[1] తరువాత కోరహు, దాతాను, అబీరాము, ఓను కొంతమంది మనుషులను పోగు చేసి మోషేకు ఎదురుగా నిలబడ్డారు. (కోరహు ఇసహారు కొడుకు, లేవీకి మునిమనుమడు, కహాతుకు మనుమడు. దాతాను, అబీరాములు రూబేను గోత్రికుడైన ఏలీయాబు కొడుకులు. ఓను రూబేను గోత్రికుడైన ఫేలెతు కొడుకు).
[2] ఇస్రాయేల్ ప్రజలలో రెండు వందల యాభైమంది మనుషులు వాళ్ల పక్షం వహించారు. ఆ మనుషులు సంఘంలో నాయకులు, సమాజంలో ఎన్నికైనవారు, పేరు పొందినవారు.
[3] వాళ్ళంతా మోషే అహరోనులకు విరోధంగా పోగయి వారితో, “మీరిక చాలించండి. సమాజంలో ఉన్నవాళ్ళంతా పవిత్రులే. యెహోవా వాళ్ళందరిమధ్య ఉన్నాడు. యెహోవా సమాజం మీద మిమ్మల్ని మీరు హెచ్చించుకోవడం దేనికి?” అన్నారు.
[4] మోషే అది విని సాష్టాంగపడ్డాడు.
[5] తరువాత అతడు కోరహుతోను అతడి బృందంవాళ్ళతోను ఇలా అన్నాడు: “రేపు పొద్దున యెహోవా తనవాడెవడో పవిత్రుడెవడో తెలియజేస్తాడు. అలాంటివాణ్ణి తన సన్నిధానంలోకి రానిస్తాడు. తాను ఎన్నుకొన్నవాణ్ణి తనదగ్గరికి చేర్చుకొంటాడు.
[6] మీరిలా చెయ్యాలి: కోరహూ, నీవూ నీ బృందమంతా ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పు ఉంచి, రేపు యెహోవా సముఖంలో వాటిమీద ధూపద్రవ్యం వెయ్యాలి.
[7] అప్పుడు యెహోవా ఏ వ్యక్తిని ఎన్నుకొంటాడో అతడే పవిత్రుడు. లేవీ కుమారులారా! మీరిక చాలించండి.”
[8] మోషే కోరహుతో ఇంకా అన్నాడు, “లేవీ కొడుకులారా, వినండి.
[9] ఇస్రాయేల్‌ప్రజల దేవుడు మిమ్ములను ఇస్రాయేల్ సమాజంలోనుంచి వేరుపరచాడు. తనదగ్గరికి మిమ్ములను చేర్చుకోవడానికీ మీరు యెహోవా యొక్క నివాసం సేవ చేయడానికీ సమాజంకోసం సేవకులై వారి ఎదుట నిలబడడానికీ మిమ్ములను ప్రత్యేకించాడు. మీ దృష్టిలో ఇది అల్ప విషయమేనా?
[10] ఆయన నిన్నూ నీతోపాటు నీ లేవీ గోత్రంవారందరినీ చేర్చుకొన్నాడు గదా! ఇప్పుడు మీరు యాజి పదవిని కోరుతున్నారు.
[11] అందుచేతే గదా, నీవూ నీ బృందంవాళ్ళంతా యెహోవాకు విరోధంగా గుమికూడారు. అయితే మీరు అహరోనుమీద సణుగుతున్నారెందుకు? అతడెవరు?”
[12] అప్పుడు మోషే ఏలీయాబు కొడుకులైన దాతాను అబీరాములను పిలువనంపించాడు. గానీ వాళ్ళు
[13] “మేము రాము. ఈ ఎడారిలో చంపడానికి మమ్మల్ని పాలు తేనెలు నదులైపారుతున్న దేశంలోనుంచి తీసుకువచ్చావు. అది చాలదా? నువ్వు ప్రభువులాగా మామీద పెత్తనం చెలాయించాలా?
[14] అంతే గాక, పాలుతేనెలు నదులైపారుతున్న దేశంలోకి నీవు మమ్మల్ని తీసుకురాలేదు. పొలాలూ ద్రాక్షతోటలూ మా వశం చేయలేదు. ఇలాంటివాళ్ళ కండ్లు మూయడానికి ప్రయత్నం చేస్తున్నావా? మేము రాము” అని జవాబిచ్చారు.
[15] మోషేకు చాలా కోపం వచ్చింది. అతడు యెహోవాతో “వాళ్ళు అర్పించేదానిని లక్ష్యపెట్టకు. ఒక్క గాడిదనైనా వాళ్ళదగ్గర నేను తీసుకోలేదు. వాళ్ళలో ఎవరికీ హాని చేయలేదు” అన్నాడు.
[16] మోషే కోరహుతో ఇలా అన్నాడు: “రేపు నీవూ నీ బృందమంతా యెహోవా సముఖంలో నిలబడాలి. అహరోను కూడా అక్కడ ఉంటాడు.
[17] మీలో ప్రతి ఒక్కడూ తన ధూపార్తి చేతపట్టుకొని దానిమీద ధూపద్రవ్యం వేయాలి. ఆ రెండు వందల యాభైమంది తమ తమ ధూపార్తులను యెహోవా సన్నిధానంలోకి తేవాలి. నీవూ అహరోనూ కూడా ధూపార్తులను తేవాలి.”
[18] అందుచేత వాళ్ళలో ప్రతి ఒక్కరూ తన ధూపార్తి చేతపట్టుకొని దానిలో నిప్పు ఉంచి దానిమీద ధూపద్రవ్యం వేసి సన్నిధిగుడారం ద్వారందగ్గర మోషే అహరోనులతోపాటు నిలబడ్డారు.
[19] అంతేగాక, మోషే అహరోనులకు విరోధంగా కోరహు సన్నిధిగుడారం ద్వారందగ్గరకు సమాజమంతటినీ పోగు చేశాడు. అప్పుడు యెహోవా మహిమాప్రకాశం సమాజమంతటికీ కానవచ్చింది.
[20] యెహోవా మోషే అహరోనులతో,
[21] “మీరు ఈ సమావేశంలో నుంచి వేరుపడండి. తక్షణమే నేను వాళ్లను నాశనం చేస్తాను” అన్నాడు.
[22] వారు సాగిలపడి, “దేవా! మానవులందరి ఆత్మలకు దేవా! ఒక్క మనిషి మాత్రమే పాపం చేస్తే నీవు సమాజమంతటిమీదా కోపపడతావా?” అన్నారు.
[23] అందుకు యెహోవా మోషేతో,
[24] “కోరహు, దాతాను అబీరాములు ఉంటున్న డేరాల పరిసరాల నుంచి తొలగిపోండి అని నీవు సమాజంతో చెప్పు” అన్నాడు.
[25] అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల దగ్గరికి వెళ్ళాడు. ఇస్రాయేల్ ప్రజల పెద్దలు అతని వెంట వెళ్ళారు.
[26] మోషే సమాజంతో “ఈ దుర్మార్గులు చేసిన అన్ని పాపాల కారణంగా మీరు నశించకుండేలా వాళ్ల డేరాల దగ్గరనుంచి తొలగిపోండి, వాళ్ల ఆస్తిపాస్తులలో దేనినీ ముట్టకండి” అన్నాడు.
[27] గనుక కోరహు దాతాను అబీరాముల డేరాల చుట్టుపట్లనుంచి వారు కదిలారు. అప్పుడు దాతాను అబీరాములు వాళ్ళ భార్యలతో కొడుకులతో చిన్నవారితోకూడా వారి డేరాల ద్వారాలలో నిలబడ్డారు.
[28] అప్పుడు మోషే ఇలా అన్నాడు: “నేను ఈ క్రియలన్నీ చేయాలని యెహోవా నన్ను పంపించాడు. నా అంతట నేనే అవి చేయడం లేదు. ఇది మీరు తెలుసుకొంటారు –
[29] ఎలాగంటే, వీళ్ళు సహజంగా చనిపోతే, మనుషులందరికీ పట్టే మామూలు గతి వీళ్ళకు పడితే యెహోవా నన్ను పంపలేదన్నమాట.
[30] గాని యెహోవా గొప్ప అద్భుతం చేస్తాడనుకోండి; వీళ్ళు ప్రాణంతోనే మృత్యులోకంలో కూలేట్టు భూమి దాని నోరు తెరచి వీళ్ళనూ వీళ్ళకు చెందేదాన్నంతా మింగివేస్తుందనుకోండి. అలాంటప్పుడు వీళ్ళు యెహోవాను తిరస్కరించారని మీరు తెలుసుకొంటారు.”
[31] అతడు ఈ మాటలన్నీ చెప్పీ చెప్పడంతోనే ఆ మనుషులక్రింద నేల చీలిపోయింది.
[32] భూమి దాని నోరు తెరచి వాళ్లనూ వాళ్ళ కుటుంబాలనూ కోరహు మనుషులందరినీ వాళ్ళ ఆస్తిపాస్తులనూ అంతా మింగివేసింది.
[33] వాళ్ళూ వాళ్ళకు చెందిన అంతటితోపాటు ప్రాణంతోనే మృత్యులోకంలో కూలిపోయారు. అప్పుడు భూమి మూసుకుపోయింది. వాళ్ళు సమాజంలో లేకుండా నశించారు.
[34] వాళ్ళు పెట్టిన బొబ్బలు విని వాళ్ళ చుట్టూరా ఉన్న ఇస్రాయేల్‌వారంతా పారిపొయ్యారు. భూమి తమను కూడా మింగివేస్తుందేమో అనుకొన్నారు.
[35] ఆలోగా యెహోవా సన్నిధానంనుంచి మంటలు బయలు దేరాయి; ధూపం అర్పిస్తున్న ఆ రెండు వందల యాభైమందిని కాల్చివేశాయి.
[36] అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు:
[37] “యాజి అయిన అహరోను కొడుకు ఎలియాజరు ఆ బూడిదలోనుంచి ఆ ధూపార్తులను ఎత్తాలని నీవు అతడితో చెప్పు. వాటిలో ఉన్న నిప్పుకణాలను నీవు దూరంగా పారెయ్యాలి. ఆ ధూపార్తులు పవిత్రంగా ఉన్నాయి.
[38] పాపం చేసి తమను మరణానికి గురి చేసుకొన్న ఆ మనుషులు ధూపార్తులను తీసుకొని బలిపీఠానికి కప్పుగా రేకులుగా సాగగొట్టాలి. యెహోవా సన్నిధానంలోకి వారు ఆ ధూపార్తులను తెచ్చారు, గనుక అవి పవిత్రంగా ఉన్నాయి. అవి ఇస్రాయేల్ ప్రజలకు సూచనగా ఉంటాయి.”
[39] యెహోవా మోషేచేత తనతో పలికించినట్టు ఎలియాజరుయాజి దహనం అయిపోయినవాళ్ళ కంచు ధూపార్తులను తీసి బలిపీఠానికి కప్పుగా రేకులుగా సాగగొట్టించాడు.
[40] అహరోను వంశంలో ఉండని సామాన్యుడెవ్వడూ యెహోవా సన్నిధానంలో ధూపం అర్పించడానికి సమీపించకూడదనీ కోరహుకూ వాడి బృందం వాళ్ళకూ పట్టిన గతి అలాంటివాడికి పట్టకూడదనీ యెహోవా ఉద్దేశం. అందుకే ఇస్రాయేల్ ప్రజలకు స్మృతి చిహ్నంగా ఆ ధూపార్తులతో రేకులు చేశారు.
[41] అయితే మరుసటి రోజే ఇస్రాయేల్ ప్రజల సమాజమంతా మోషే అహరోనులకు విరోధంగా సణుగుతూ “యెహోవాప్రజల్ని మీరు చంపేశారు” అన్నారు.
[42] మోషే అహరోనులకు విరోధంగా సమాజం సమావేశమైన తరువాత వారు సన్నిధిగుడారం వైపు చూశారు. యెహోవా మేఘం ఆ గుడారాన్ని కమ్మింది, ఆయన మహిమాప్రకాశం కానవచ్చింది.
[43] మోషే అహరోనులు సన్నిధిగుడారం ఎదుటికి వెళ్ళారు.
[44] అక్కడ యెహోవా మోషేతో “మీరు సమాజం మధ్యనుంచి తొలగిపోండి.
[45] అప్పుడు నేను వాళ్ళను తక్షణమే నాశనం చేస్తాను” అన్నాడు. అందుకు వారు సాష్టాంగపడ్డారు.
[46] మోషే అహరోనుతో ఇలా అన్నాడు: “యెహోవా సన్నిధానంనుంచి కోపాగ్ని బయలుదేరింది, విపత్తు ఆరంభమైంది, గనుక నీ ధూపార్తి తీసుకొని బలిపీఠంమీది నిప్పుకణాలతో నింపి ధూపం వేసి త్వరగా సమాజందగ్గరికి వెళ్ళి వారి అపరాధాన్ని కప్పివెయ్యి”.
[47] మోషే చెప్పినట్టే అహరోను వాటిని చేతపట్టుకొని సమాజం మధ్యకు పరుగెత్తాడు. అంతకుముందే విపత్తు ప్రజలలో ఆరంభమైంది. అతడు ధూపం వేసి వారి అపరాధాన్ని కప్పివేశాడు.
[48] చచ్చినవారికీ బ్రతికినవారికీ మధ్య అతడు నిలబడ్డాడు. విపత్తు ఆగిపోయింది.
[49] కోరహు తిరుగుబాటువల్ల చనిపోయినవాళ్ళు కాకుండా, ఆ విపత్తువల్ల చనిపోయినవాళ్ళు పద్నాలుగు వేల ఏడు వందలమంది.
[50] విపత్తు ఆగిన తరువాత అహరోను సన్నిధిగుడారం ద్వారందగ్గర ఉన్న మోషే దగ్గరికి తిరిగి వెళ్ళాడు.