ఎలియాజరుయాజి దాని రక్తంలో కొంత వ్రేలితో తీసి సన్నిధిగుడారంవైపు ఆ రక్తం ఏడుసార్లు చిలకరించాలి.

[5] అతడి కళ్ళెదుట ఆ మనిషి ఆ ఆవు పెయ్యను కాల్చివేయాలి. దాని చర్మాన్నీ మాంసాన్నీ రక్తాన్నీ పేడనూ కాల్చివేయాలి.

[6] అప్పుడు యాజి దేవదారుకర్రనూ హిస్సోపు రెమ్మనూ ఎర్రని దారాన్నీ తీసుకొని ఆ పెయ్యను కాలుస్తున్న మంటల్లో వేయాలి.

[7] అప్పుడు యాజి తన బట్టలు ఉతుక్కొని నీళ్ళతో స్నానం చేయాలి. తరువాత అతడు శిబిరంలో ప్రవేశించవచ్చు, గాని సాయంకాలం దాకా అశుద్ధంగా ఉంటాడు.

[8] ఆ పెయ్యను కాల్చినవాడు తన బట్టలు ఉతుక్కొని స్నానం చెయ్యాలి. అతడు సాయంకాలంవరకు అశుద్ధంగా ఉంటాడు.

[9] శుద్ధంగా ఉన్నవాడు ఆ ఆవు పెయ్య బూడిదను పోగు చేసి శిబిరం బయట శుద్ధమైనచోట ఉంచాలి. దానిని ఇస్రాయేల్ ప్రజలకోసం అపవిత్రాన్ని తొలగించే నీళ్ళకోసం భద్రం చేయాలి. ఆ పెయ్య పాపాలకోసం బలి.

[10] ఆ పెయ్య బూడిదను పోగు చేసినవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. అతడు సాయంకాలంవరకు అశుద్ధంగా ఉంటాడు. ఈ చట్టం ఇస్రాయేల్ ప్రజలకూ వారిలో నివసించే విదేశీయులకూ ఎల్లకాలం నిలిచి ఉంటుంది.

[11] “ఎవరైనా ఏ మనిషి శవాన్నైనా తాకితే ఆ వ్యక్తి ఏడు రోజులు అశుద్ధంగా ఉంటాడు.

[12] అతడు మూడో రోజున, ఏడో రోజున ఆ నీళ్ళతో తనను శుద్ధి చేసుకోవాలి. అప్పుడతడు పవిత్రంగా ఉంటాడు. మూడో రోజున, ఏడో రోజున తనను శుద్ధి చేసుకోకపోతే అతడు శుద్ధంగా ఉండడు.

[13] ఎవరైనా సరే ఏ మనిషి శవాన్నైనా తాకి తనను శుద్ధి చేసుకోకపోతే ఆ వ్యక్తి యెహోవా నివాసాన్ని అశుద్ధం చేస్తున్నాడన్నమాట. అతణ్ణి ఇస్రాయేల్ ప్రజలలో లేకుండా చేయాలి. అశుద్ధతను తొలగించే నీళ్ళు అతడిమీద చిలకరించడం జరగలేదు, గనుక అతడు అశుద్ధంగా ఉంటాడు. అతడి అశుద్ధత అతడిమీద నిలిచి ఉంటుంది.

[14] “ఎవరైనా గుడారంలో చనిపోతే దాన్ని గురించిన చట్టం ఇది: ఆ గుడారంలో ప్రవేశించే ప్రతి ఒక్కరూ ఏడురోజులు అశుద్ధంగా ఉంటారు, గుడారంలో ఉన్న ప్రతిదీ ఏడు రోజులు అశుద్ధంగా ఉంటుంది.

[15] మూత కప్పివేసి ఉండని ప్రతి పాత్రా కూడా అశుద్ధంగా ఉంటుంది.

[16] పచ్చిక మైదానాలలో ఖడ్గంచేత హతమైనవాణ్ణి గానీ తనంతట తానే చనిపోయినవాణ్ణి గానీ మనిషి ఎముకను గానీ గోరీని గానీ ఎవరైనా తాకితే అతడు ఏడు రోజులు అశుద్ధంగా ఉంటాడు.

[17] అలాంటి వ్యక్తికోసం వారు పాపాలకోసమైన హోమబలి బూడిద కొంత పాత్రలో వేసి ఆ బూడిదమీద పారే నీళ్ళు పోయాలి.

[18] అప్పుడు శుద్ధంగా ఉన్న వాడెవడైనా హిస్సోపు రెమ్మను చేతపట్టుకొని ఆ నీళ్ళలో ముంచి ఆ గుడారంమీదా దానిలోని సామానంతటిమీదా దానిలో ఉన్న మనుషులమీదా నీళ్ళు చిలకరించాలి, ఎముక గానీ హతమైనవాణ్ణిగానీ తనంతట తానే చనిపోయినవాణ్ణి గానీ గోరీని గానీ తాకినవాడిమీద కూడా ఆ నీళ్ళు చల్లాలి.

[19] శుద్ధంగా ఉన్న ఆ మనిషి అశుద్ధంగా ఉన్న ఆ వ్యక్తిమీద మూడో రోజున ఏడో రోజున దాన్ని చల్లాలి. ఏడోరోజున అతడు ఆ వ్యక్తిని శుద్ధి చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని స్నానం చేయాలి. ఆ సాయంకాల సమయంలో అతడు పవిత్రం అవుతాడు.

[20] అశుద్ధంగా ఉన్న వాడెవడైనా తనను శుద్ధి చేసుకోకపోతే యెహోవా పవిత్రస్థానాన్ని అశుద్ధం చేసినట్టే. అతణ్ణి సమాజంలో లేకుండా చేయాలి. అశుద్ధతను తొలగించే జలం అతడిమీద చిలకరించడం జరగలేదు, గనుక అతడు అశుద్ధంగానే ఉంటాడు.

[21] ఇది వారికి ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం. అశుద్ధతను తొలగించే నీళ్ళు చిలకరించేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. ఆ జలం తాకినవాడు సాయంకాలంవరకు అశుద్ధంగా ఉంటాడు.

[22] అశుద్ధంగా ఉన్నవాడు తాకిన ప్రతిదీ అశుద్ధమౌతుంది. అతణ్ణి తాకినవాడెవడైనా సాయంకాలంవరకు అశుద్ధంగా ఉంటాడు.”

సంఖ్యాకాండం (ఎడారి ప్రయాణాలు) — Chapters