Skip to content
Opens in a new window

[1] ఆ తరువాత మోషే మోయాబు మైదానాలనుంచి నెబో పర్వతమెక్కాడు. అది పిస్గా పర్వతపంక్తి శిఖరం. అది యెరికోకు ఎదురుగా ఉంది. యెహోవా ఆ దేశాన్నంతా అతడికి చూపించాడు.

[2] దానువరకు గిలాదు ప్రదేశాన్ని, నఫ్తాలి ప్రాంతాన్నంతా ఎఫ్రాయిం మనష్షేల ప్రదేశాన్ని పశ్చిమ సముద్రం వరకు యూదా ప్రదేశాన్నంతా

[3] దక్షిణ ప్రదేశాన్ని, ఈతచెట్లు ఉన్న యెరికోపట్టణంనుంచి సోయర్‌వరకు ఉన్న మైదానాన్ని అతడికి చూపించాడు.

[4] అప్పుడు యెహోవా “మీ సంతానానికిస్తానని నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన దేశం ఇదే. కన్నులారా దాన్ని చూడనిచ్చాను గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళవు.”

[5] యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట ప్రకారం అక్కడే, మోయాబు దేశంలోనే చనిపోయాడు.

[6] బేత్‌పెయోర్ ఎదుట, మోయాబులో ఒక లోయలో యెహోవా అతణ్ణి పాతిపెట్టాడు. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటివరకు ఎవరికీ తెలియదు.

[7] మోషే చనిపోయినప్పుడు అతడి వయసు నూట ఇరవై సంవత్సరాలు. అతడికి కళ్ళు మసకబారలేదు. బలం తగ్గలేదు.

[8] ఇస్రాయేల్‌ప్రజలు మోయాబు మైదానాల ప్రాంతంలో మోషే మృతి విషయం ముప్ఫయి రోజులు శోకించారు. దానితో మోషేను గురించి శోకించడం, విలపించడం ముగించారు.

[9] అంతకు ముందు మోషే తన చేతులు నూను కొడుకు యెహోషువ మీద ఉంచాడు. గనుక అతడు జ్ఞానాత్మతో నిండివున్నాడు. ఇస్రాయేల్ ప్రజలు అతడి మాట విని, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు చేశారు.

[10] అయితే యెహోవాను ముఖాముఖిగా తెలుసుకొన్న మోషేవంటి మరో ప్రవక్త ఇస్రాయేల్ ప్రజలలో ఇదివరకు జన్మించలేదు.

[11] ఈజిప్ట్‌దేశంలో ఫరోకు, అతడి పరివారంలో ఉన్నవాళ్ళందరికీ, అతడి దేశమంతటికీ ఆ అద్భుతమైన సూచనలన్నీ, మహాక్రియలన్నీ చేయడానికి యెహోవా మోషేను పంపించాడు.

[12] ఇస్రాయేల్ ప్రజలందరి కళ్ళెదుటే మోషే మహా బలప్రభావాలతో భయంకరమైన ఆ క్రియలన్నీ చేశాడు. అలాంటి విషయాలలో అతణ్ణి పోలిన మరో ప్రవక్త ఇదివరకు జన్మించలేదు.

ద్వితీయోపదేశకాండం (ధర్మోపదేశం) — Chapters