Skip to content
Opens in a new window

[1] లేవీ గోత్రం కుటుంబాల పెద్దలు యాజి అయిన ఎలియాజరు దగ్గరికీ నూను కొడుకు యెహోషువ దగ్గరికీ ఇస్రాయేల్‌ప్రజల గోత్రాల కుటుంబాల పెద్దల దగ్గరికీ వచ్చారు.

[2] అప్పుడు వారు కనాను దేశంలోని షిలోహులో ఉన్నారు. వారు వారితో “మేము కాపురముండడానికి పట్టణాలూ పశువులకు వాటి పచ్చిక మైదానాలూ మాకివ్వాలని యెహోవా మోషేద్వారా ఆజ్ఞ జారీ చేశాడు” అన్నారు.

[3] కనుక యెహోవా ఆజ్ఞననుసరించి ఇస్రాయేల్ ప్రజలు వారి వారసత్వంలోనుంచి లేవీగోత్రికులకు వాటి పచ్చిక మైదానాలతోపాటు ఈ పట్టణాలు ఇచ్చారు:

[4] కహాతువారి కుటుంబాల చీటి వచ్చింది. యాజి అహరోను వంశంలోని ఆ లేవీగోత్రికులకు యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్రాల వారసత్వాలలోనుంచి చీట్లవల్ల పదమూడు పట్టణాలు లభించాయి.

[5] మిగతా కహాతువారికి ఎఫ్రాయిం, దాను గోత్రాల కుటుంబాలనుంచీ మనష్షే అర్ధ గోత్ర కుటుంబాల నుంచీ చీట్లవల్ల పది పట్టణాలు లభించాయి.

[6] గెర్షోనువారికి ఇశ్శాకారు, ఆషేరు, నఫ్తాలి గోత్రాల కుటుంబాలనుంచీ బాషానులో ఉన్న మనష్షే అర్ధగోత్ర కుటుంబాలనుంచీ పదమూడు పట్టణాలు లభించాయి.

[7] మెరారి కుటుంబాలకు రూబేను, గాదు, జెబూలూను గోత్రాలనుంచి పన్నెండు పట్టణాలు లభించాయి.

[8] యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించిన ప్రకారం ఇస్రాయేల్‌ప్రజలు చీట్లు వేసి లేవీగోత్రికులకు ఆ పట్టణాలూ వాటి పచ్చిక మైదానాలూ ఇచ్చారు.

[9] లేవీ గోత్రంలో అహరోను వంశంలో కహాతు కుటుంబాలదే మొదటి చీటి.

[10] ఇస్రాయేల్‌వారు యూదా, షిమ్యోన్ గోత్రాల నుంచి ఈ క్రింద చెప్పిన పట్టణాలు వారికిచ్చారు.

[11] యూదా కొండసీమలో ఉన్న హెబ్రోను అనే కిర్యత్‌అర్బా (అర్బా అనాకుకు తండ్రి) దాని చుట్టు ఉన్న పచ్చిక మైదానాలు.

[12] కానీ యెఫున్నె కొడుకు కాలేబుకు ఆస్తిగా ఆ పట్టణం పొలాలు, దాని గ్రామాలు ఇచ్చారు.

[13] హత్య చేసినవారికి శరణు పట్టణంగా ఉన్న హెబ్రోను, దాని పచ్చిక మైదానాలు యాజియైన అహరోను వంశీయులకిచ్చారు. అది గాక లిబ్నా, దాని పచ్చిక మైదానాలు,

[14] యత్తీరు, దాని పచ్చిక మైదానాలు, ఎష్‌టెమోయ, దాని పచ్చిక మైదానాలు,

[15] హోలోను, దాని పచ్చిక మైదానాలు, దెబీరు, దాని పచ్చిక మైదానాలు,

[16] ఆయిను, దాని పచ్చిక మైదానాలు, యుట్టయు, దాని పచ్చిక మైదానాలు, బేత్‌షెమెషు, దాని పచ్చిక మైదానాలు కూడా ఇచ్చారు. ఆ రెండు గోత్రాలనుంచి ఆ తొమ్మిది పట్టణాలిచ్చారు.

[17] బెన్యామీను గోత్రంనుంచి గిబియోను, దాని పచ్చిక మైదానాలు, గెబ దాని పచ్చిక మైదానాలు,

[18] అనాతోతు, దాని పచ్చిక మైదానాలు, అల్మోను, దాని పచ్చిక మైదానాలు – ఆ నాలుగు పట్టణాలు ఇచ్చారు.

[19] అహరోను వంశస్థులైన యాజులకు లభించినవి పదమూడు పట్టణాలు, వాటి పచ్చిక మైదానాలు.

[20] కహాతు వంశాలలో మిగిలిన లేవీగోత్రికులకు చీట్లద్వారా ఎఫ్రాయిం గోత్రంనుంచి పట్టణాలు లభించాయి.

[21] హత్య చేసినవారికి శరణు పట్టణంగా ఉన్న షెకెం, దాని పచ్చిక మైదానాలు వారికిచ్చారు. షెకెం ఎఫ్రాయిం కొండ ప్రదేశంలో ఉంది. గెజెరు, దాని పచ్చిక మైదానాలు,

[22] కిబ్‌సాయిం, దాని పచ్చిక మైదానాలు, బేత్‌హోరోను, దాని పచ్చిక మైదానాలు కూడా ఇచ్చారు. మొత్తం నాలుగు పట్టణాలు.

[23] దాను గోత్రం నుంచి కూడా నాలుగు పట్టణాలు ఇచ్చారు – ఎల్‌తెకే, దాని పచ్చిక మైదానాలు, గిబ్బెతోను, దాని పచ్చిక మైదానాలు,

[24] అయ్యాలోను, దాని పచ్చిక మైదానాలు, గాత్‌రిమ్మోను, దాని పచ్చిక మైదానాలు.

[25] మనష్షే అర్ధ గోత్రంనుంచి ఈ రెండు పట్టణాలు ఇచ్చారు – తానాకు, దాని పచ్చిక మైదానాలు, గాత్ రిమ్మోను, దాని పచ్చిక మైదానాలు.

[26] మిగిలిన కహాతువారి కుటుంబాలకు వచ్చిన మొత్తం పట్టణాలు పది.

[27] లేవీ గోత్రికులైన గెర్షోను వంశంవారికి మనష్షే అర్ధ గోత్రంనుంచి రెండు పట్టణాలు ఇచ్చారు– బాషానులో గోలాను, దాని పచ్చిక మైదానాలు, బేయెష్‌తారా, దాని పచ్చిక మైదానాలు. గోలాను హత్య చేసినవారికి శరణు పట్టణంగా ఉంది.

[28] ఇశ్శాకారు గోత్రం నుంచి ఈ నాలుగు పట్టణా లిచ్చారు – కిష్యోన్, దాని పచ్చిక మైదానాలు, దాబరెత్, దాని పచ్చిక మైదానాలు,

[29] యర్మూత్, దాని పచ్చిక మైదానాలు, ఏన్‌గన్నీం, దాని పచ్చిక మైదానాలు.

[30] ఆషేరు గోత్రంనుంచి ఈ నాలుగు పట్టణాలిచ్చారు – మిషేల్, దాని పచ్చిక మైదానాలు, అబ్దోను, దాని పచ్చిక మైదానాలు,

[31] హెల్కత్, దాని పచ్చిక మైదానాలు, రెహోబ్, దాని పచ్చిక మైదానాలు.

[32] నఫ్తాలిగోత్రం నుంచి ఈ మూడు పట్టణాలిచ్చారు: గలలీలో కెదెష్, దాని పచ్చిక మైదానాలు (కెదెష్ హత్యచేసిన వారికి శరణు పట్టణం), హమ్మోత్‌దోరు, దాని పచ్చిక మైదానాలు, కర్తాను, దాని పచ్చిక మైదానాలు.

[33] వారి కుటుంబాల ప్రకారం గెర్షోను వారికి లభించిన మొత్తం పట్టణాలూ వాటి పచ్చిక మైదానాలు పదమూడు.

[34] తక్కిన లేవీగోత్రికులైన మెరారి వంశంవారికి జెబూలూను గోత్రం నుంచి ఈ నాలుగు పట్టణాలు ఇచ్చారు: యొక్‌నెయాం, దాని పచ్చిక మైదానాలు, కర్తా, దాని పచ్చిక మైదానాలు,

[35] దిమ్నా, దాని పచ్చిక మైదానాలు, వహలాల్ దాని పచ్చిక మైదానాలు.

[36] రూబేను గోత్రంనుంచి ఈ నాలుగు పట్టణాలు ఇచ్చారు: బేసెరు, దాని పచ్చిక మైదానాలు, యాహస్, దాని పచ్చిక మైదానాలు,

[37] కెదెమోతు, దాని పచ్చిక మైదానాలు, మేఫాతు, దాని పచ్చిక మైదానాలు.

[38] గాదుగోత్రంనుంచి ఈ నాలుగు పట్టణాలిచ్చారు: గిలాదులో ఉన్న రామోతు, దాని పచ్చిక మైదానాలు, (రామోతు హత్య చేసిన వారికి శరణు పట్టణం) మహనయీం, దాని పచ్చిక మైదానాలు,

[39] హెష్బోను, దాని పచ్చిక మైదానాలు, యాజెరు, దాని పచ్చిక మైదానాలు.

[40] లేవీగోత్రికులలో మిగిలిన ఈ మెరారివారికి వారి కుటుంబాల ప్రకారం ఆ పట్టణాలన్నీ లభించాయి. వారి వాటా పన్నెండు పట్టణాలు.

[41] ఇస్రాయేల్ ప్రజల ప్రాంతాలలో ఉన్న లేవీవారి పట్టణాలు, వాటి పచ్చిక మైదానాలు నలభై ఎనిమిది.

[42] ప్రతి పట్టణానికి చుట్టూ పచ్చిక మైదానాలు ఉన్నాయి. ఆ పట్టణాలన్నీ అలాగే ఉన్నాయి.

[43] యెహోవా ఇస్రాయేల్‌ప్రజల పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన భూమి అంతా ఆయన వారికి ఇచ్చాడు. వారు దానిని స్వాధీనం చేసుకొని అక్కడ కాపురమున్నారు.

[44] వారి పూర్వీకులకు తాను ప్రమాణం చేసిన ప్రకారం దేశంలో అన్ని దిక్కులా యెహోవా వారికి విశ్రాంతి ప్రసాదించాడు. వారి శత్రువులలో ఒక్కడూ కూడా వారి ఎదుట నిలబడలేక పోయాడు. యెహోవా వారి శత్రువులను అందరినీ వారికి అప్పగించాడు.

[45] ఇస్రాయేల్‌ప్రజకు యెహోవా చేసిన వాగ్దానాలలో ఏదీ తప్పలేదు. అన్నీ నెరవేరాయి.

యెహోషువ — Chapters