[1] ఇస్రాయేల్ గోత్రాలన్నిటిని షెకెం దగ్గర యెహోషువ సమకూర్చాడు. ఇస్రాయేల్‌ప్రజ పెద్దలనూ నాయకులనూ న్యాయాధిపతులనూ అధికారులనూ పిలిపించాడు. వారు దేవుని సన్నిధానంలో హాజరయ్యారు.
[2] యెహోషువ ప్రజలందరితో ఇలా అన్నాడు: “ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా ఈ విధంగా చెపుతున్నాడు – మునుపు మీ పూర్వీకులు, అబ్రాహాము నాహోరుల తండ్రి తెరహు, యూఫ్రటీస్ నది అవతల కాపురముండేవారు – వారు ఇతర దేవుళ్ళను కొలిచేవారు.
[3] ఆ నది అవతల ఉన్న మీ పూర్వీకుడైన అబ్రాహామును నేను తీసుకువచ్చి కనాను దేశమంతా సంచరించేలా చేశాను. అతని సంతానాన్ని సంఖ్యలో అధికం చేశాను. అతనికి ఇస్సాకును ప్రసాదించాను.
[4] ఇస్సాకుకు నేను యాకోబునూ ఏశావునూ అనుగ్రహించాను. స్వాధీనం చేసుకొమ్మని ఏశావుకు శేయీరు పర్వతప్రదేశం ఇచ్చాను. యాకోబు, అతని కొడుకులు దిగువనున్న ఈజిప్ట్‌కు వెళ్ళారు.
[5] “తరువాత మోషేనూ అహరోనునూ నేను పంపి అక్కడ నేను చేసిన చర్యలవల్ల ఈజిప్ట్ దేశాన్ని బాధపెట్టాను. ఆ తరువాత నేను మిమ్ములను వెలుపలికి తీసుకువచ్చాను.
[6] మీ పూర్వీకులను ఈజిప్ట్‌నుంచి నేను బయటికి తీసుకువచ్చి నప్పుడు మీరు సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఈజిప్ట్‌వాళ్ళు రథాలతో రౌతులతో మీ పూర్వీకులను తరుముతూ ఆ ఎర్ర సముద్రం చేరారు.
[7] మీ పూర్వీకులు యెహోవాకు మొరపెట్టి నప్పుడు ఆయన మీకూ ఈజిప్ట్‌వాళ్ళకూ మధ్య కారు చీకటి కలిగించాడు. సముద్రం వాళ్ళ పైబడి ముంచేలా చేశాడు. నేను ఈజిప్ట్‌లో ఏం చేశానో మీరు కళ్ళారా చూశారు. తరువాత మీరు ఎడారిలో చాలా కాలం ఉండిపోయారు.
[8] “అప్పుడు నేను యొర్దాను అవతల ఉండే అమోరీవాళ్ళ దేశానికి మిమ్ములను తీసుకువచ్చాను. వాళ్ళు మీతో యుద్ధం చేశారు గాని నేను వాళ్ళను మీ చేతికప్పగించాను. నేను వాళ్ళను మీ ముందు నాశనం చేసినందుకు మీరు వాళ్ళ దేశాన్ని స్వాధీనం చేసుకొన్నారు.
[9] అప్పుడు సిప్పోరు కొడుకూ మోయాబు రాజైన బాలాకు బయలుదేరి ఇస్రాయేల్‌ప్రజతో యుద్ధం చేశాడు. బెయోరు కొడుకైన బిలాం మిమ్ములను శపించాలని అతణ్ణి బాలాకు రప్పించాడు.
[10] కాని బిలాం మాట నేను వినలేదు. గనుక అతడు మిమ్ములను దీవించవలసి వచ్చింది. ఆవిధంగా నేను అతడి చేతినుంచి మిమ్ములను కాపాడాను.
[11] మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరికి వచ్చారు. యెరికో అధికారులు మీతో యుద్ధం జరిగించారు. అమోరీ, పెరిజ్జి, కనాను, హిత్తి, గిర్గాషి, హివ్వి, యెబూసి జాతులవారు కూడా మీతో యుద్ధం చేశారు గాని వాళ్ళను నేను మీ వశం చేశాను.
[12] మీ ముందు కందిరీగలను పంపించాను. అవి అమోరీవాళ్ళ ఇద్దరు రాజులను మీ దగ్గరనుంచి పారదోలాయి. మీ ఖడ్గంవల్ల, మీ వింటివల్ల అది కాలేదు.
[13] మీరు కష్టపడని ఒక దేశాన్ని మీరు కట్టని పట్టణాలను నేను మీకిచ్చాను. మీరు వాటిలో కాపురం ఉన్నారు. మీరు నాటని ద్రాక్షతోటల, ఆలీవ్‌తోటల పండ్లు తింటున్నారు.
[14] “అందుచేత యెహోవాపట్ల భయభక్తులతో ఉండండి. ఆయనను హృదయపూర్వకంగా యథార్థంగా సేవిస్తూ ఉండండి. యూఫ్రటీసు నది అవతల ఈజిప్ట్‌లో మీ పూర్వీకులు సేవించి పూజించిన దేవుళ్ళను విడిచిపెట్టండి. యెహోవానే సేవించండి.
[15] యెహోవాను సేవించడం మీకు ఇష్టం లేకపోతే మీరు ఏ దేవుళ్ళను సేవిస్తారో ఈ రోజే కోరుకోండి– యూఫ్రటీసు నది అవతల మీ పూర్వీకులు సేవించిన దేవుళ్ళను గానీ మీరు కాపురముంటున్న ఈ దేశంలో ఉన్న అమోరీవాళ్ళ దేవుళ్ళనూ గానీ ఎన్నుకోవచ్చు. అయితే నేనూ నా ఇంటివారు యెహోవానే సేవిస్తాం.”
[16] అందుకు ప్రజలు ఇలా జవాబిచ్చారు: “యెహోవాను విడిచి ఇతర దేవుళ్ళను సేవించడం మాకు దూరం అవుతుంది గాక!
[17] ఎందుచేతనంటే, ఈజిప్ట్‌దేశం నుంచి – ఆ దాస్య గృహం నుంచి మనల్నీ మన పూర్వీకులనూ వెలుపలికి తీసుకువచ్చినది మన దేవుడు యెహోవాయే. మన కళ్ళెదుట ఆ మహా సూచకమైన అద్భుతాలు చేసినవాడు, మనం చేసిన ప్రయాణమంతా మనం వచ్చిన ప్రాంతాల ప్రజలందరి మధ్య మనల్ని సంరక్షించినవాడు ఆయనే.
[18] యెహోవా ఈ దేశంలో నివసించిన అమోరీవాళ్ళనూ జనాలందరినీ మన ఎదుటనుంచి వెళ్ళగొట్టాడు. ఆయనే మా దేవుడు గనుక మేము కూడా యెహోవానే సేవిస్తాం”.
[19] అందుకు యెహోషువ ప్రజలతో ఇలా అన్నాడు: “యెహోవా పవిత్ర దేవుడు గనుక మీరు ఆయనను సేవించ లేక పోతారు. ఆయన రోషంగల దేవుడు. ఆయన మీ అపరాధాలూ పాపాలూ క్షమించడు.
[20] మీరు యెహోవాను విసర్జించి పరాయి దేవుళ్ళను సేవిస్తే ఆయన తన వైఖరి మార్చుకొని మీకు హాని చేస్తాడు. ఇంత కాలం మీకు మేలు చేసిన తరువాత అప్పుడు మిమ్ములను నాశనం చేస్తాడు.”
[21] ప్రజలు “అలా కాదు. మేము యెహోవానే సేవిస్తాం” అని యెహోషువతో అన్నారు.
[22] యెహోషువ ప్రజలతో “మీరు యెహోవానే సేవిస్తామని ఆయనను మీరు కోరుకొన్నారు. దానికి మీ అంతట మీరే సాక్షులు” అన్నాడు. “అలాగే మేము సాక్షులం” అని వారు చెప్పారు.
[23] అతడు అన్నాడు “అయితే మీ మధ్య ఉన్న పరాయి దేవుళ్ళను పారవేయండి. “ఇస్రాయేల్‌ప్రజల దేవుడైన యెహోవా వైపు మీ హృదయాలను త్రిప్పండి.”
[24] ప్రజలు యెహోషువతో “మన దేవుడు యెహోవానే సేవిస్తాం, ఆయన మాట వింటాం” అన్నారు.
[25] గనుక ఆ రోజు యెహోషువ ప్రజతో ఒక ఒప్పందం చేయించి షెకెంలో ఒక శాసనం, ఒక న్యాయనిర్ణయం నియమించాడు.
[26] యెహోషువ ఈ మాటలు దేవుని ధర్మశాస్త్రగ్రంథంలో వ్రాశాడు. అప్పుడు పెద్ద రాయి తెచ్చి యెహోవా పవిత్ర స్థానం ప్రక్కన ఉన్న సిందూర వృక్షం క్రింద దానిని నిలబెట్టాడు.
[27] అప్పుడు యెహోషువ ప్రజలందరితో “ఇదిగో! యెహోవా మనతో పలికిన మాటలన్నీ ఈ రాయికి వినిపించాయి. గనుక ఇది మనకొక సాక్షిలాగా ఉంటుంది. మీరు మీ దేవుణ్ణి ఎరగమని చెప్పినా ఇది మీకు సాక్షిలాగా ఉంటుంది” అన్నాడు.
[28] ఆ తరువాత యెహోషువ ప్రజలను ఎవరి వారసత్వానికి వారిని పంపివేశాడు.
[29] ఇవన్నీ అయినతరువాత నూను కొడుకూ యెహోవా సేవకుడూ అయిన యెహోషువ నూట పది సంవత్సరాల వయసులో చనిపోయాడు.
[30] అతడు వారసత్వంగా పొందిన ప్రాంతం భూమిలో తిమ్నాత్‌సెరహులో వారు అతణ్ణి పాతి పెట్టారు. ఆ ఊరు ఎఫ్రాయిం కొండసీమలో గాషు కొండకు ఉత్తరం వైపుగా ఉంది.
[31] యెహోషువ బ్రతికిన కాలమంతా యెహోవా ఇస్రాయేల్‌ప్రజకు చేసిన చర్యలన్నీ తెలుసుకొని యెహోషువ కంటే ఇంకా బ్రతికిన పెద్దల కాలమంతా ఇస్రాయేల్‌ప్రజలు యెహోవాను సేవించారు.
[32] ఈజిప్ట్‌నుంచి ఇస్రాయేల్ ప్రజలు తెచ్చిన యోసేపు ఎముకలను షెకెంలో పాతిపెట్టారు. షెకెం తండ్రి అయిన హమోరు వంశంవారిదగ్గర యాకోబు వంద వెండి నాణేలు ఇచ్చి కొన్న భూభాగంలో పాతిపెట్టారు. అది యోసేపు సంతానానికి వారసత్వం అయింది.
[33] అహరోను కొడుకైన ఎలియాజరు చనిపోయాడు. అతని కొడుకు ఫీనెహాసుకు ఎఫ్రాయిం కొండసీమలో చీట్లవల్ల లభించిన గిబియాలో వారతణ్ణి పాతిపెట్టారు.