[1] “ఏడో నెల మొదటి రోజున మీరు పవిత్ర సభగా సమకూడాలి. అప్పుడు బ్రతుకుదెరువు కోసం ఏ పనీ చెయ్యకూడదు. అది మీకు బూరలు ఊదే రోజు,
[2] యెహోవాకు పరిమళ హోమంగా ఒక కోడెనూ ఒక పొట్టేలునూ ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలనూ అర్పించాలి. అవి ఏ లోపం లేనివై ఉండాలి.
[3] నూనెతో కలిపిన గోధుమపిండి అనే వాటి నైవేద్యాలను కూడా అర్పించాలి. కోడెలతోపాటు మూడు కిలోగ్రాముల పిండి, పొట్టేలుతోపాటు రెండు కిలోగ్రాములపిండి,
[4] ఏడు గొర్రెపిల్లల్లో ప్రతిదానితోపాటు ఒక కిలోగ్రాం పిండి అర్పించాలి.
[5] అంతేకాక, మీ పాపాలను కప్పివేయడానికి పాపాలకోసమైన బలిగా మేకపోతును కూడా అర్పించాలి.
[6] అది యెహోవాకు పరిమళ హోమబలి. వాటి వాటి నిర్ణయాలప్రకారం, నెలలో మొదటి రోజున అర్పించే హోమబలి, దాని నైవేద్యం, నిత్యమైన హోమబలి, దాని నైవేద్యం, వాటి పానార్పణలు గాక ఆ మేకపోతును అర్పించాలి.
[7] “ఏడో నెల పదో రోజున మీరు పవిత్రసభగా సమకూడాలి. ఆ రోజు మిమ్ములను అదుపు చేసుకొని ఉండాలి. బ్రతుకుదెరువు కోసం ఏ పనీ చెయ్యకూడదు.
[8] యెహోవాకు పరిమళహోమంగా ఒక కోడెనూ ఒక పొట్టేలునూ ఏడు ఏడాది మగ గొర్రెపిల్లలనూ అర్పించాలి. అవి ఏ లోపం లేనివై ఉండాలి.
[9] నూనెతో కలిపిన గోధుమ పిండి అనే వాటి నైవేద్యాలను కూడా అర్పించాలి. కోడెతోపాటు మూడు కిలోగ్రాముల పిండి, పొట్టేలుతోపాటు రెండు కిలోగ్రాముల పిండి,
[10] ఏడు గొర్రెపిల్లల్లో ప్రతిదానితోపాటు ఒక కిలోగ్రాం పిండి అర్పించాలి.
[11] పాపాలకోసమైన బలిగా మేకపోతును అర్పించాలి. ప్రాయశ్చిత్తం చేసే పాపంకోసమైన బలి కాక, నిత్యమైన హోమబలి, దాని నైవేద్యం గాక, వాటి పానార్పణలు గాక, ఆ మేకపోతును అర్పించాలి.
[12] “ఏడో నెల పదిహేనో రోజున మీరు పవిత్ర సభగా సమకూడాలి. అప్పుడు ఏడు రోజులు యెహోవాకు పండుగ ఆచరించాలి. బ్రతుకుదెరువు కోసం ఏ పనీ చెయ్యకూడదు.
[13] యెహోవాకు పరిమళ హోమబలిగా పదమూడు కోడెలనూ రెండు పొట్టేళ్ళనూ పద్నాలుగు ఏడాది మగ గొర్రెపిల్లలనూ అర్పించాలి. అవి ఏ లోపం లేనివై ఉండాలి.
[14] నూనెతో కలిపిన గోధుమపిండి నైవేద్యాలను కూడా అర్పించాలి. ఆ పదమూడు కోడెలలో ప్రతిదానితోపాటు మూడు కిలోగ్రాముల పిండి, ఆ రెండు పొట్టేళ్ళలో ప్రతిదానితోపాటు రెండు కిలోగ్రాముల పిండి,
[15] ఆ పద్నాలుగు గొర్రెపిల్లల్లో ప్రతిదానితోపాటు ఒక కిలోగ్రాం పిండి అర్పించాలి.
[16] పాపాలకోసమైన బలిగా మేకపోతును అర్పించాలి. నిత్యమైన హోమబలి, దాని నైవేద్యం, దాని పానార్పణం గాక పై చెప్పిన వీటన్నిటినీ అర్పించాలి.
[17] “ఆ ఏడు రోజుల్లో రెండో రోజున మీరు పన్నెండు కోడెలనూ రెండు పొట్టేళ్ళనూ పద్నాలుగు ఏడాది మగ గొర్రెపిల్లలనూ అర్పించాలి. అవి ఏ లోపం లేనివై ఉండాలి.
[18] నిర్ణయం ప్రకారం, వాటి వాటి లెక్కల ప్రకారం, ఆ కోడెలూ పొట్టేళ్ళూ గొర్రెపిల్లలతో పాటు వాటి నైవేద్యాలనూ పానార్పణలనూ అర్పించాలి.
[19] పాపాలకోసమైన బలిగా మేకపోతును అర్పించాలి. నిత్యమైన హోమబలి, నైవేద్యం, వాటి పానార్పణలు గాక పైన చెప్పిన వీటన్నిటినీ అర్పించాలి.
[20] “మూడో రోజున పదకొండు కోడెలనూ రెండు పొట్టేళ్ళనూ పద్నాలుగు ఏడాది మగగొర్రెపిల్లలనూ అర్పించాలి. అవి ఏ లోపం లేనివై ఉండాలి.
[21] నిర్ణయం ప్రకారం, వాటి వాటి లెక్కప్రకారం, కోడెలూ పొట్టేళ్ళూ గొర్రెపిల్లలతో పాటు వాటి నైవేద్యాలనూ పానార్పణలనూ అర్పించాలి.
[22] పాపాలకోసమైన బలిగా మేకపోతును అర్పించాలి. నిత్యమైన హోమబలి, దాని నైవేద్యం, పానార్పణం గాక పై చెప్పిన వీటిని కూడా అర్పించాలి.
[23] “నాలుగో రోజున పది కోడెలనూ రెండు పొట్టేళ్ళనూ పద్నాలుగు ఏడాది మగ గొర్రెపిల్లలనూ అర్పించాలి. అవి ఏ లోపం లేనివై ఉండాలి.
[24] నిర్ణయం ప్రకారం, వాటి వాటి లెక్కప్రకారం, కోడెలూ పొట్టేళ్ళూ గొర్రెపిల్లలతోపాటు వాటి నైవేద్యాలనూ పానార్పణలనూ అర్పించాలి.
[25] పాపాలకోసమైన బలిగా మేకపోతును అర్పించాలి. నిత్యమైన హోమబలి, దాని నైవేద్యం, పానార్పణ గాక పై చెప్పినవాటిని కూడా అర్పించాలి.
[26] “అయిదో రోజున తొమ్మిది కోడెలనూ రెండూ పొట్టేళ్ళనూ పద్నాలుగు ఏడాది మగగొర్రెపిల్లలనూ అర్పించాలి. అవి ఏ లోపం లేనివై ఉండాలి.
[27] నిర్ణయం ప్రకారం, వాటి వాటి లెక్కప్రకారం కోడెలూ పొట్టేళ్ళూ గొర్రెపిల్లలతోపాటు వాటి నైవేద్యాలనూ పానార్పణలనూ అర్పించాలి.
[28] పాపాలకోసమైన బలిగా మేకపోతును అర్పించాలి. నిత్యమైన హోమబలి, దాని నైవేద్యం, పానార్పణ గాక పై చెప్పినవాటిని కూడా అర్పించాలి.
[29] “ఆరో రోజున ఎనిమిది కోడెలనూ రెండు పొట్టేళ్ళనూ పద్నాలుగు ఏడాది మగ గొర్రెపిల్లలనూ అర్పించాలి. అవి ఏ లోపం లేనివై ఉండాలి.
[30] నిర్ణయం ప్రకారం, వాటి వాటి లెక్కప్రకారం కోడెలూ పొట్టేళ్ళూ గొర్రెపిల్లలతోపాటు వాటి నైవేద్యాలనూ పానార్పణలనూ అర్పించాలి.
[31] పాపాల కోసమైన బలిగా మేకపోతును అర్పించాలి. నిత్యమైన హోమబలి, దాని నైవేద్యం, పానార్పణం గాక పై చెప్పినవాటిని కూడా అర్పించాలి.
[32] “ఏడో రోజున ఏడు కోడెలనూ రెండు పొట్టేళ్ళనూ పద్నాలుగు ఏడాది మగగొర్రెపిల్లలనూ అర్పించాలి.
[33] నిర్ణయం ప్రకారం, వాటి వాటి లెక్కప్రకారం, ఆ కోడెలూ పొట్టేళ్ళూ గొర్రెపిల్లలతోపాటు వాటి నైవేద్యాలనూ పానార్పణలనూ అర్పించాలి.
[34] పాపాలకోసమైన బలిగా మేకపోతును అర్పించాలి. నిత్యమైన హోమబలి, దాని నైవేద్యం, పానార్పణం గాక పై చెప్పినవాటిని కూడా అర్పించాలి.
[35] “ఎనిమిదో రోజున సభగా సమకూడాలి. అప్పుడు బ్రతుకుదెరువు కోసం ఏ పనీ చెయ్యకూడదు.
[36] యెహోవాకు పరిమళ హోమబలిగా కోడెదూడనూ పొట్టేలునూ ఏడు ఏడాది మగగొర్రెపిల్లనూ అర్పించాలి. అవి ఏ లోపం లేనివై ఉండాలి.
[37] చట్టంప్రకారం వాటి వాటి లెక్కప్రకారం ఆ కోడె, పొట్టేలు, గొర్రెపిల్లలతోపాటు వాటి నైవేద్యాలనూ పానార్పణలనూ అర్పించాలి.
[38] పాపాలకోసమైన బలిగా మేకపోతును అర్పించాలి. నిత్యమైన హోమబలి, దాని నైవేద్యం, పానార్పణం గాక పైన చెప్పిన వాటిని కూడా అర్పించాలి.
[39] “మీరు వాటిని నియామక కాలాలలో యెహోవాకు అర్పించాలి. మీ మొక్కుబళ్ళూ స్వేచ్ఛార్పణలూ హోమబలులూ నైవేద్యాలూ పానార్పణలూ శాంతి బలులు గాక, పై చెప్పినవాటిని అర్పించాలి.”
[40] యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా మోషే ఇస్రాయేల్ ప్రజలకు తెలిపాడు.