[1] యెహోషువ వయసు మళ్ళిన ముసలివాడు అయ్యాడు అప్పుడు యెహోవా అతనితో ఇలా అన్నాడు: “నీవు వయసు మళ్ళిన ముసలివాడివయ్యావు. కానీ ఇంకా స్వాధీనం చేసుకోవలసిన భూమి చాలా మిగిలిపోయింది.
[2] ఇంకా మిగిలిపోయిన భూములేవంటే ఫిలిష్తీయవాళ్ళ ప్రాంతాలన్నీ; గెషూరివాళ్ళ ప్రదేశమంతా,
[3] (ఈజిప్ట్‌కు తూర్పుగా ఉన్న షీహోరు నుంచి ఉత్తర దిక్కున ఎక్రోను సరిహద్దువరకు ఉన్న ప్రాంతం కనానువాళ్ళదని ఎంచుతారు. ఫిలిష్తీయవాళ్ళ అయిదుగురు నాయకులు గాజా, అష్డోదు, అష్‌కెలోను, గాతు, ఎక్రోను అనే పట్టణాల రాజులు.) దక్షిణ దిక్కున ఆవివాళ్ళ ప్రాంతం;
[4] ఆఫెకువరకు, అమోరీవాళ్ళ సరిహద్దువరకు ఉన్న కనానువాళ్ళ ప్రదేశమంతా, సీదోనువాళ్ళ మేరా ప్రాంతం;
[5] గీబ్లీవాళ్ళ ప్రదేశం; హెర్మోను పర్వతం దిగువ ఉన్న బయల్‌గాదు నుంచి హమాతు కనుమ వరకు తూర్పు లెబానోను దేశమంతా;
[6] లెబానోనునుంచి మిశ్‌రేపోత్ మాయిం వరకు ఉన్న పర్వత నివాసులందరి ప్రాంతం; సీదోనువాళ్ళ ప్రదేశమంతా. నేను ఇస్రాయేల్ ప్రజల ఎదుట నుంచి ఈ జనాలను వెళ్ళగొట్టివేస్తాను. నీవు మాత్రం నేను నీకు ఆజ్ఞాపించినట్టు ఇస్రాయేల్‌ప్రజకు వారసత్వంగా ఈ దేశాన్ని పంచిపెట్టు.
[7] తొమ్మిది గోత్రాలవారికి, మనష్షే అర్ధ గోత్రం వారికి వారసత్వంగా ఈ దేశాన్ని పంచిపెట్టు.”
[8] మనష్షే గోత్రంలో తక్కినవారు, రూబేనుగోత్రికులు, గాదుగోత్రికులు యొర్దాను తూర్పుగా యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన ప్రకారం వారి వారసత్వం పుచ్చుకొన్నారు.
[9] మోషే వారికి ఇచ్చినది అర్నోను లోయదగ్గర ఉన్న అరోయేర్ నుంచి ఆ లోయ మధ్య ఉన్న పట్టణం నుంచి దీబోను వరకు ఉన్న మేదెబా మైదానాల ప్రాంతమంతా;
[10] హెష్బోనులో ఉండే అమోరీవాళ్ళ రాజు సీహోను పట్టణాన్ని, అమ్మోనువాళ్ళ సరిహద్దువరకు ఉన్న ప్రాంతమంతా;
[11] గిలాదు ప్రదేశం; గెషూరివాళ్ళ, మాయకాతివాళ్ళ ప్రదేశం; హెర్మోను పర్వత ప్రదేశమంతా; సల్కావరకు బాషాను ప్రదేశమంతా;
[12] రెఫాయింవాళ్ళలో చివరివాడైన అష్‌తారోతులో, ఎద్రెయీలో పరిపాలించిన బాషాను రాజైన ఓగు రాజ్యమంతా. మోషే ఆ రాజులను హతమార్చి వాళ్ళ దేశాలను ఆక్రమించాడు.
[13] కానీ ఇస్రాయేల్‌ప్రజలు గెషూరివాళ్ళనూ మాయాకాతి వాళ్ళనూ బయటికి వెళ్ళగొట్టలేదు. ఈనాటికి గెషూరివాళ్ళూ మాయకాతివాళ్ళూ ఇస్రాయేల్‌ప్రజల మధ్యనే కాపుర ముంటున్నారు.
[14] మోషే లేవీగోత్రికులకు మాత్రమే వారసత్వాన్ని ఇవ్వలేదు. యెహోవా వారికి చెప్పినట్టు ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవాకు అర్పించబడ్డ హోమబలులే వారికి వారసత్వం.
[15] వారి కుటుంబాలప్రకారం రూబేను గోత్రప్రజలకు మోషే వారసత్వాన్ని ఇచ్చాడు.
[16] వారి ప్రాంతం అర్నోనునది గట్టుపై ఉన్న అరోయేర్‌నుంచి, ఆ లోయ మధ్య ఉన్న పట్టణంనుంచి మేదెబావరకు ఉండే మైదానాల ప్రాంతం.
[17] హెష్బోను, మైదానాల ప్రాంతంలోఉన్న దాని పట్టణాలన్నీ; దీబోను, బామెత్‌బయల్, బేత్‌బయల్‌మెయోన్,
[18] యాహాసు, కెదేమోతు, మేఫాతు;
[19] కిర్యతాయిం, సిబ్మా, ఆ లోయలోని కొండమీద ఉన్న శెరెత్‌షహారు;
[20] బేత్ పయోరు, పిస్గాకొండ వాలు ప్రదేశం; బేత్‌యేషిమోతు;
[21] మైదానాల ప్రాంతంలోని ఆ పట్టణాలన్నీ, హెష్బోనులో పరిపాలించిన అమోరీవాళ్ళ రాజు సీహోను రాజ్యమంతా మోషే సీహోనునూ సీహోను దేశంలో నివసిస్తూ, అతడి చేతిక్రింద ఉండే ఎవీ, రేకెం, సూరు, హోరు, రేబ అన్మే మిద్యానువాళ్ళ పాలకులనూ హతమార్చాడు.
[22] తాము చంపిన వాళ్ళతోపాటు ఇస్రాయేల్‌వారు బెయోరు కొడుకూ శకునాలు చెప్పేవాడూ అయిన బిలాంను ఖడ్గంతో చంపారు.
[23] రూబేనువారి సరిహద్దు యొర్దాను ఒడ్డు. రూబేను వారికి వారి కుటుంబాల ప్రకారం వారసత్వం, దానిలోని పట్టణాలూ గ్రామాలూ ఇవే.
[24] గాదు గోత్రికులకు వారి కుటుంబాల ప్రకారం వారసత్వం మోషే ఇచ్చాడు.
[25] గాదువారికి లభించింది యాజెరు, గిలాదు ప్రదేశంలోని పట్టణాలన్నీ, రబ్బాకు ఎదురుగా ఉన్న అరోయేర్‌వరకు అమ్మోనువాళ్ళ దేశంలో సగం,
[26] హెష్బోను నుంచి రామాత్‌మిజ్పె, బెటొనీం వరకు; మహనయీం నుంచి దెబీరు సరిహద్దువరకు ఉన్న ప్రాంతం;
[27] లోయలో హెష్బోను రాజు సీహోను రాజ్యంలో మిగతా భాగమైన బేతారం, బేత్‌నిమ్రా, సుక్కోతు, సాపోను, యొర్దానుకు తూర్పుగా ఈ ప్రాంతం సరిహద్దు కిన్నెరెతు సరస్సు దక్షిణ తీరం వరకు యొర్దాను నది.
[28] గాదుగోత్రికులకు లభించిన వారసత్వం, దానిలోని పట్టణాలూ గ్రామాలూ ఇవే.
[29] మనష్షే అర్ధ గోత్రంవారికి మోషే వారసత్వాన్ని ఇచ్చాడు. మనష్షే అర్ధగోత్రంవారికి వారి కుటుంబాల ప్రకారం లభించినది
[30] మహనయీం నుంచి బాషాను ప్రదేశమంతా – బాషానురాజు ఓగు రాజ్యమంతా, బాషానులోని యాయీరుకు చెందిన అరవై ఊళ్ళు,
[31] గిలాదు ప్రదేశంలో సగం, బాషానులోని ఓగు రాజ్యంలో ఉన్న అష్‌తారోతు, ఎద్రయీ అనే పట్టణాలు మనష్షే కొడుకు మాకీరు సంతతివారిలో సగంమందికి వారి కుటుంబాల ప్రకారం లభించాయి.
[32] యెరికోకు తూర్పువైపుగా, యొర్దాను అవతల, మోయాబు మైదానాల ప్రాంతంలో మోషే వారసత్వంగా పంచిపెట్టిన ప్రదేశాలు ఇవే.
[33] కానీ లేవీగోత్రికులకు మాత్రం మోషే ఏ వారసత్వాన్నీ ఇవ్వలేదు. ఇస్రాయేల్‌వారి దేవుడు యెహోవా వారితో చెప్పినట్టు యెహోవాయే వారి వారసత్వం.