[1] మరుసటి ప్రొద్దున తెల్లవారగానే యెహోషువ లేచాడు. అతడూ ఇస్రాయేల్‌ప్రజలంతా షిత్తీంనుంచి బయలుదేరి యొర్దానుకు వచ్చారు. నదిని దాటేముందు వారు అక్కడ మకాం చేశారు.
[2] మూడు రోజులయ్యాక అధికారులు శిబిరంలోకి వెళ్ళి ప్రజలకిలా ఆజ్ఞాపించారు:
[3] “మీ దేవుడు యెహోవా యొక్క ఒడంబడికపెట్టెను యాజులైన లేవీవారు మోయడం మీరు చూచినప్పుడు మీరున్న చోట్లనుంచి బయలుదేరి దానివెనుక నడవాలి.
[4] ఈ దారి ఇంతకుముందు మీరు వెళ్ళినది కాదు గనుక ఎలా వెళ్ళాలో తెలుసుకోవడానికి మీరు అలా చేయాలి కానీ మీకూ ఆ మందసానికీ మధ్య సుమారు మూడు వేల అడుగుల ఎడముండాలి. దానిదగ్గరికి మాత్రం రాకూడదు.”
[5] ప్రజతో యెహోషువ “రేపు యెహోవా మీ మధ్య అద్భుతాలు చేస్తాడు గనుక మిమ్మల్ని మీరే పవిత్రపరచుకోండి” అన్నాడు.
[6] యెహోవా యాజులతో “ఒడంబడిక పెట్టెను ఎత్తుకొని ప్రజల ముందు వెళ్ళండి” అన్నాడు. వారు ఒడంబడిక పెట్టెను ఎత్తుకొని ప్రజలముందు నడిచారు.
[7] యెహోవా యెహోషువతో ఇలా చెప్పాడు: “ఈ రోజున ఇస్రాయేల్ ప్రజల సమక్షంలో నిన్ను గొప్ప చేయడం ఆరంభిస్తాను. నేను మోషేతో ఉన్నట్టు నీతోనూ ఉంటానని అప్పుడు వారు తెలుసుకొంటారు.
[8] ఒడంబడిక పెట్టెను మోసే యాజులతో ‘మీరు యొర్దాను నది నీటిదరి చేరినప్పుడు యొర్దానులో నిలబడాల’ని నీవు వారికాజ్ఞాపించాలి.”
[9] అప్పుడు ఇస్రాయేల్ ప్రజలతో యెహోషువ “మీరు ఇలా రండి. మీ దేవుడు యెహోవా వాక్కులు వినండి” అన్నాడు.
[10] యెహోషువ ఇంకా అన్నాడు, “సజీవ దేవుడు మీమధ్య ఉన్నాడనీ ఆయన కనాను, హిత్తి, హివ్వి, పెరిజ్జి, గిర్గాషి, అమోరీ, యోబూసి జాతులను మీ ముందు నుంచి తప్పక తోలివేస్తాడనీ ఈ విధంగా మీరు తెలుసుకొంటారు.
[11] ఇదిగో ప్రపంచమంతటికీ ప్రభువైన యెహోవా ఒడంబడిక పెట్టె మీ ముందు యొర్దానులోకి వెళ్తుంది.
[12] ఇప్పుడు ఇస్రాయేల్‌కు చెందిన ప్రతి గోత్రం నుంచీ గోత్రానికి ఒక్కొక్క మనిషి చొప్పున పన్నెండుమందిని ఏర్పాటు చేయండి.
[13] ప్రపంచమంతటికీ ప్రభువైన యెహోవా పెట్టెను మోసే యాజులు యొర్దాను నీళ్ళలో అడుగుపెట్టగానే యొర్దాను నీళ్ళు పారడం ఆగి పోతాయి. పైనుంచి క్రిందికి పారే నీళ్ళు రాశిలాగా నిలబడిపోతాయి.”
[14] ప్రజలు వారి గుడారాల్లో నుంచి యొర్దాను దాటడానికి బయలుదేరారు. ప్రజలముందు యాజులు ఒడంబడికపెట్టెను మోస్తూ నడుస్తున్నారు.
[15] పెట్టెను మోసేవారు యొర్దానుకు వచ్చినప్పుడు పెట్టెను మోసే యాజుల పాదాలు నీళ్ళలో మునిగిన వెంటనే పైనుంచి వచ్చే నీళ్ళు ఆగిపోయాయి. (అది కోతకాలం, యొర్దాను నది పొంగి గట్ల మీద ప్రవహిస్తూ ఉన్నకాలం).
[16] ఆ నీళ్ళు ఆగిపోయి సారెతాను ప్రక్క ఉన్న ఆదాం అనే ఊరిదగ్గర చాలా దూరంగా ఎత్తయిన రాశిలాగా అయ్యాయి. అరాబా సరస్సు వైపు ఆ ఉప్పు సరస్సులోకి ప్రవహించే నీళ్ళు పూర్తిగా ఆగిపోయాయి. ప్రజలు యెరికోకు ఎదురుగా నదిని దాటారు.
[17] ఇస్రాయేల్ ప్రజలంతా యొర్దాను దాటేవరకు యెహోవా ఒడంబడికపెట్టెను మోసే యాజులు యొర్దాను నది మధ్యలో పొడి నేలమీద అక్కడే నిలబడి ఉన్నారు. అలా ప్రజలంతా పొడి నేలమీద యొర్దాను దాటారు.