Skip to content
Opens in a new window

[1] యొర్దానుకు పడమరగా ఉన్న కొండసీమలో కొండల దిగువ భూములలో, లెబానోనువరకు ఉన్న మహాసముద్ర తీరాన అంతటా ఉన్న రాజులు – హిత్తి, అమోరీ, కనాను, పెరిజ్జి, హివ్వి, యెబూసి జాతుల రాజులు– ఈ విషయం విన్నారు.

[2] వాళ్ళంతా యెహోషువతోను ఇస్రాయేల్ ప్రజలతోను యుద్ధం చేయడానికి ఏకంగా సమకూడారు.

[3] యెహోషువ యెరికోకూ హాయీకీ చేసినది గిబియోను వాసులు విన్నప్పుడు

[4] వాళ్ళు యుక్తిగా ప్రవర్తించారు. రాయబారులుగా నటిస్తూ గాడిదలమీద పాత గోనెసంచులూ పాతగిలి చినిగిపోయి కుట్టివున్న ద్రాక్షరసం తిత్తులూ వేసుకొన్నారు.

[5] కాళ్ళకు అరిగిపోయిన పాత చెప్పులూ పాతపడిపోయిన బట్టలూ వేసుకొన్నారు. వాళ్ళు తెచ్చుకొన్న రొట్టెలు ఎండిపోయి ముక్కలయ్యాయి.

[6] వాళ్ళు గిల్గాల్‌లో ఉన్న శిబిరానికి యెహోషువ దగ్గరికి వచ్చి అతనితోను ఇస్రాయేల్ ప్రజలతోను “మేము దూర దేశంనుంచి వచ్చాం. ఇప్పుడు మీరు మాతో ఒడంబడిక చేయండి” అన్నారు.

[7] కానీ ఇస్రాయేల్‌వారు ఆ హివ్వివాళ్ళతో “ఒక వేళ మీరు మా మధ్యనే నివసించే జనమేమో. మీతో మేము ఎలా ఒడంబడిక చేసుకొంటాం?” అన్నారు.

[8] వాళ్ళు “మేము మీ దాసులం” అని యెహోషువతో అన్నారు. “మీరెవరు? ఎక్కడనుంచి వచ్చారు?” అని యెహోషువ వాళ్ళనడిగాడు.

[9] అందుకు వాళ్ళు ఇలా జవాబిచ్చారు: “మీ దాసులైన మేము చాలా దూర దేశంనుంచి వచ్చాం. మీ దేవుడైన యెహోవా పేరు ప్రతిష్ఠలు విని ఆయన ఈజిప్ట్‌లో చేసినది విని ఆయన కీర్తికారణంగా వచ్చాం.

[10] యొర్దానుకు అవతల ఉన్న ఆ ఇద్దరు అమోరీవాళ్ళ రాజుల్ని – హెష్బోనురాజు సీహోనునూ అష్తారోతులో ఉండే బాషానురాజు ఓగునూ – యెహోవా ఏం చేశాడో అది కూడా మేము విన్నాం.

[11] కాబట్టి మా పెద్దలు, మా దేశవాసులంతా మాతో ఇలా అన్నారు: ప్రయాణానికి భోజనం చేతపట్టుకువెళ్ళి వారిని కలుసుకొని వారితో ‘మేం మీ దాసులం, మాతో ఒడంబడిక చేయండి’ అని చెప్పాలి.

[12] మేము మీదగ్గరికి రావడానికి బయలుదేరిన రోజున మా ప్రయాణానికి మా ఇళ్ళదగ్గర నుంచి తెచ్చిన ఈ రొట్టెలు వేడిగా ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారు గదా, ఇవి ఎండి ముక్కలయ్యాయి.

[13] ఈ ద్రాక్షరసం తిత్తులు మేము నింపినప్పుడు క్రొత్తవే. ఇవిగో! ఇప్పుడు చిరిగిపోయాయి. ఇంత పెద్ద ప్రయాణం మూలాన ఈ బట్టలూ చెప్పులూ పాతపడిపోయాయి.”

[14] ఇస్రాయేల్‌ప్రజలు యెహోవాను సంప్రదించకుండానే వాళ్ళ భోజన పదార్థాలలో కొంత తీసుకొన్నారు.

[15] యెహోషువ వాళ్ళతో సంధి చేసుకొని వాళ్ళను బ్రతకనిస్తామని ఒడంబడిక చేశాడు. సమాజంలో ప్రజానాయకులు వాళ్ళకు ప్రమాణం చేశారు.

[16] వాళ్ళతో ఒడంబడిక చేసిన మూడు రోజులకు వాళ్ళు పొరుగు ప్రదేశంవాళ్ళే అనీ తమ దగ్గరే నివసించేవాళ్ళనీ ఇస్రాయేల్‌ప్రజలకు వినవచ్చింది.

[17] ఇస్రాయేల్‌ప్రజలు ప్రయాణమై మూడో రోజున వాళ్ళ పట్టణాలు చేరారు. గిబియోను, కెఫీరా, బెయోరోత్, కిర్యత్‌యారీం అనేవి వాళ్ళ పట్టణాలు.

[18] ఇస్రాయేల్‌ప్రజల సమాజ నాయకులు ఇస్రాయేల్‌యొక్క దేవుడైన యెహోవా పేర వాళ్ళకు ప్రమాణం చేశారు గనుక ఇస్రాయేల్‌ప్రజలు ఆ పట్టణాలవాళ్ళను చంపలేదు. కానీ సమాజమంతా నాయకులమీద సణుగు కొన్నారు.

[19] కనుక ఆ నాయకులంతా సమాజమంతటితో ఇలా చెప్పారు: “ఇస్రాయేల్ యొక్క దేవుడైన యెహోవామీద మేము వాళ్ళకు ప్రమాణం చేశాం. అందుచేత మేము వాళ్ళను తాకడానికి వీలు లేదు.

[20] మనం వాళ్ళకు ఇలా చేద్దాం– మేము వాళ్ళకు చేసిన ప్రమాణంవల్ల మనమీదికి దైవోగ్రత రాకుండా ఉండేలా వాళ్లను బ్రతకనిద్దాం.”

[21] ఆ నాయకులు వారితో ఇంకా అన్నారు, “వాళ్ళను బ్రతకనివ్వండి. వాళ్ళు సమాజ మంతటికీ కట్టెలు కొట్టేవాళ్ళుగా, నీళ్ళు తెచ్చేవాళ్ళుగా ఉంటారు.” నాయకులు చెప్పిన ప్రకారం వారు చేశారు.

[22] యెహోషువ ఆ గిబియోనువాళ్ళను పిలిపించి వాళ్ళతో ఇలా అన్నాడు: “మీరు మా దగ్గరే నివసిస్తూ ‘మేము చాలా దూరంగా ఉండేవాళ్ళమ’ని చెప్పి మమ్మల్ని ఎందుకు మోసం చేశారు?

[23] కాబట్టి మీరు ఇప్పుడు శాపం క్రింద ఉన్నారు. మీరు నా దేవుని నివాసానికి కట్టెలు కొట్టేవాళ్ళుగా, నీళ్ళు తెచ్చే వాళ్ళుగా ఉంటారు. ఈ దాసత్వంనుంచి మీరు ఎన్నడూ విముక్తి కారు.”

[24] వాళ్ళు యెహోషువకు ఇలా జవాబిచ్చారు: “తన సేవకుడు మోషే ఈ దేశాన్నంతా మీకివ్వాలనీ ఈ దేశవాసు లందరినీ మీ ఎదుట నాశనం చేయాలనీ మీ దేవుడు యెహోవా ఆయనకాజ్ఞాపించిన సంగతి మీదాసులైన మాకు ఖచ్చితంగా తెలిసింది. దానితో మీ వల్ల మా ప్రాణాలకు ముప్పు ఉందని భయపడి మేమిలా చేశాం.

[25] ఇక ఇదిగో! మేము మీ చేతులలో ఉన్నాం. మీరు ఏది మంచి, ఏది ధర్మం అనుకొంటే ఆ విధంగా మాకు చెయ్యండి.”

[26] ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళను చంపకుండా యెహోషువ చేసి ప్రజల చేతిలోనుంచి వాళ్ళను విడిపించాడు.

[27] అయితే సమాజానికీ యెహోవా బలిపీఠానికీ యెహోవా నిర్ణయించిన చోట కట్టెలు కొట్టేవారుగా నీళ్ళు తోడేవారుగా యెహోషువ వాళ్ళను ఆ రోజు నియమించాడు. ఈనాటికీ వాళ్ళు ఆ పనులు చేసేవాళ్ళు.

యెహోషువ — Chapters