Skip to content
Opens in a new window

[1] యెహోవా మోషేతో ఇలా అన్నాడు:

[2] “నీవు ఇస్రాయేల్‌ ప్రజలకు ఈ విధంగా ఆజ్ఞాపించు: నాకు పరిమళ హోమంగా ఉండే నా ఆహార అర్పణలను నియామక కాలంలో నాకు అర్పించడానికి మీరు జాగ్రత్తగా ఉండాలి.

[3] నీవు వారితో ఇంకా ఇలా చెప్పాలి: మీరు యెహోవాకు అర్పించవలసిన హోమం ఇదే: లోపం లేని రెండు ఏడాది మగ గొర్రెపిల్లలు. అలాంటివాటిని ప్రతి రోజూ హోమబలిగా అర్పించాలి.

[4] వాటిలో ఒక గొర్రెపిల్లను ప్రొద్దున అర్పించాలి. రెండో దానిని సందెవేళ అర్పించాలి.

[5] దంచి తీసిన లీటర్ నూనెతో కలిపిన ఒక కిలోగ్రాం మెత్తని గోధుమపిండిని కూడా నైవేద్యంగా అర్పించాలి.

[6] అది యెహోవాకు పరిమళహోమం. ఆయన సీనాయి పర్వతంమీద నియమించిన నిత్యమైన హోమబలి.

[7] ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పించవలసిన పానార్పణ ఒక లీటరు పులిసిన రసం. పవిత్ర స్థానంలో దాన్ని పానార్పణంగా యెహోవాకు పోయాలి.

[8] ఆ రెండో గొర్రెపిల్లను సందెవేళ అర్పించాలి. ప్రొద్దున అర్పించినట్టే దానితో నైవేద్యం, పానార్పణం అర్పించాలి. అది యెహోవాకు పరిమళ హోమం.

[9] “విశ్రాంతి రోజుల్లో లోపం లేని రెండు ఏడాది మగ గొర్రెపిల్లలను అర్పించాలి. వాటితో పాటు నైవేద్యంగా నూనెతో కలిపిన రెండు కిలోగ్రాముల గోధుమపిండినీ ఆ నైవేద్యానికి చెందిన పానార్పణనూ తేవాలి.

[10] నిత్యమైన హోమబలి, దాని పానార్పణం గాక, ఇది ప్రతి విశ్రాంతి రోజున చేయవలసిన హోమబలి.

[11] “ప్రతి నెల మొదటి రోజున యెహోవాకు హోమబలి అర్పించాలి. అర్పించవలసినవి – రెండు కోడెలూ ఒక పొట్టేలూ లోపం లేని ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలూ.

[12] నైవేద్యంగా ప్రతి కోడెతోపాటు నూనె కలిపిన మూడు కిలోగ్రాముల గోధుమ పిండి, ప్రతి పొట్టేలుతోపాటు నూనె కలిపిన రెండు కిలోగ్రాముల గోధుమపిండి,

[13] ప్రతి గొర్రెపిల్లతోపాటు నూనె కలిపిన ఒక కిలోగ్రాం గోధుమపిండి. అది యెహోవాకు పరిమళహోమం, మంటల్లో అర్పణ.

[14] వాటితో అర్పించవలసిన పానార్పణలు – కోడెతో రెండు లీటర్ల ద్రాక్షరసం, పొట్టేలుతో లీటరున్నర ద్రాక్షరసం, గొర్రెపిల్లతో ఒక లీటర్ ద్రాక్షరసం. సంవత్సరంలో ప్రతి నెల మొదటి రోజున జరగవలసిన హోమం ఇది.

[15] నిత్యమైన హోమబలి, దాని పానార్పణం గాక, పాపాలకోసం బలిగా ఒక మేకపోతును యెహోవాకు అర్పించాలి.

[16] “మొదటి నెల పద్నాలుగో రోజు యెహోవాకు పస్కాపండుగ.

[17] ఆ నెల పదిహేనో రోజున పండుగ జరుగుతుంది. పొంగజేసే పదార్థం వేయకుండా చేసిన రొట్టెలు ఏడు రోజులు తినాలి.

[18] మొదటి రోజున పవిత్ర సభగా సమకూడాలి. అప్పుడు బ్రతుకుదెరువు కోసం ఏ పనీ చేయకూడదు.

[19] యెహోవాకు హోమబలిగా రెండు కోడెలనూ ఒక పొట్టేలునూ ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలనూ అర్పించాలి. అవి లోపం లేనివై ఉండాలి.

[20] వాటి నైవేద్యాలు నూనెతో కలిపిన గోధుమ పిండి. కోడెతోపాటు మూడు కిలోగ్రాముల పిండిని, పొట్టేలుతో రెండు కిలోగ్రాముల పిండిని,

[21] ప్రతి గొర్రెపిల్లతో ఒక కిలోగ్రాం పిండిని అర్పించాలి.

[22] అంతే కాకుండా మీ పాపాలను కప్పివేయడానికి పాపాలకోసమైన బలిగా మేకపోతును అర్పించాలి.

[23] ప్రొద్దున మీరు అర్పించవలసిన నిత్యమైన హోమబలి గాక వీటిని కూడా అర్పించాలి.

[24] ఈ విధంగానే ఆ ఏడు రోజుల్లో ప్రతిరోజూ యెహోవాకు పరిమళహోమంగా అర్పణ ఆహారాన్ని అర్పించాలి. నిత్యమైన హోమబలి, దాని పానార్పణం గాక దానిని కూడా అర్పించాలి.

[25] ఆ రోజుల్లో ఏడో రోజున పవిత్ర సభగా సమకూడాలి. ఆ రోజున మీరు బ్రతుకుదెరువుకోసం ఏ పనీ చేయకూడదు.

[26] “మీరు ‘వారాల’ పండుగలో యెహోవాకు కొత్త నైవేద్యం తెచ్చేటప్పుడు, ప్రథమ ఫలాలను అర్పించే రోజున, పవిత్ర సభగా సమకూడాలి. ఆరోజు మీరు బ్రతుకుదెరువుకోసం ఏ పనీ చెయ్యకూడదు.

[27] యెహోవాకు పరిమళహోమంగా మీరు రెండుకోడెలనూ ఒక పొట్టేలునూ ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలనూ అర్పించాలి.

[28] నూనెతో కలిపిన గోధుమపిండి నైవేద్యాలను కూడా అర్పించాలి. ప్రతి కోడెతోపాటు మూడు కిలోగ్రాముల పిండి, పొట్టేలుతోపాటు రెండు కిలోగ్రాముల పిండి,

[29] ఆ ఏడు గొర్రెపిల్లల్లో ప్రతిదానితోపాటు ఒక కిలోగ్రాం పిండి అర్పించాలి.

[30] అంతేగాక, మీ పాపాలను కప్పివేయడానికి ఒక మేకపోతును కూడా అర్పించాలి.

[31] నిత్యమైన హోమబలి, దాని నైవేద్యం గాక మీరు వాటిని, వాటి పానార్పణలతోపాటు అర్పించాలి. జంతువులు ఏ లోపం లేనివై ఉండాలి.”

సంఖ్యాకాండం (ఎడారి ప్రయాణాలు) — Chapters