Skip to content
Opens in a new window

[1] నూను కొడుకు యెహోషువ ఇద్దరు గూఢచారులను షిత్తీంనుంచి రహస్యంగా పంపిస్తూ “వెళ్ళి ఆ దేశాన్ని, ముఖ్యంగా యెరికో పట్టణాన్ని చూచి రండి” అని వారితో చెప్పాడు. వారు వెళ్ళి ఒక వేశ్య ఇంటికి చేరి అక్కడ బసచేశారు. ఆ వేశ్య పేరు రాహాబు.

[2] “ఇస్రాయేల్ మనుషులు దేశాన్ని వేగు చూడడానికి ఇక్కడికి వచ్చారని” ఎవరో యెరికో రాజుకు తెలియజేశారు.

[3] యెరికోరాజు “నీదగ్గరికి వచ్చి నీ ఇంట్లో ప్రవేశించిన వాళ్ళను తీసుకురా! వాళ్ళు దేశమంతా వేగు చూడడానికి వచ్చార”ని రాహాబుకు కబురు పంపాడు.

[4] అయితే ఆమె ఆ ఇద్దరిని దాచివేసి వచ్చినవాళ్ళతో “నాదగ్గరికి మనుషులు రావడానికి వచ్చారు గాని వాళ్ళెక్కడ నుంచి వచ్చారో నాకేమీ తెలియదు.

[5] చీకటి పడ్డప్పుడు, పట్టణం ద్వారం మూసే సమయంలో వాళ్ళు బయటికి వెళ్ళారు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. త్వరగా వాళ్ళ వెంట పడండి. వాళ్ళు దొరుకుతారు” అంది.

[6] కానీ అంతకుముందు ఆమె వారిని మిద్దె మీదికి తీసుకువెళ్ళి అక్కడ వరుసగా పేర్చిఉన్న జనపకట్టెల్లో వారిని దాచింది.

[7] రాజు పంపించిన మనుషులు యొర్దాను దారిలో రేవుల వరకు వారిని పట్టుకోవడానికి వెళ్ళారు. వారిని పట్టుకోవడానికి వెళ్లినవాళ్ళు బయలుదేరిన వెంటనే పట్టణం ద్వారం మూశారు.

[8] ఆ గూఢచారులు పడుకొనేముందు రాహాబు పైకప్పు మీదికి వారి దగ్గరికి వెళ్ళి వారితో ఇలా అంది:

[9] “యెహోవా ఈ దేశం మీకిచ్చాడనీ మీ గురించిన భయం మామీదికి వచ్చిందనీ దేశంలో జనమంతా మీరంటే నీరైపోతున్నారనీ నాకు తెలుసు.

[10] ఎందుకంటే మీరు ఈజిప్ట్‌నుంచి వచ్చినప్పుడు యెహోవా మీ ముందు ఎర్ర సముద్రాన్ని ఎండిపోజేసిన సంగతి మేము విన్నాం. యొర్దాను అవతల ఉన్న ఆ ఇద్దరు అమోరీ రాజులకు మీరేం చేశారో అంటే సీహోన్నూ ఓగునూ ఎలా సర్వనాశనం చేశారో అది కూడా మేము విన్నాం.

[11] ఈ విషయాలు విన్నప్పుడు మా గుండెలు నీరైపొయ్యాయి. మీరంటే ఎవరిలోనూ ధైర్యం ఏ కోశానా లేదు. ఎందుచేతనంటే మీ దేవుడైన యెహోవా పైన ఆకాశంలోను క్రింద భూమిమీదా దేవుడు.

[12] నేను మీకు దయ చూపించాను గదా. కనుక మీరు మా నాన్న కుటుంబంమీద దయ చూపిస్తారని నాతో యెహోవా పేర ప్రమాణం చేయండి. నాకు ఖచ్చితమైన ఆనవాలు ఇవ్వండి.

[13] మీరు మా నాన్ననూ అమ్మనూ అన్నదమ్ముల్నీ అక్కచెల్లెండ్రనూ వారి బలగాన్నంతా ప్రాణాలతో రక్షించాలి, చావకుండా మమ్మల్ని కాపాడాలి.”

[14] అందుకు వారు “నీవు మా సంగతి చెప్పకుండా ఉంటే నీవు మా ప్రాణం రక్షించినట్టే మేము మీ ప్రాణాలు రక్షిస్తాం. యెహోవా ఈ దేశాన్ని మా వశం చేసినప్పుడు మేము మీపట్ల దయగా నమ్మకంగా వ్యవహరిస్తాం” అన్నారు.

[15] అప్పుడామె వారిని కిటికీలో నుంచి త్రాడుతో క్రిందికి దింపింది. ఆమె ఇల్లు పట్టణం గోడమీద ఉంది. ఆమె ఆ గోడమీదే కాపురం ఉంది.

[16] ఆమె వారితో “మీరు కొండలకు వెళ్ళండి. లేకపోతే మీకోసం వెదికేవాళ్ళు మిమ్మల్ని పట్టుకొంటారు. పట్టబోయేవారు తిరిగి వచ్చేవరకు అక్కడ మూడు రోజులు దాక్కోండి. ఆ తరువాత మీ దారిని మీరు పోవచ్చు” అని చెప్పింది.

[17] వారు ఆమెతో ఇలా అన్నారు: “ఇదిగో విను. మేము ఈ దేశానికి వచ్చినప్పుడు ఈ ఎర్రని దారాన్ని నీవు మమ్మల్ని కిందికి దించిన కిటికీకి కట్టాలి. మీ నాన్ననూ అమ్మనూ మీ అన్నదమ్ములనూ మీ నాన్న కుటుంబం వాళ్ళందరినీ నీ ఇంటిలోకి తెచ్చుకోవాలి.

[18] నీవు అలా చేయకపోతే నీవు మాతో పెట్టించిన ఒట్టు నుంచి మేము విడుదల అవుతాం.

[19] నీ ఇంటినుంచి ఎవరైనా బయటికి గనుక వెళ్ళితే వారి ప్రాణాలకు వారే జవాబుదారులు. మాకు దోషం ఏమీ ఉండదు. ఇంటిలో నీదగ్గర ఎవరు ఉంటారో వారికేదైనా ప్రమాదం జరిగితే మాది బాధ్యత.

[20] ఒకవేళ నీవు మా సంగతి చెపితే ఇక నీవు మాతో చేయించిన ప్రమాణం చెల్లదు.”

[21] అందుకామె “అలాగే, మీ మాట ప్రకారమే కానివ్వండి” అని వారిని పంపించింది. వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ ఎర్రని దారం కిటికీకి కట్టింది.

[22] వారు కొండల్లోకి వెళ్ళారు. వారిని పట్టబోయేవాళ్ళు పట్టణానికి తిరిగి చేరేవరకు అక్కడ మూడు రోజులు ఉండిపోయారు. పట్టబోయినవాళ్ళు దారి పొడుగునా వెదికారు గాని వారిని కనుక్కోలేకపోయారు.

[23] అలా ఆ ఇద్దరు తిరిగి ఆ కొండలు దిగి నదిని దాటి నూను కొడుకైన యెహోషువ దగ్గరికి వచ్చి జరిగిన విషయాలన్నీ అతనికి చెప్పారు.

[24] వారు యెహోషువతో “నిజంగా యెహోవా ఆ దేశాన్నంతా మన వశం చేస్తున్నాడు; మనమంటే ఆ దేశంవాళ్ళు నీరైపోతున్నారు” అన్నారు.

యెహోషువ — Chapters