[1] ఇస్రాయేల్ ప్రజలకు కనానుదేశంలో వారసత్వంగా వచ్చిన ప్రదేశాలు ఇవి: వీటిని యాజి అయిన ఎలియాజరు, నూను కొడుకు యెహోషువ, ఇస్రాయేల్‌ప్రజల వంశాల పెద్దలు
[2] చీట్లు వేసి తొమ్మిది గోత్రాలకు, అర్ధ గోత్రంవారికి ఈ వారసత్వాలు పంచి ఇచ్చారు. ఇది యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించినట్టే జరిగింది.
[3] రెండు గోత్రాలకూ అర్ధగోత్రంవారికి మోషే యొర్దాను అవతల వారసత్వం ఇచ్చాడు. అయితే లేవీగోత్రికులకు మాత్రం వారి మధ్య వారసత్వమేమీ ఇవ్వలేదు.
[4] (యోసేపు సంతానం మనష్షే గోత్రమూ ఎఫ్రాయింగోత్రమూ అనే రెండు గోత్రాలయ్యారు.) లేవీగోత్రికులకు కాపురం ఉండడానికి పట్టణాలు, వారి పశువులకూ మందలకూ వాటి పచ్చిక మైదానాలు తప్ప దేశంలో వారసత్వమేమీ ఇవ్వలేదు.
[5] యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇస్రాయేల్‌ప్రజ ఆ దేశాన్ని పంచిపెట్టారు.
[6] గిల్గాల్‌లో యెహోషువ దగ్గరికి యూదా సంతతివారు వచ్చారు. కెనెజివాడు యెఫున్నె కొడుకైన కాలేబు అతనితో ఇలా అన్నాడు. “నా గురించి, నీ గురించి, కాదేష్‌బర్నెయాలో దేవుని మనిషి అయిన మోషేతో యెహోవా చెప్పినది నీకు తెలుసు.
[7] కాదేష్‌బర్నెయానుంచి దేశాన్ని గూఢచారిగా చూడడానికి యెహోవా సేవకుడైన మోషే నన్ను పంపినప్పుడు నా వయసు నలభై ఏళ్ళు. నేను తిరిగి వచ్చి ఉన్నది ఉన్నట్టు అతనికి చెప్పాను.
[8] నాతోపాటు వెళ్ళి వచ్చిన మా ఇస్రాయేల్‌వారు, ప్రజలకు హృదయం నీరైపోయేలా చేశారు గాని నేను నా దేవుడు యెహోవాను పూర్తిగా అనుసరించాను.
[9] ఆ రోజు మోషే నాతో ‘నీవు నీ దేవుడు యెహోవాను పూర్తిగా అనుసరించావు గనుక నీవు అడుగుపెట్టిన భూమి నీకూ నీ సంతానానికీ ఎప్పటికీ వారసత్వం అవుతుంద’ని ప్రమాణం చేశాడు.
[10] ఇస్రాయేల్ ప్రజ ఎడారిలో తిరుగాడే కాలంలో మోషేతో యెహోవా ఈ మాట చెప్పినప్పటినుంచి ఈ నలభై అయిదేళ్ళు, ఆయన చెప్పినట్టే ఇదిగో యెహోవా నన్ను బతికించే ఉంచాడు. నాకిప్పుడు ఎనభై అయిదేళ్ళు.
[11] మోషే నన్ను పంపిన ఆ రోజు నాకెంత బలం ఉందో ఈ రోజు అంతే బలం ఉంది. యుద్ధానికి గానీ, వెళ్ళడానికీ రావడానికి గానీ నేను ఆ రోజు ఎంత బలంగా ఉన్నానో ఈ రోజు అంతే బలంగా ఉన్నాను.
[12] కనుక యెహోవా ఆ రోజు చెప్పిన ఈ కొండసీమ నాకు ఇయ్యి. అనాకువాళ్ళు అక్కడున్నారనీ వాళ్ళ పట్టణాలు గొప్పవి, ప్రాకారాలూ కోటలూ గలవి అనీ నీవు విన్నావు. యెహోవా నాతో ఉంటే ఆయన చెప్పినట్లే నేను వాళ్ళను పారదోలుతాను.”
[13] యెహోషువ యెఫున్నె కొడుకైన కాలేబును దీవించి అతనికి హెబ్రోనును వారసత్వంగా ఇచ్చాడు.
[14] కెనెజివాడు యెఫున్నె కొడుకైన కాలేబు ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవాను పూర్తిగా అనుసరించాడు గనుక హెబ్రోను ఈ నాటికి అతని వారసత్వం.
[15] హెబ్రోనుకు ముందు పేరు కిర్యాత్ అర్బా. అనాకువాళ్ళలో అర్బా మహా గొప్పవాడు. యుద్ధాలు పోయి దేశం ప్రశాంతంగా ఉంది.