[1] అప్పుడు సమాజమంతా బిగ్గరగా గోల చేశారు. ఆ రాత్రంతా ప్రజలు ఏడ్చారు.
[2] ఇస్రాయేల్‌వారంతా మోషేమీదా అహరోనుమీదా సణుక్కొన్నారు. ఆ సమాజమంతా వారితో చెప్పినది ఏమిటంటే, “అయ్యో, మేము ఈజిప్ట్‌లో చనిపోయివుంటే ఎంత బాగుండేది! ఈ ఎడారిలో చనిపోయివుంటే ఎంత బావుండును!
[3] మేము కత్తిపాలై పడేలా యెహోవా మమ్మల్ని ఈ దేశానికి ఎందుకు తీసుకువచ్చాడు? మా భార్యలూ పిల్లలూ కొల్లపోతారు. ఈజిప్ట్‌కు తిరిగి వెళ్ళడం మాకు మేలు కాదా?”
[4] వారు ఒకరితో ఒకరు, “మనకోసం ఒక నాయకుణ్ణి నియమించుకొని ఈజిప్ట్‌కు తిరిగి వెళదాం, పదండి” అని చెప్పుకొన్నారు.
[5] అప్పుడు మోషే అహరోనులు ఇస్రాయేల్‌ప్రజల సర్వ సమాజ సమావేశం ఎదుట సాష్టాంగపడ్డారు.
[6] ఆ దేశంలో సంచరించి చూచినవారిలో నూను కొడుకు యెహోషువ, యెఫున్నె కొడుకు కాలేబు తమ బట్టలు చించుకొని ఇస్రాయేల్‌ప్రజల సర్వ సమాజంతో ఇలా అన్నారు:
[7] “మేము సంచరించి చూచిన దేశం చాలా మంచి దేశం.
[8] మనమంటే యెహోవాకు ఆనందం ఉంటే ఆయన మనల్ని ఆ దేశంలోకి తీసుకువెళ్లి దానిని మనకిస్తాడు. అది పాలుతేనెలు నదులై పారుతున్న దేశం.
[9] అయితే మీరు యెహోవా మీద తిరగబడకూడడు. ఆ దేశప్రజలకు భయపడకూడదు. వాళ్ళు మనకు ఆహారమవుతారు. వారి సంరక్షణం వారిదగ్గరనుంచి తొలగిపోయింది. యెహోవా మనతో ఉన్నాడు. వారికి భయపడకండి.”
[10] అయితే సమాజమంతా “వాళ్ళను రాళ్ళు రువ్వి చంపుదాం” అన్నారు. అప్పుడు యెహోవా మహిమాప్రకాశం సన్నిధిగుడారం మీద ఇస్రాయేల్ ప్రజలందరికీ కానవచ్చింది.
[11] యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఎంత కాలమని ఈ ప్రజలు నన్ను తిరస్కరిస్తారు? నేను వారిమధ్య చేసిన అద్భుతమైన సూచనలన్నీ వారు చూచి కూడా ఎంతకాలంవరకు నన్ను నమ్మకుండా ఉంటారు?
[12] నేను వారిమీదికి విపత్తు రప్పించి వారిని రూపుమాపుతాను, వారికంటే బలంగల గొప్ప ప్రజను నీవల్ల పుట్టిస్తాను.”
[13] మోషే యెహోవాతో ఇలా అన్నాడు: “నీవు ఈ ప్రజలను ఈజిప్ట్‌వాళ్ళలోనుంచి నీ బలంచేత రప్పించావు. నీవు వారిని రూపుమాపితే వాళ్ళు ఈ దేశవాసులతో ఆ సంగతి చెప్తారు.
[14] యెహోవా, నీవు ఈ ప్రజలమధ్యలో ఉన్నావని ఈ దేశవాసులు విన్నారు. యెహోవా, నీవు వారికి సాక్షాత్తుగా కనబడతావనీ నీ మేఘం వారికి పైగా నిలిచి ఉంటుందనీ నీవు పగటివేళ మేఘస్తంభంలో ఉండి రాత్రివేళ అగ్ని స్తంభంలో ఉండి వారి ముందర సాగిపోతావనీ వాళ్ళు విన్నారు.
[15] ఒకవేళ నీవు ఒకే దెబ్బతో ఈ ప్రజలను చంపితే నీ పేరుప్రతిష్ఠలను గురించి విన్న ఇతర జాతులవాళ్ళు –
[16] ‘యెహోవా ఈ దేశాన్ని వాళ్ళకిస్తానని మాట ఇచ్చాడు గాని వాళ్ళను ఈ దేశంలో చేర్చలేకపోయాడు. అందుచేతే ఆయన వాళ్లను ఎడారిలో వధించాడు’ అంటారు.
[17] నీవు ఇలా అన్నావు గదా ‘యెహోవా త్వరగా కోపగించేవాడు గాక, అత్యంత కృపగలవాడు.
[18] పాపాలనూ అతిక్రమాలనూ క్షమించేవాడు. అయితే దోషులను శిక్షించకుండా ఉండేవాడు గాక, మూడు నాలుగు తరాలకు తండ్రుల పాపఫలితం వారి సంతానంమీదికి రప్పించేవాడు.’ నీవు చెప్పిన ఆ మాట ప్రకారమే నా ప్రభువైన నీ బలప్రభావాలను కనుపరచమని వేడుకొంటున్నాను.
[19] నీ మహా అనుగ్రహం ప్రకారం ఈ ప్రజల అపరాధాన్ని క్షమించమని నా ప్రార్థన. ఈజిప్ట్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు క్షమించినట్టే వారిని క్షమించు.”
[20] అందుకు యెహోవా ఇలా అన్నాడు: “నీ మనవి ప్రకారమే వారిని క్షమించాను.
[21] అయినా లోకమంతా యెహోవా మహిమతో ఎంత నిశ్చయంగా నిండి ఉంటుందో అంత నిశ్చయంగా నా జీవంమీద శపథం చేసి చెపుతున్నాను,
[22] వారు ఏ మాత్రమూ ఆ దేశాన్ని చూడరు, దేశంలో ప్రవేశించరు. వారు నా మహిమనూ ఈజిప్ట్‌లో, ఎడారిలో నేను చేసిన అద్భుతమైన సూచనలనూ చూశారు గాని నన్ను పది సార్లు పరీక్షించారు, నా మాట వినకుండా ఉన్నారు.
[23] గనుక నేను వారి పూర్వీకులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశాన్ని వారు చూడనే చూడరు. నన్ను తిరస్కరించినవారిలో ఎవ్వడూ చూడడు.
[24] అయితే నా సేవకుడైన కాలేబును అతడు వెళ్ళి చూచిన ఆ దేశంలో ప్రవేశపెడతాను. ఎందుకంటే, అతడు మంచి మనస్సు కలిగి నన్ను పూర్తిగా అనుసరించాడు. అతడి సంతానం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొంటారు.
[25] అమాలేకువాళ్ళూ కనానువాళ్ళూ ఆ లోయలో నివాసం చేస్తున్నారు. రేపు మీరు వెనుకకు తిరిగి, ఎర్రసముద్రం దిక్కుగా ఉన్న ఎడారికి ప్రయాణం చేయండి.”
[26] యెహోవా మోషే అహరోనులతో అన్నాడు,
[27] “నామీద సణుగుతున్న ఈ చెడ్డ సమాజాన్ని నేనెంతకాలమని సహించాలి? ఇస్రాయేల్‌ప్రజలు నామీద చేస్తున్న ఫిర్యాదులు విన్నాను.
[28] వారితో ఈ విధంగా చెప్పు: యెహోవా వాక్కు ఇదే – నా జీవంమీద శపథం చేసి చెపుతున్నాను, మీరు నా సన్నిధానంలో చెప్పినట్టు నేను తప్పకుండా మీపట్ల జరిగిస్తాను.
[29] మీ శవాలు ఎడారిలోనే కూలుతాయి. ఇరవై ఏళ్ళు మొదలుకొని పై వయసు ఉండి, జనాభా లెక్కలలో నమోదై నామీద సణిగిన మీ అందరి గతి అంతే.
[30] మిమ్ములను నివసింపజేస్తానని నేను వాగ్దానం చేసిన దేశంలో యెఫున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ మాత్రమే ప్రవేశిస్తారు. మీలో ఇంకెవ్వరూ ప్రవేశించరు. ఇది ఖాయం.
[31] మీ సంతానాన్ని కూడా ఆ దేశంలో చేరుస్తాను. వారు కొల్లపోతారని మీరు చెప్పారు గదా! మీరు వద్దన్న దేశాన్ని వారు పొందుతారు.
[32] కానీ మీ శవాలు ఈ ఎడారిలో కూలుతాయి.
[33] మీ సంతతివారు ఈ ఎడారిలో నలభై ఏళ్ళు తిరుగాడుతూ ఉంటారు. మీ శవాలు ఎడారిలో రాలిపోయేదాకా, మీరు వేశ్యలలాగా ప్రవర్తించినందుకు వారు బాధలు అనుభవిస్తారు.
[34] ఆ దేశాన్ని నలభై రోజులు సంచరించి చూశారు. రోజుకు ఒక సంవత్సరం ప్రకారం మొత్తం నలభై సంవత్సరాలు మీరు మీ అపరాధాలు భరిస్తారు. మీమీద నాకు వ్యతిరేకభావం ఉన్నట్టు మీరు తెలుసుకొంటారు.
[35] నేను యెహోవాను. నేను ఈ మాట చెప్పాను. నాకు విరోధంగా సమకూడిన ఈ చెడ్డ సమాజమంతటికీ ఈ మాటప్రకారం చేసితీరుతాను. ఈ ఎడారిలో వారు అంతరించిపోతారు. ఇక్కడే చస్తారు.”
[36] ఆ దేశాన్ని చూడడానికి మోషే పంపించినవారు తిరిగి వచ్చి ఆ దేశం విషయం చెడ్డ సమాచారం చెప్పి సమాజమంతా మోషేమీద సణుక్కొనేలా చేసినందుచేత,
[37] ఆ దేశం విషయం చెడ్డ సమాచారం చెప్పిన ఆ మనుషులు యెహోవా సన్నిధానంలో విపత్తుచేత చనిపోయారు.
[38] ఆ దేశాన్ని చూడడానికి వెళ్ళినవారిలో నూను కొడుకు యెహోషువ, యెఫున్నె కొడుకు కాలేబు మాత్రమే బ్రతికారు.
[39] యెహోవా చెప్పిన మాటలు ఇస్రాయేల్ ప్రజలందరికీ మోషే తెలియజేసినప్పుడు వారు చాలా దుఃఖించారు.
[40] మరుసటి రోజు తెల్లవారుతుండగానే వారు లేచి అక్కడి కొండ శిఖరానికెక్కి “మేము తప్పిదం చేశాం, నిజమే. అయితే ఇప్పుడు యెహోవా చెప్పిన స్థలానికి వెళ్దాం” అన్నారు.
[41] అందుకు మోషే ఇలా అన్నాడు: “ఇలా ఎందుకు? మీరు యెహోవా మాట మీరుతున్నారు. ఇలా చేసి లాభం లేదు.
[42] యెహోవా మీమధ్య లేడు, గనుక మీ శత్రువుల ఎదుట ఓడిపోతారు. అక్కడికి వెళ్లకండి.
[43] అక్కడ అమాలేకు జాతివాళ్ళు, కనానువాళ్ళు మీకు ఎదురుగా ఉంటారు. మీరు ఖడ్గం చేత కూలుతారు. మీరు యెహోవాను అనుసరించడం మానుకొన్నారు గనుక యెహోవా మీకు తోడుగా ఉండడు.”
[44] అతడిలా చెప్పినా వారు గర్వించి ఆ కొండసీమలకు వెళ్ళారు. అయితే యెహోవా ఒడంబడికపెట్టె శిబిరంలోనుంచి పోలేదు. మోషే కూడా వెళ్ళలేదు.
[45] అప్పుడు, ఆ కొండసీమలలో నివసించే అమాలేకువాళ్ళూ కనానువాళ్ళూ బయలుదేరి ఇస్రాయేల్ వారిని హోర్మావరకు తరిమి ఓడించారు.