Skip to content
Opens in a new window

[1] యెహోవా మోషేతో ఇంకా అన్నాడు:

[2] “నీవు సాగగొట్టిన వెండితో రెండు బూరలు చేయించు. సమాజాన్ని సమకూర్చడానికి సేనలు బయలుదేరేలా చేయడానికీ వాటిని వినియోగించాలి.

[3] రెండు బూరల ధ్వని వినిపించే టప్పుడు సమాజమంతా సన్నిధిగుడారం ద్వారం ఎదుట నీ దగ్గర సమకూడాలి.

[4] ఒకే బూర ఊదితే నాయకులు – ఇస్రాయేల్ గోత్రాల అధిపతులు – మాత్రమే నీ దగ్గర సమకూడాలి.

[5] ఆపద సూచకంగా బూర పదే పదే గట్టిగా ఊదితే తూర్పు దిక్కున దిగిన శిబిరాలవారు బయలుదేరాలి.

[6] రెండోసారి కూడా అలా ఊదితే దక్షిణ దిక్కున దిగిన శిబిరాలవారు బయలు దేరాలి. వారి ప్రయాణాల కోసం అలా ఊదాలి.

[7] సమాజాన్ని సమకూర్చడానికి బూర ఊదాలి గాని అలా పదే పదే ఊదకూడదు.

[8] ఆ బూరలు ఊదవలసినది అహరోను కొడుకులైన యాజులు. మీ తరతరాలకు ఇది ఎప్పటికీ నిలిచి ఉండే చట్టం.

[9] మీ దేశంలో మీ పై బడే శత్రువులతో యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఆ బూరలు పదేపదే గట్టిగా ఊదాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ విషయం ఆలోచన చేస్తాడు, మీ శత్రువుల బారినుంచి మిమ్ములను రక్షిస్తాడు.

[10] మహోత్సవకాలాలలో, నియామక కాలాలలో, నెలల ఆరంభంలో మీరు హోమాలూ శాంతిబలులూ సమర్పించేటప్పుడు ఆ బూరలు ఊదాలి. అప్పుడవి మీ దేవుని సన్నిధానంలో మీ కోసం స్మృతిచిహ్నంగా ఉంటాయి. నేను యెహోవాను, మీ దేవుణ్ణి”.

[11] రెండో సంవత్సరం రెండో నెల ఇరవైయో రోజున మేఘాన్ని శాసనాల దైవనివాసం మీదనుంచి పైకెత్తడం జరిగింది.

[12] అప్పుడు ఇస్రాయేల్ ప్రజలు సీనాయి ఎడారి నుండి ప్రయాణాలు చేయసాగారు. తరువాత మేఘం పారాన్ ఎడారిలో నిలిచింది.

[13] మోషే ద్వారా యెహోవా ఇచ్చిన మాట ప్రకారం వారు ఆ మొదటి ప్రయాణం చేశారు.

[14] ముందు తరలివెళ్ళిన వారు యూదా శిబిర ధ్వజమున్నవారు. వారి సేనల ప్రకారం వారు బయలుదేరారు. ఆ సేనానాయకుడు అమ్మీనాదాబు కొడుకైన నయస్సోను.

[15] ఇశ్శాకారు గోత్ర సేనకు నాయకుడు సూయార్ కొడుకైన నెతనేల్.

[16] జెబూలూను గోత్ర సేనకు నాయకుడు హేలోను కొడుకైన ఏలీయాబ్.

[17] దైవనివాసాన్ని తీసివేసిన తరువాత గెర్షోను వంశస్థులూ మెరారి వంశస్థులూ దానిని మోస్తూ ప్రయాణంలో సాగిపోయారు.

[18] రూబేను శిబిర ధ్వజమున్న వారు వారి సేనల ప్రకారం తరలివెళ్ళారు. వాటికి నాయకుడు షెదేయూర్ కొడుకు ఏలీసూర్.

[19] షిమ్యోను గోత్ర సేనకు నాయకుడు సూరీషదాయి కొడుకైన షెలుమీయేల్.

[20] గాదు గోత్ర సేనకు నాయకుడు దెయువేల్ కొడుకైన ఎలీయాసాఫ్.

[21] తరువాత కహాతు వంశస్థులు పవిత్ర వస్తువులను మోస్తూ తరలివెళ్ళారు. దిగేచోటికి వారు చేరేలోగా దైవనివాసాన్ని నిలబెట్టడం జరిగింది.

[22] ఎఫ్రాయిం శిబిర ధ్వజమున్న వారు వారి సేనల ప్రకారం తరలివెళ్లారు. వాటికి నాయకుడు అమీహూదు కొడుకైన ఎలీషామా.

[23] మనష్షే గోత్ర సేన నాయకుడు పెదాసూర్ కొడుకైన గమాలీయేల్.

[24] బెన్యామీను గోత్ర సేనకు నాయకుడు గిద్యోనీ కొడుకైన అబీదాను.

[25] దాను శిబిర ధ్వజమున్నవారు తరలివెళ్ళారు. శిబిరాలన్నిటిలో ఆ శిబిరమే చివరిగా తరలివెళ్ళింది. ఆ సేనలకు నాయకుడు అమీషదాయి కొడుకైన అహీయెజెరు.

[26] ఆషేరుగోత్ర సేనకు నాయకుడు ఒక్రాను కొడుకైన పగీయేల్.

[27] నఫ్తాలిగోత్ర సేనకు నాయకుడు ఏనాను కొడుకైన అహీరా.

[28] ఇస్రాయేల్ ప్రజలు ప్రయాణాలలో సాగిపోయినప్పుడు ఈ వరుస ప్రకారం వారి వారి సేనల ప్రకారం తరలివెళ్ళేవారు.

[29] మోషే తన మామ కొడుకుతో (అతడి పేరు హోబాబ్‌; అతడు మిద్యాను దేశస్తుడైన రగూయేల్ కొడుకు), “యెహోవా మాకిస్తానని చెప్పిన స్థలానికి మేము పయనిస్తున్నాం. మాతోకూడా రండి. మేము మీకు మేలు చేస్తాం. ఇస్రాయేల్ ప్రజలకు తాను చేయబోయే మేలు విషయం యెహోవా వాగ్దానం చేశాడు” అన్నాడు.

[30] అందుకు హోబాబ్ “నేను రాను. నా దేశానికి నా చుట్టాల దగ్గరికి వెళ్తాను” అన్నాడు.

[31] మోషే అన్నాడు: “మమ్ములను విడవకండి. ఈ ఎడారిలో మేము దిగవలసిన స్థలాలు మీకు బాగా తెలుసు. మీరు మాకు కళ్ళలాగా ఉంటారు.

[32] మీరు మాతోకూడా వస్తే, యెహోవా మాకు చేసే ఉపకారాలలో మేము మిమ్ములను భాగస్వాములను చేస్తాం.”

[33] యెహోవా పర్వతంనుంచి వారు మూడు రోజుల ప్రయాణం చేశారు. వారికి విశ్రాంతి స్థలం చూడడానికి ఆ మూడు రోజుల ప్రయాణంలో యెహోవా ఒడంబడికపెట్టె వారికి ముందుగా సాగిపోయింది.

[34] వారు దిగిన స్థలంనుంచి సాగినప్పుడు పగటివేళ యెహోవా మేఘం వారికి పైగా ఉంది.

[35] ఆ పెట్టె బయలుదేరినప్పుడెల్లా మోషే ఇలా అనేవాడు: “యెహోవా! లే! నీ శత్రువులు చెదరిపోతారు గాక! నిన్ను ద్వేషించేవాళ్ళు నీ ముందునుంచి పారిపోతారు గాక!”

[36] పెట్టె నిలిస్తే అతడు ఇలా అనేవాడు: “యెహోవా! వేలాదివేల ఇస్రాయేల్ ప్రజల మధ్యకు మళ్ళీ రా!”

సంఖ్యాకాండం (ఎడారి ప్రయాణాలు) — Chapters