[1] యెహోవా సేవకుడైన మోషే చనిపోయిన తరువాత యెహోవా నూను కొడుకూ మోషే సేవకుడూ అయిన యెహోషువతో ఇలా అన్నాడు:
[2] “నా సేవకుడు మోషే చనిపోయాడు గనుక నీవు, ఈ ప్రజలంతా బయలుదేరి ఈ యొర్దాను నదిని దాటి నేను ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చే దేశానికి వెళ్ళండి.
[3] నేను మోషేకు ప్రమాణం చేసినట్టు మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని మీకిచ్చాను.
[4] లెబానోను నుంచి, ఎడారినుంచి యూఫ్రటీసు మహానదివరకు, పడమరగా మహా సముద్రంవరకు మీ సరిహద్దులవుతాయి. హిత్తిజాతివారి దేశమంతా మీదవుతుంది.
[5] నీవు బ్రతికినన్నాళ్ళు నీముందు ఎవ్వడూ నిలబడలేడు. నేను మోషేతో ఉన్నట్టే నీతోనూ ఉంటాను. నీతో ఎప్పటికీ ఉంటాను. నిన్ను విడిచిపెట్టను.
[6] దృఢంగా ధైర్యంగా ఉండు. నేను ఈ దేశాన్ని ఈ ప్రజలకు ఇస్తానని వారి పూర్వీకులతో వాగ్దానం చేశాను. వారు ఈ దేశాన్ని వారసత్వంగా స్వాధీనం చేసుకొనేలా నీవు చేస్తావు.
[7] నీవు ధైర్య స్థిరతలతో మాత్రం ఉండి నా సేవకుడు మోషే నీకు ఆదేశించిన ఉపదేశమంతా జాగ్రత్తగా పాటించు. దాని నుంచి కుడికి గానీ ఎడమకు గానీ తొలగకు. అప్పుడు నీవెక్కడికి వెళ్ళినా అక్కడ నీకు విజయం చేకూరుతుంది.
[8] ఈ ధర్మశాస్త్రగ్రంథంలో ఉన్న వాక్కులు నీ నోటికి ఎన్నడూ దూరం కాకూడదు. అందులో వ్రాసి ఉన్నదంతటి ప్రకారం నీవు ప్రవర్తించడానికి జాగ్రత్తగా ఉండేలా రాత్రింబగళ్ళు దానిని ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు నీ త్రోవలో నీవు వర్ధిల్లుతావు, నీకు విజయం చేకూరుతుంది.
[9] దృఢంగా, ధైర్యంగా ఉండమని నేను నీకు ఆదేశించాను గదా. కనుక భయపడకు, హడలిపోకు. నీవు ఎక్కడికి వెళ్ళినా నీ దేవుడు యెహోవా నీతో ఉంటాడు.”
[10] అప్పుడు యెహోషువ ప్రజా నాయకులకు ఇలా ఆజ్ఞాపించాడు:
[11] “ఇంకా మూడు రోజుల్లో వశపరుచు కోవడానికి మీ దేవుడు యెహోవా మీకు ఇచ్చిన దేశానికి యొర్దాను దాటి వెళ్ళాలి గనుక మీరు భోజనాలు సిద్ధం చేసుకోండి అని మీరు శిబిరంలో వెళ్తూ ప్రజలతో చెప్పండి.”
[12] యెహోషువ రూబేను గోత్రికులతో, గాదు గోత్రికులతో, మనష్షే అర్ధ గోత్రంవారితో ఇలా చెప్పాడు:
[13] “మీ దేవుడు యెహోవా మీకు విశ్రాంతి ప్రసాదించి ఈ ప్రాంతాన్ని మీకు ఇస్తాడని యెహోవా సేవకుడైన మోషే మీకాదేశించిన మాట జ్ఞాపకం తెచ్చుకోండి.
[14] మీ భార్య బిడ్డలూ మీ పశువులూ యొర్దాను ఇవతల మోషే మీకిచ్చిన ఈ ప్రదేశంలో ఉండి పోవాలి. అయితే మీలో ఉన్న యోధులందరూ ఆయుధాలు పట్టుకొని మీ సాటి ఇస్రాయేల్‌వారికి ముందుగా వెళ్తూ వారికి సహాయం చేయాలి.
[15] యెహోవా వారికీ మీకూ విశ్రమం ప్రసాదించేవరకు, వారు కూడా మీ దేవుడు యెహోవా వారికిచ్చే భూమిని స్వాధీనం చేసుకొనేవరకు, మీరు వారికి సహాయం చేయాలి. ఆ తరువాత తూర్పుదిక్కుగా యొర్దాను ఇవతల యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాధీనమైన ఈ ప్రదేశానికి తిరిగి రావచ్చు.”
[16] అప్పుడు వారు యెహోషువతో ఇలా బదులు చెప్పారు. “మీరు మాకు ఆదేశించినట్టే అంతా చేస్తాం. మీరెక్కడికి మమ్మల్ని పంపిస్తే అక్కడికి వెళ్తాం.
[17] అన్ని విషయాల్లో మోషే మాట ఎలా విన్నామో మీ మాట కూడా అలాగే వింటాం. మీ దేవుడు యెహోవా మోషేతో ఉన్నట్టే మీతోనూ ఉంటాడు గాక!
[18] మీ ఆజ్ఞలను ఎదిరించి ఏ విషయంలోనైనా మీ మాటలు పెడచెవిని పెట్టిన ప్రతి ఒక్కరూ మరణశిక్ష పొందుతారు. మీరు మాత్రం దృఢంగా, ధైర్యంగా ఉండాలి.”