Skip to content
Opens in a new window

[1] ఇస్రాయేల్ ప్రజలు తమ కష్టాల విషయం యెహోవా సముఖంలో సణిగారు. అది విన్నప్పుడు యెహోవా కోపాగ్ని రగులుకొంది. యెహోవా సన్నిధానంనుంచి మంటలు బయలుదేరి వారి మధ్య మండుతూ ఉన్నాయి, వారి శిబిరంలో ఒక కొనను కాల్చివేస్తూ ఉన్నాయి.

[2] ప్రజలు మోషేకు మొరపెట్టారు. మోషే యెహోవాను వేడుకొన్నప్పుడు మంటలు చల్లారిపోయాయి.

[3] యెహోవా పంపిన అగ్ని తమ మధ్య రగులుకొన్నందుకు ఆ చోటికి తబేరా అనే పేరు పెట్టారు.

[4] ప్రజలలో ఉన్న అల్లరిమూకకు పేరాశ చెలరేగింది. ఇస్రాయేల్‌వారు కూడా ఏడుస్తూ “మాకెవరు మాంసం పెడతారు?

[5] ఈజిప్ట్‌లో ఉచితంగా దొరికిన చేపలు తిన్నాం. దోసకాయలూ కర్బూజ పండ్లూ ఉల్లిపాయలూ ఇంకా వేరే కూర మొక్కలూ వెల్లుల్లిపాయలూ తిన్నాం. మాకు బాగా జ్ఞాపకం ఉంది.

[6] ఇప్పుడైతే మేము నీరసించిపోతున్నాం. తినడానికి ఈ మన్నా మాత్రమే కనిపిస్తున్నది. ఇంకేం లేదు” అన్నారు.

[7] (మన్నా ధనియాలలాగా ఉండేది. చూపుకు గుగ్గిలం లాంటిది.

[8] ప్రజలు తిరుగుతూ దానిని సేకరించారు. తిరగటిలో విసిరి, లేక రోట్లో దంచి కుండలో ఉడకబెట్టిన తరువాత దానితో రొట్టెలు చేశారు. దాని రుచి నూనెతో కలిపిన అప్పడాల రుచిలాంటిది.

[9] రాత్రివేళ శిబిరంలో మంచు కురిసినప్పుడు మన్నా దాని వెంటనే పడేది).

[10] ప్రజలంతా తమ కుటుంబాలతోపాటు తమ తమ డేరాల ద్వారాలదగ్గర ఏడుస్తూ ఉండడం మోషేకు వినిపించింది. యెహోవా కోపాగ్ని తీవ్రంగా రగులుకొంది. గనుక మోషే నొచ్చుకొన్నాడు.

[11] అందుచేత మోషే యెహోవాతో ఇలా అన్నాడు: “నీవు నీ సేవకుడైన నాపట్ల కఠోరంగా వ్యవహరించావెందుకు? నన్ను దయ చూడకుండా ఈ ప్రజలందరి భారం నామీద పెట్టావెందుకు?

[12] నేను ఈ ప్రజల తల్లినా? వారిని కన్నది నేనా? నీవు నాతో అంటున్నావు గదా– ‘పాలిచ్చే దాది చంటిబిడ్డను ఎత్తుకొన్నట్టు వీరిని ఎత్తుకో. నేను వారి పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి వీరిని నీ రొమ్మున తీసుకుపో’.

[13] ఈ ప్రజలంతా నన్ను చూచి ఏడుస్తూ, ‘తినడానికి మాకు మాంసం ఇవ్వు’ అంటున్నారు. వారికి ఇవ్వడానికి మాంసం నాకెక్కడిది?

[14] నేను ఒక్కణ్ణే. ఈ ప్రజలందరినీ భరించలేను. ఈ భారం నా శక్తికి మించినది.

[15] నీవు ఈ విధంగా నాపట్ల వ్యవహరించదలిస్తే నన్ను చంపెయ్యి. నన్ను దయ చూస్తే నేను నా దురవస్థను చూడకుండేలా నన్ను చంపి తీరాలి.”

[16] అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఇస్రాయేల్ ప్రజల పెద్దలలోనుంచి డెబ్భైమందిని నా దగ్గరికి సమకూర్చు. వారు ప్రజల పెద్దలనీ నాయకులనీ నీకు తెలిసినవారై ఉండాలి. వారిని సన్నిధిగుడారం దగ్గరికి తోడుకురా. అక్కడ వారు నీతో కూడా నిలబడాలి.

[17] నేను దిగివచ్చి అక్కడ నీతో మాట్లాడుతాను. ఆ పెద్దలను నీమీద ఉన్న ఆత్మలో పాలిభాగస్తులను చేస్తాను. ప్రజల భారం నీవొక్కడివే మోయకుండా దానిని వారు నీతో కూడా భరిస్తారు.

[18] నీవు ప్రజలతో ఈ విధంగా చెప్పు: మిమ్ములను మీరు రేపటికి పవిత్రం చేసుకోండి. అప్పుడు మీరు మాంసం తింటారు. యెహోవా సన్నిధానంలో మీరు ఏడుస్తూ ‘మాకెవరు మాంసం పెడతారు? ఈజిప్ట్‌లో మా పరిస్థితులు బాగున్నాయి’ అన్నారు. యెహోవా మీకు మాంసమిస్తాడు. మీరు దాన్ని తింటారు.

[19] ఒకే రోజు కాదు, రెండు రోజులు కాదు, ఐదు రోజులు కాదు, పది రోజులు కాదు, ఇరవై రోజులు కాదు –

[20] పూర్తిగా నెల రోజులు మాంసం తింటారు. అది మీ ముక్కుపుటాల్లోనుంచి వచ్చేవరకూ, మీకు వెగటు అనిపించేవరకూ మాంసం తింటారు. ఎందుకని? మీ మధ్య ఉన్న యెహోవాను మీరు నిరాకరించి ఆయన సన్నిధానంలో ఏడ్చి, ‘ఈజిప్ట్‌నుంచి ఎందుకు వచ్చేశాం’ అని చెప్పుకొన్నారు గనుక.”

[21] అందుకు మోషే ఇలా అన్నాడు: “నా చుట్టూరా ఉన్న పాదచారులే ఆరు లక్షలమంది. అయినా వారు నెల రోజులు తినడానికి మాంసం వారికిస్తానన్నావేం!

[22] వారికి చాలినన్ని గొర్రెలనూ మేకలనూ పశువులనూ ఎలా వధించగలం? సముద్రంలోని చేపలన్నీ పట్టినా వారికి చాలుతాయా?”

[23] యెహోవా మోషేకిచ్చిన జవాబు ఇది: “యెహోవా బాహుబలానికి పరిమితి ఉందా? నా మాట నీపట్ల నెరవేరుతుందో లేదో ఇప్పుడే చూస్తావు”.

[24] మోషే బయటికి వెళ్ళి యెహోవా మాటలు ప్రజలకు తెలియజేశాడు. ప్రజల పెద్దలలోనుంచి డెబ్భైమందిని సమకూర్చి దేవుని గుడారం చుట్టూరా నిలబెట్టాడు.

[25] అప్పుడు యెహోవా తన మేఘంలో దిగివచ్చి మోషేతో మాట్లాడాడు. మోషే మీద ఉన్న ఆత్మలో ఆ పెద్దలను పాలిభాగస్తులను చేశాడు. ఆ ఆత్మ వారిమీద నిలిచినప్పుడు వారు దేవుని మూలంగా పలికారు గాని తరువాత వారలా పలకలేదు.

[26] ఆ పెద్దలలో ఇద్దరు శిబిరంలో ఉండిపోయారు. వారి పేర్లు ఎల్దాదు, మేదాదు. వారు కూడా పెద్దల జాబితాలో నమోదైనవారే గాని దేవుని గుడారందగ్గరికి వారు వెళ్ళలేదు. ఆత్మ వారిమీద కూడా నిలిచినప్పుడు వారు శిబిరంలోనే దేవునిమూలంగా పలికారు.

[27] ఒక యువకుడు మోషేదగ్గరికి పరుగెత్తి వచ్చి, “ఎల్దాదు, మేదాదు శిబిరంలో దేవునిమూలంగా పలుకుతున్నారు” అని చెప్పాడు.

[28] నూను కొడుకు యెహోషువ చిన్నతనంనుంచీ మోషేకు పరిచర్య చేసేవాడు. అతడు “మోషే, స్వామీ, వారిని అలా చేయవద్దను” అన్నాడు.

[29] అందుకు మోషే “నాకోసం నీకు రోషం వచ్చిందా? యెహోవా ప్రజలందరూ ప్రవక్తలైతే, యెహోవా తన ఆత్మను వారందరిమీదా ఉంచితే ఎంత బాగుండేది!” అన్నాడు.

[30] అప్పుడు మోషే, ఇస్రాయేల్ ప్రజల పెద్దలు శిబిరంలోకి వెళ్ళారు.

[31] యెహోవా సన్నిధానంనుంచి గాలి బయలుదేరి సముద్రంవైపునుంచి పూరేడుపిట్టలను రప్పించి శిబిరం చుట్టూరా వాటిని పడవేసింది. శిబిరానికి ఇరువైపుల, రోజు ప్రయాణమంత దూరం వరకు, భూమిమీద రెండు మూరల ఎత్తుగా అవి కూలాయి.

[32] ప్రజలు లేచి ఆ రోజంతా ఆ రాత్రంతా మరుసటి రోజంతా ఆ పూరేడు పిట్టలను సేకరిస్తూ ఉన్నారు. తక్కువ సేకరించినవాడు సహితం నూరు తూముల పిట్లనుసేకరించాడు. తరువాత వారు తమ కోసం శిబిరం చుట్టూరా వాటిని పరిచారు.

[33] అయితే ఆ మాంసం ఇంకా వారి పళ్ళ సందులలో ఉండగానే, అది నమిలేముందే, యెహోవా కోపాగ్ని ప్రజలమీద రగులుకొంది. యెహోవా వారిమధ్యకు భయంకరమైన అంటురోగాన్ని పంపి వారిని బాధించాడు.

[34] పేరాశకు లోనైనవారి శవాలను ప్రజలు అక్కడ పాతిపెట్టారు. అందుకే ఆ స్థలానికి కిబ్రోత్‌హత్తావా అనే పేరు వచ్చింది.

[35] ప్రజలు కిబ్రోత్‌హత్తావానుంచి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతులో ఉండిపోయారు.

సంఖ్యాకాండం (ఎడారి ప్రయాణాలు) — Chapters