Skip to content
Opens in a new window

[1] యోసేపు సంతతివారికి చీట్ల వల్ల వచ్చిన భూభాగం యెరికోదగ్గర యొర్దానునుంచి తూర్పున యెరికో జలాలవరకు, యెరికోనుంచి ఎడారి మీదుగా కొండసీమ గుండా, బేతేల్‌వరకు ఉంది.

[2] బేతేల్ నుంచి లూజ్‌కు, అక్కడనుంచి అర్కివాళ్ళ ప్రాంతంలో ఉన్న అతారోతుకు పోయింది.

[3] పడమటిగా యపలేతివాళ్ళ ప్రాంతంవరకు దిగిపోయి క్రింది బేత్ హోరోనుకూ గెజేరుకూ వెళ్ళి మహా సముద్రందగ్గర అంతం అయింది.

[4] అక్కడ యోసేపు కొడుకులు మనష్షే, ఎఫ్రాయిం సంతతివారు వారి వారసత్వాన్ని పొందారు.

[5] ఎఫ్రాయిం వంశస్థుల ప్రాంతం, వారి కుటుంబాల ప్రకారం ఇలా ఉంది: తూర్పుగా వారి వారసత్వం సరిహద్దు అతారోతు అద్దారు నుంచి మీది బేత్‌హోరోనువరకు ఉంది.

[6] ఆ సరిహద్దు సముద్రం వైపు వెళ్ళింది. దానికి ఉత్తరంగా మిమెతాత్ ఉంది. ఆ సరిహద్దు తూర్పు వైపుకు తానాత్‌షీలో వరకు చుట్టి వెళ్ళి దానికి తూర్పుగా దాటి యానోహా వరకు సాగింది.

[7] యానోహానుంచి అది అతారోతుకూ నారాకూ దిగిపోయింది.

[8] తప్పూయనుంచి ఆ సరిహద్దు కానా ఏటివరకు పడమటివైపుకు వెళ్ళింది, సముద్రం దగ్గర అంతమైంది. ఇది ఎఫ్రాయిం గోత్రికులకు వారి కుటుంబాల ప్రకారం లభించిన వారసత్వం.

[9] ఎఫ్రాయిం వంశస్థులకు ప్రత్యేకించబడ్డ కొన్ని పట్టణాలు మనష్షే వంశస్థుల వారసత్వంలో ఉన్నాయి. ఆ పట్టణాలన్నీ వాటితో పాటు వాటి గ్రామాలు కూడా వారికి లభించాయి.

[10] అయితే గెజెరులో కాపురం ఉండే కనాను జాతివాళ్ళను వారు వెళ్ళగొట్టలేదు గనుక కనానువాళ్ళు ఈ నాటికీ ఎఫ్రాయిం గోత్రికులమధ్య కాపురం ఉంటూ వారికి దాస్యం చేస్తూ ఉన్నారు.

యెహోషువ — Chapters