Skip to content
Opens in a new window

[1] యెహోషువ హాయీని వశపరచుకొని యెరికోనూ దాని రాజునూ చేసినట్టే హాయీనీ దాని రాజునూ చేసి ఆ ఊరిని సర్వనాశనం చేశాడని జెరుసలం రాజైన అదోనీసెదెకు విన్నాడు. గిబియోను వాసులు ఇస్రాయేల్ ప్రజలను సఖ్యపరచుకొని వారితోనే ఉంటున్నారని కూడా అతడు విన్నాడు.

[2] అతడికి చాలా భయం వేసింది. ఎందుకంటే గిబియోను ఒక మహా పట్టణం. రాజపురంలాంటిది; హాయీకంటే పెద్దది. దాని నివాసులంతా యుద్ధవీరులు.

[3] అందుచేత జెరుసలంరాజు అదోనీసెదెకు హెబ్రోను రాజైన హోహాంకూ యర్మూతు రాజైన పైరాంకూ లాకీషు రాజైన యాఫీయకూ ఎగ్లోను రాజైన దెబీర్‌కూ ఈ విధంగా కబురు పంపాడు:

[4] “నా దగ్గరికి రండి. గిబియోనువాళ్ళు యెహోషువతో ఇస్రాయేల్‌ప్రజతో సఖ్యపడ్డారు. గిబియోనును నాశనం చేయడానికి నాకు సహాయం చెయ్యండి.”

[5] అమోరీవాళ్ళ రాజులు అయిదుగురు – జెరుసలం రాజూ హెబ్రోను రాజూ యర్మూతు రాజూ లాకీషు రాజూ ఎగ్లోను రాజూ – సమకూడారు. వాళ్ళు, వాళ్ళ సైన్యాలన్నీ బయలుదేరి గిబియోనును ముట్టడించి దానితో యుద్ధం జరిగించారు.

[6] అప్పుడు గిబియోనువాళ్ళు గిల్గాల్‌లోని శిబిరంలో ఉన్న యెహోషువకు ఇలా కబురు పంపారు. “కొండసీమలలో నివసించే అమోరీ రాజులందరూ కలుసుకొని మామీదికి దండెత్తారు. మీ దాసులైన మా చెయ్యి విడవకండి. త్వరగా మాదగ్గరికి రండి. మాకు సహాయం చెయ్యండి. మమ్మల్ని రక్షించండి.”

[7] కాబట్టి యెహోషువ, అతనితోపాటు సైనికులంతా, యుద్ధ వీరులంతా గిల్గాల్ నుంచి తరలివెళ్ళారు.

[8] అప్పుడు యెహోషువతో యెహోవా ఇలా అన్నాడు: “వారంటే భయపడకు. నీ చేతికి వారిని అప్పగించాను. వారిలో ఒక్కడూ నీ ఎదుట ఆగలేడు.”

[9] యెహోషువ రాత్రంతా గిల్గాల్ నుంచి ప్రయాణం చేసి వాళ్ళ మీద హఠాత్తుగా పడ్డాడు.

[10] యెహోవా వాళ్ళను ఇస్రాయేల్‌వారి ఎదుట ఓడించి పారదోలాడు. గిబియోను దగ్గర యెహోషువ వాళ్ళను ఘోరంగా వధించాడు. బేత్‌హోరోనుకు పైకి పోయే దారి వెంట వాళ్ళను తరుముతూ అజేకా వరకూ మక్కేదావరకూ వాళ్ళను హతమారుస్తూ వచ్చాడు.

[11] వాళ్ళు ఇస్రాయేల్‌వారి ముందునుంచి పారిపోతూ ఉంటే బేత్‌హోరోను కనుమలో అజేకావరకు యెహోవా వాళ్ళపై ఆకాశంనుంచి పెద్దపెద్ద వడగండ్లు కురిపించాడు. వాళ్ళు చచ్చారు. ఇస్రాయేల్ వారు కత్తితో చంపినవాళ్ళ కంటే వడగండ్లవల్ల చచ్చినవాళ్ళే ఎక్కువమంది.

[12] యెహోవా అమోరీవాళ్ళను ఇస్రాయేల్‌వారి వశం చేసిన రోజున యెహోషువ యెహోవాతో మాట్లాడి ఇస్రాయేల్ వారి సమక్షంలో ఇలా అన్నాడు: “సూర్యగోళమా, గిబియోను మీద ఆగిపో! చంద్రబింబమా, అయ్యాలోను లోయపైగా ఆగిపో!”

[13] శత్రువులమీద ఇస్రాయేల్‌ప్రజ పగ తీర్చుకొనేంతవరకు సూర్యగోళం నిలిచింది, చంద్రబింబం ఆగిపోయింది. ఈ సంగతి యాషారు గ్రంథంలో వ్రాసి ఉంది గదా. ఆకాశం మధ్యలో సూర్యగోళం నిలిచివుండి దాదాపు ఆ రోజంతా అస్తమించడానికి ఆలస్యం చేసింది.

[14] యెహోవా ఒక మానవుడి మాట విన్న ఆ రోజులాంటిది ఇంకొకటి అంతకుముందు గానీ ఆ తరువాత గానీ లేదు. యెహోవా ఇస్రాయేల్ ప్రజల కోసం యుద్ధం చేశాడు!

[15] ఆ తరువాత యెహోషువ అతనితో పాటు ఇస్రాయేల్ వారంతా గిల్గాల్ లో ఉన్న శిబిరానికి తిరిగి వచ్చారు.

[16] ఆ అయిదుగురు రాజులు పారిపోయి మక్కేదా దగ్గర ఒక గుహలో దాగుకొన్నారు.

[17] “ఆ అయిదుగురు రాజులు మక్కేదాదగ్గర గుహలో దాక్కొన్నారని తెలిసింది” అని ఎవరో యెహోషువకు చెప్పారు.

[18] యెహోషువ అన్నాడు: “గుహ ద్వారానికి పెద్దపెద్ద రాళ్ళను దొర్లించి మూసి వేయండి. దానిప్రక్క మనుషులను కాపలా పెట్టండి.

[19] మీరు అక్కడ ఆగకుండా శత్రువులను తరుముతూ ఉండండి, వెనుక ఉన్నవాళ్ళను కూల్చండి. వాళ్ళ పట్టణాలలోకి వాళ్ళను వెళ్ళనియ్యకండి. మీ దేవుడు యెహోవా వాళ్ళను మీ చేతికి అప్పగించాడు.”

[20] వాళ్ళు నాశనమయ్యేవరకు యెహోషువ, ఇస్రాయేల్ వారు మహా వధ చేసి ముగించారు. వాళ్ళలో మిగిలినవాళ్ళు ప్రాకారాలు ఉన్న పట్టణాలలోకి చేరుకొన్నారు.

[21] అప్పుడు ఇస్రాయేల్ వారంతా మక్కేదాదగ్గర ఉన్న శిబిరానికి యెహోషువ దగ్గరికి క్షేమంగా తిరిగి వచ్చారు. ఇస్రాయేల్‌ప్రజలను ఎవ్వడూ ఒక్క మాట కూడా అనడానికి తెగించలేదు.

[22] యెహోషువ “గుహ ద్వారం తెరచి గుహనుంచి వెలుపలికి నాదగ్గరికి ఆ అయిదుగురు రాజులను తీసుకురండి” అన్నాడు.

[23] వారు అలా చేసి ఆ అయిదుగురు రాజులను – జెరుసలం రాజునూ హెబ్రోను రాజునూ యర్మూతు రాజునూ లాకీషు రాజునూ ఎగ్లోను రాజునూ – గుహనుంచి బయటికి తెచ్చారు.

[24] ఆ రాజులను వారు యెహోషువ దగ్గరికి తీసుకువచ్చాక యెహోషువ ఇస్రాయేల్ ప్రజలందరినీ పిలిపించి తనతో వెళ్ళిన సైనికుల అధిపతులతో “నా దగ్గరికి రండి, మీ పాదాలు ఈ రాజుల మెడలమీద పెట్టండి” అన్నాడు. కనుక వారు దగ్గరికి వచ్చి వాళ్ళ మెడలమీద తమ పాదాలు పెట్టారు.

[25] అప్పుడు యెహోషువ వారితో అన్నాడు, “మీరు యుద్ధం చేసే మీ శత్రువులందరికీ యెహోవా ఈ విధంగానే చేస్తాడు. గనుక భయపడకండి, హడలిపోకండి. దృఢంగా, ధైర్యంగా ఉండండి.”

[26] ఆ తరువాత యెహోషువ ఆ రాజులను కొట్టి చంపి వాళ్ళ శవాలను అయిదు చెట్లకు వ్రేలాడదీశాడు. సాయంకాలం వరకు వాళ్ళు ఆ చెట్లమీద వ్రేలాడుతూనే ఉన్నారు.

[27] ప్రొద్దు క్రుంకే సమయాన యెహోషువ ఆజ్ఞప్రకారం వాళ్ళను చెట్లమీదనుంచి దింపి వాళ్ళు దాగుకొన్న గుహలోనే పారవేసి గుహ ద్వారానికి అడ్డంగా పెద్దపెద్ద రాళ్లను దొర్లించారు. అవి ఈనాటికి అలాగే ఉన్నాయి.

[28] ఆ రోజే యెహోషువ మక్కేదాను పట్టుకొని దానినీ దాని రాజునూ కత్తిపాలు చేశాడు. ఆ ఊరినీ దానిలో ఉన్న అందరినీ సర్వనాశనం చేశాడు. ఒక్కణ్ణీ మిగల్చలేదు. అతడు యెరికో రాజుకు చేసినట్టే మక్కేదా రాజుకు చేశాడు.

[29] మక్కేదానుంచి యెహోషువ, అతనితోపాటు ఇస్రాయేల్‌వారంతా లిబనాకు వెళ్ళి దానిపై యుద్ధం చేశారు.

[30] దానినీ దాని రాజునూ కూడా యెహోవా ఇస్రాయేల్‌వారి చేతికి అప్పగించాడు. వారు దానినీ దానిలో ఉన్న వాళ్ళందరినీ కత్తితో సంహరించారు. వారు దానిలో ఒక్కరినీ మిగలనివ్వలేదు. యెరికోరాజును చేసినట్టే ఆ రాజును చేశారు.

[31] లిబనానుంచి బయలుదేరి యెహోషువ, అతనితోపాటు ఇస్రాయేల్‌వారంతా లాకీషుకు వెళ్లి దానిని ముట్టడించి దానిపై యుద్ధం చేశారు.

[32] యెహోవా ఇస్రాయేల్‌వారి చేతికి లాకీషును కూడా అప్పగించాడు. రెండో రోజున వారు దానిని పట్టుకొని లిబనాను చేసినట్టే దానినీ దానిలో ఉన్న వాళ్ళందరినీ కత్తితో నాశనం చేశారు.

[33] లాకీషుకు సహాయంగా గెజెరు రాజైన హోరాం వచ్చాడు. యెహోషువ అతణ్ణీ, అతడి జనంలో ఒక్కడూ మిగలకుండా వారినీ కూలగొట్టాడు.

[34] లాకీషునుంచి యెహోషువ, అతనితోపాటు ఇస్రాయేల్‌వారంతా ఎగ్లోనుకు వెళ్ళి దానిని ముట్టడించి దానిపై యుద్ధం చేశారు.

[35] చేరిన రోజే దానిని పట్టుకొని దానిని కత్తితో నాశనం చేశారు. లాకీషును చేసినట్టే దానిలో ఉన్నవాళ్ళందరినీ ఆ రోజున చంపారు.

[36] ఎగ్లోనునుంచి యెహోషువ, అతనితోపాటు ఇస్రాయేల్‌వారంతా హెబ్రోనుకు వెళ్ళి దానిమీద యుద్ధం చేశారు.

[37] వారు దానిని పట్టుకొని దానినీ దాని రాజునూ దానికి చెందిన అన్ని గ్రామాలనూ దానిలో ఉన్న వాళ్ళందరినీ కత్తిపాలు చేశారు. ఎగ్లోనుకు ఎలా చేశారో అలాగే వారు ఒక్కరినీ మిగల్చలేదు. దానినీ దానిలో ఉన్న వాళ్ళందరినీ సర్వనాశనం చేశారు.

[38] అక్కడనుంచి తిరిగి, యెహోషువ అతనితోపాటు ఇస్రాయేల్ వారంతా దెబీరుకు వచ్చి దానిపై యుద్ధం చేశారు.

[39] వారు దానినీ దాని రాజునూ దానికి చెందిన అన్ని గ్రామాలనూ పట్టుకొన్నారు. కత్తితో వాటిని నాశనం చేశారు. దెబీరులో ఉన్నవాళ్ళందరినీ చంపారు. ఒక్కరినీ మిగల్చలేదు. హెబ్రోనునూ లిబనానూ దాని రాజునూ చేసినట్టే దెబీరును చేశారు.

[40] యెహోషువ కొండల ప్రదేశాన్నంతా దక్షిణ ప్రాంతాన్నంతా దిగువ ప్రదేశాలన్నిటినీ వాలు ప్రాంతాలన్నిటినీ ఆ ప్రదేశాల రాజులను జయించాడు. ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవా ఆజ్ఞాపించినట్టే ప్రాణం ఉన్నవాళ్ళందరినీ అతడు సంహరించాడు. ఒక్కడినీ మిగలనివ్వలేదు.

[41] కాదేష్‌బర్నెయా నుంచి గాజా వరకు గోషెను ప్రదేశాన్నంతా గిబియోనువరకు అతడు జయించాడు.

[42] ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా ఇస్రాయేల్‌వారి పక్షంగా యుద్ధం చేశాడు గనుక ఆ రాజులందరినీ వాళ్ళ ప్రదేశాలనూ ఒకే సారి యెహోషువ పట్టుకొన్నాడు.

[43] ఆ తరువాత యెహోషువ, అతనితోపాటు ఇస్రాయేల్‌వారంతా గిల్గాల్‌లో ఉన్న శిబిరానికి తిరిగి వచ్చారు.

యెహోషువ — Chapters