[1] అంతకుముందు మోషే కూషు జాతి స్త్రీని పెళ్ళి చేసుకొన్నాడు. అతడు వివాహమాడిన ఆ స్త్రీ విషయం మిర్యాం, అహరోను అతడికి విరోధంగా మాట్లాడారు.
[2] “యెహోవా మాట్లాడించినది మోషేచేత మాత్రమేనా? మా చేత కూడా మాట్లాడించలేదా”? అన్నారు. వారు అన్నది యెహోవా విన్నాడు.
[3] (మోషే లోకనివాసులందరిలో చాలా సాధువైన మనిషి).
[4] ఉన్నట్టుండి యెహోవా మోషేతో, మిర్యాం అహరోనులతో “మీరు ముగ్గురూ సన్నిధిగుడారం దగ్గరికి రండి” అని చెప్పాడు.
[5] వారు అక్కడికి వచ్చిన తరువాత యెహోవా మేఘస్తంభంలో దిగివచ్చి గుడారం ద్వారందగ్గర నిలిచి అహరోను మిర్యాంలను పిలిచాడు. వారిద్దరూ ముందుకు వచ్చాక యెహోవా ఇలా అన్నాడు:
[6] “నేను చెప్పేది వినండి. మీ మధ్య యెహోవాయొక్క ప్రవక్త ఎవరైనా ఉంటే, అతడికి నేను దర్శనంలో నన్ను వెల్లడి చేసుకొంటాను. కలలో అతడితో మాట్లాడుతాను.
[7] నా సేవకుడైన మోషేతో అలా కాదు. అతడు నా ఇంటి విషయాలన్నిటిలో నమ్మకంగా ఉన్నాడు.
[8] నేను అతడితో ముఖాముఖిగా మాట్లాడుతాను; గూఢంగా కాదు, స్పష్టంగానే మాట్లాడుతాను. అతడు యెహోవా ఆకారాన్ని చూచేవాడు. అలాంటప్పుడు నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదు?”
[9] యెహోవా కోపాగ్ని వారిమీద రగులుకొంది
[10] యెహోవా వెళ్లిపోయాడు. అయితే మేఘం గుడారంమీదనుంచి పైకెక్కిపోగానే మిర్యాం చర్మవ్యాధితో హిమమంత తెల్లగా కనిపించింది. అహరోను మిర్యాంవైపు మళ్ళుకొని చూశాడు. ఆమెకు చర్మవ్యాధి ఉంది.
[11] అహరోను మోషేతో, “అయ్యో, స్వామీ, మేము తెలివితక్కువగా ప్రవర్తించి తప్పిదం చేశాం. అయినా ఈ దోషశిక్ష మామీద పెట్టకు.
[12] తల్లి గర్భంలోనుంచి జీవం లేకుండా పుట్టి సగంమట్టుకు తినివేసిన శరీరమున్న శిశువులాగా ఆమెను ఉండనియ్యకు” అన్నాడు.
[13] మోషే యెహోవాకు మొరపెట్టి “దేవా, దయ ఉంచి ఈమెను బాగు చెయ్యి!” అన్నాడు.
[14] యెహోవా మోషేతో, “ఆమె తండ్రి ఆమె ముఖంమీద ఉమ్మివేసినా ఆమె ఏడు రోజులు సిగ్గుపడుతూ ఉండాలి. ఇప్పుడు ఆమెను శిబిరం బయట ఏడు రోజులు ఉంచాలి. ఆ తరువాత ఆమెను లోపలికి మళ్ళీ చేర్చవచ్చు” అని జవాబిచ్చాడు.
[15] గనుక మిర్యాం శిబిరం బయట ఏడు రోజులు గడిపింది. ఆమె లోపలికి మళ్ళీ చేరేవరకు ప్రజలు ప్రయాణంలో ముందుకు సాగలేదు.
[16] ఆ తరువాత వారు హజేరోతును విడిచివెళ్ళి పారాను ఎడారిలో దిగారు.