[1] యెహోవా అప్పుడు యెహోషువతో ఇలా అన్నాడు: “భయపడకు, హడలిపోకు. సైనికులందరినీ నీతో తీసుకొని లేచి హాయీమీద దండెత్తు. నేను హాయీ రాజునూ అతడి జనాన్నీ ఊరినీ ప్రాంతాన్నీ నీకు స్వాధీనం చేశాను.
[2] యెరికోనూ దాని రాజునూ నీవు ఏ విధంగా చేశావో అలాగే హాయీనీ దాని రాజునూ చేయాలి. కాని ఆ ఊరి పశువులనూ సొమ్మునూ మీకోసం దోచుకోవచ్చు. ఊరి వెనుక మాటు పెట్టు.”
[3] కనుక యెహోషువ సైనికులంతా హాయీమీదికి వెళ్ళడానికి బయలు దేరారు. ముప్ఫయి వేలమంది పరాక్రమ వంతులను యెహోషువ ఎన్నుకొని రాత్రివేళ వారిని పంపిస్తూ వారికిలా ఆజ్ఞాపించాడు:
[4] “మీరు ఊరికి వెనుక పొంచి ఉండాలి. ఊరికి బాగా దూరంగా పోవద్దు సుమా! మీరంతా సిద్ధంగా మాత్రం ఉండండి.
[5] నేనూ నాతో ఉన్నవారంతా ఊరి దగ్గరికి వస్తాం. ఆ ఊరివాళ్ళు మాకెదురుగా వచ్చినప్పుడు మునుపటిలాగే మేము పారిపోతాం.
[6] ‘మునుపు పారిపోయినట్టు పారిపోతున్నారు’ అనుకొని వాళ్ళు మా వెంటపడతారు. ఆ విధంగా మేము వాళ్ళ ఎదుటనుంచి పారిపోతూ వాళ్ళు ఊరి దగ్గర నుంచి వచ్చేలా చేస్తాం.
[7] అప్పుడు మీరు మాటునుంచి బయటికి వచ్చి ఊరిని పట్టుకోవాలి. మీ దేవుడు యెహోవా ఆ ఊరిని మీ వశం చేస్తాడు.
[8] ఊరిని పట్టుకొన్న తరువాత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం దానికి మీరు అగ్ని పెట్టాలి. చూడండి ఇది నా ఆజ్ఞ.”
[9] యెహోషువ వారిని పంపించాడు. వారు వెళ్ళి బేతేల్‌కు హాయీకి మధ్య హాయీకి పడమటి వైపున మాటు వేశారు. యెహోషువ మాత్రం శిబిరంలో ఆ రాత్రి గడిపాడు.
[10] యెహోషువ పెందలకడ లేచి ప్రజలను సమకూర్చి ఇస్రాయేల్ ప్రజల పెద్దలతోపాటు ప్రజలముందు నడుస్తూ హాయీమీదికి వెళ్ళాడు.
[11] అతనితో వస్తున్న సైనికులంతా వెళ్ళి హాయిదగ్గరికి చేరి దానికి ఉత్తర దిక్కుగా దిగారు. హాయీకి వారికీ మధ్య లోయ ఉంది.
[12] అప్పుడతడు అయిదు వేలమందిని ఎన్నుకొని బేతేల్‌కూ హాయీకీ మధ్య ఊరికి పడమటివైపు మాటుంచాడు.
[13] ఈ విధంగా ఊరికి ఉత్తరంగా జనాన్ని, పడమర మాటున సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రాత్రి యెహోషువ ఆ లోయ మధ్యభాగానికి వెళ్ళాడు.
[14] హాయీరాజు అది చూచినప్పుడు అతడూ ఆ ఊరివాళ్ళంతా తెల్లవారగానే తొందరగా లేచి మైదానం ఎదుట తాము నిర్ణయించుకొన్న స్థలంలో ఇస్రాయేల్ ప్రజతో యుద్ధం చేయడానికి ఊరి బయటికి వచ్చారు. అయితే ఊరి వెనుక తనను పట్టుకోవడానికి కొంతమంది మాటున పొంచి ఉన్నారని రాజుకు తెలియదు.
[15] యెహోషువ, ఇస్రాయేల్ ప్రజలంతా వాళ్ళ వల్ల ఓడిపోయినట్టు నటించి ఎడారి త్రోవను పారి పోయారు.
[16] వారిని తరమడానికి హాయీ వాళ్ళందరినీ వాళ్ళ నాయకులు పిలిపించారు. వాళ్ళు యెహోషువ వెంటపడుతూ ఊరికి దూరమయ్యారు.
[17] ఇస్రాయేల్ ప్రజలను తరమడానికి రానివారు ఒక్కడూ హాయీలో గానీ బేతేల్‌లో గానీ మిగలలేదు. వాళ్ళు ఊరిని బట్టబయలుగా వదిలివేసి ఇస్రాయేల్ ప్రజల వెంటపడ్డారు.
[18] అప్పుడు యెహోవా “నీ చేతిలో ఉన్న ఈటెను హాయీ వైపు చాపు. ఆ ఊరిని నీ చేతికిస్తాను” అని యెహోషువతో చెప్పాడు. యెహోషువ తన చేతిలో ఉన్న ఈటెను ఊరివైపు చాపాడు.
[19] మాటున ఉన్నవారు త్వరగా తమ స్థలంలోనుంచి బయటికి వచ్చారు. యెహోషువ చెయ్యి చాపి చాపడంతోనే వారు పరుగెత్తి ఊరిలో చొరబడి దానిని వశం చేసుకొని త్వరత్వరగా దానికి నిప్పంటించారు.
[20] హాయీవాళ్ళు వెనక్కు చూచేటప్పటికీ ఊరిలోనుంచి పొగ ఆకాశంవరకు లేస్తూ ఉండడం వాళ్ళకు కన్పించింది. ఇంతలో ఎడారివైపు పారిపోతూ ఉన్నవారు తరిమేవాళ్ళ వైపు తిరిగి వాళ్ళ పై పడ్డారు. గనుక హాయీవాళ్ళకు ఇటు గానీ అటు గానీ పరుగెత్తడానికి అవకాశం లేకపోయింది.
[21] మాటున పొంచినవారు ఊరిని వశం చేసుకోవడం, ఊరినుంచి పొగపైకి లేవడం యెహోషువ, ఇస్రాయేల్ వారంతా చూచి హాయీవాళ్ళ వైపుకు తిరిగి వాళ్ళను కూల్చారు.
[22] ఈ లోగా ఊరిలో ఉన్న ఇస్రాయేల్ వారు కూడా వాళ్ళతో పోరాడడానికి బయటికి వచ్చారు. కాబట్టి ఇస్రాయేల్‌వారు కొంతమంది ఇటువైపు కొంతమంది అటువైపు ఉండడంచేత ఇస్రాయేల్‌వారి మధ్య హాయీవాళ్ళు చిక్కుపడ్డారు. వాళ్ళలో బ్రతికి బయటపడ్డ వాడంటూ ఎవ్వరూ లేకుండా వారు వాళ్ళను కూల్చారు.
[23] హాయీ రాజును మాత్రమే వారు ప్రాణంతో పట్టుకొని యెహోషువ దగ్గరికి తీసుకువచ్చారు.
[24] పొలాలలో, ఎడారి ప్రాంతంలో తమ్మును తరిమిన హాయీ కాపురస్థులందరినీ ఇస్రాయేల్‌వారు చంపివేశారు – వాళ్ళంతా నాశనమయ్యేవరకు వాళ్ళు ఖడ్గం పాలయ్యారు. ఆ తరువాత ఇస్రాయేల్‌వారంతా హాయీకి తిరిగి వచ్చి ఖడ్గంతో దానిని నాశనం చేశారు.
[25] ఆరోజు హాయీ జనమంతా చచ్చారు. చచ్చిన స్త్రీపురుషులు పన్నెండు వేలమంది.
[26] హాయీ కాపురస్థులంతా పూర్తిగా నాశనమయ్యేవరకు యెహోషువ ఈటెను, చాపిన చెయ్యి ముడుచుకోలేదు.
[27] యెహోవా యెహోషువకు జారీచేసిన ఆజ్ఞ ప్రకారం ఆ ఊరి పశువులను, దోపుడు సొమ్మును మాత్రమే ఇస్రాయేల్‌ప్రజలు సొంతానికి ఉంచుకొన్నారు.
[28] యెహోషువ హాయీని కాల్చివేసి అది ఎల్లకాలం పాడుదిబ్బగా ఉండేలా చేశాడు. ఈనాటికి అది అలాగే ఉంది.
[29] యెహోషువ హాయీ రాజును ఒక చెట్టుకు ఉరితీశాడు. సాయంత్రంవరకు ఆ రాజు దానికి వ్రేలాడుతూ ఉన్నాడు. ప్రొద్దు క్రుంకేటప్పుడు యెహోషువ ఆజ్ఞ జారీ చేశాడు. వారు వాడి శవాన్ని చెట్టుమీద నుంచి దించి ఊరిలోకి ప్రవేశించే ద్వారం దగ్గర పారవేసి ఆ శవం పై పెద్ద రాళ్ళ కుప్ప వేశారు. అది ఈనాటికి అక్కడే ఉంది.
[30] అప్పుడు యెహోషువ ఏబాల్ పర్వతంమీద ఇస్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టాడు.
[31] ఇస్రాయేల్ ప్రజకు యెహోవా సేవకుడు అయిన మోషే ఆజ్ఞాపించినట్టే మోషే ధర్మశాస్త్రగ్రంథంలో వ్రాసి ఉన్నట్టే ఏ మనిషీ ఇనుప పనిముట్టుతో తాకని, మలచని రాళ్ళతోనే ఆ బలిపీఠం కట్టాడు. దానిమీద వారు యెహోవాకు హోమ బలులూ శాంతిబలులూ అర్పించారు.
[32] ఇస్రాయేల్ ప్రజల సమక్షంలో మోషే వ్రాసిన ధర్మశాస్త్రం ప్రతిని యెహోషువ ఆ రాళ్ళమీద వ్రాశాడు.
[33] యెహోవా ఒడంబడికపెట్టెను మోసే లేవీగోత్రికులైన యాజుల ముందు ఇస్రాయేల్ ప్రజలంతా వారి పెద్దలూ నాయకులూ న్యాయాధిపతులూ ఆ పెట్టెకు ఈ ప్రక్కన, ఆ ప్రక్కన నిలబడ్డారు. వారితో పాటు వారి మధ్య ఉన్న పరదేశులు కూడా అలా నిలబడ్డారు. ప్రజలలో సగంమంది గెరిజీం పర్వతం ఎదురుగా, సగంమంది ఏబాల్ పర్వతం ఎదురుగా నిలబడ్డారు. ఇస్రాయేల్‌ప్రజ ఆశీర్వాదం పొందడానికి వారు అలా నిలబడాలని అంతకుముందే మోషే ఆజ్ఞాపించాడు.
[34] ఆ తరువాత యెహోషువ ధర్మశాస్త్రగ్రంథంలో వ్రాసి ఉన్నప్రకారం – ఆశీర్వచనాలనూ శాపవచనాలనూ – ధర్మశాస్త్ర వాక్కులన్నీ చదివి వినిపించాడు.
[35] వారితోపాటు స్త్రీలూ పిల్లలూ వారి మధ్య ఉంటున్న పరదేశస్థులూ నిలబడి ఉంటే ఇస్రాయేల్‌ప్రజా సమాజమంతటి సమక్షంలో మోషే ఆజ్ఞాపించినవాటిలో యెహోషువ వినిపించకుండా విడిచిపెట్టిన మాట ఒక్కటి కూడా లేదు.