[1] హాసోరు రాజైన యాబీను ఈ విషయాలు విని ఈ రాజులకు కబురు పంపాడు. మాదోను రాజైన యోబాబుకూ షిమ్రోను రాజుకూ అక్షాపు రాజుకూ
[2] ఉత్తరాన కొండ ప్రదేశాలలో ఉన్న రాజులకూ కిన్నెరెతు సరస్సుకు దక్షిణంగా ఉన్న అరాబా లోయ ప్రాంతంలో ఉన్న రాజులకూ దిగువ ప్రదేశంలో రాజులకూ పడమటిగా ఉన్న దోరు ఎత్తయిన ప్రదేశం రాజుకూ,
[3] తూర్పున, పడమట ఉన్న కనానువాళ్ళకూ అమోరీ, హిత్తి, పెరిజ్జి జాతుల వాళ్ళకూ పర్వతాలలో ఉన్న యెబూసివాళ్ళకూ, మిస్పా ప్రదేశంలో హెర్మోను పర్వతం క్రింద ఉన్న హివ్వివాళ్ళకూ.
[4] వాళ్ళూ వాళ్ళ సైన్యాలన్నీ మహా గొప్ప గుర్రాల, రథాల సమూహంతో బయలుదేరారు. వాళ్ళు లెక్కకు సముద్ర తీరాన ఉన్న ఇసుకలాగా ఉన్నారు.
[5] ఈ రాజులంతా ఏకీభవించి ఇస్రాయేల్‌వారితో యుద్ధం చేయడానికి మెరోం నీళ్ళ దగ్గరకు వచ్చి అక్కడ సమకూడి మకాం చేశారు.
[6] అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు: “వాళ్ళను చూచి నీవు భయపడకు. రేపు ఈ వేళకు వాళ్ళనందరినీ ఇస్రాయేల్ వారు వధించేలా చేస్తాను. వాళ్ళ గుర్రాల గుదికాళ్ళ నరాలను తెగగొట్టి వాళ్ళ రథాలను మంటల్లో వేసి కాల్చివేస్తావు.”
[7] కాబట్టి యెహోషువ, అతనితోపాటు సైనికులంతా బయలుదేరి మెరోం నీళ్ళ దగ్గర హఠాత్తుగా వాళ్ళ మీద పడ్డారు.
[8] యెహోవా ఇస్రాయేల్‌వారి చేతికి వాళ్ళ నప్పగించాడు గనుక వాళ్ళను ఓడించి మహా సీదోను నగరం వరకు, మిన్‌రఫోతు నీళ్ళవరకు, తూర్పుగా మిస్పే లోయవరకు వాళ్ళను తరిమారు, వాళ్ళందరినీ కూల్చారు. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలలేదు.
[9] యెహోవా ఇచ్చిన ఆజ్ఞప్రకారం యెహోషువ వాళ్ళకు చేశాడు. వాళ్ళ గుర్రాల గుదికాళ్ళ నరాలను తెగగొట్టి వాళ్ళ రథాలను మంటల్లో వేసి కాల్చివేశాడు.
[10] యెహోషువ ఆ సమయంలో వెనక్కు తిరిగి హాసోరును వశపరచుకొన్నాడు, దాని రాజును ఖడ్గంతో వధించాడు. అంతకుముందు హాసోరు పట్టణం ఆ రాజ్యాలన్నిటికీ తలగా ఉండేది.
[11] అక్కడున్న వాళ్ళందరినీ వారు ఖడ్గంతో చంపివేశారు. గాలి పీల్చుకొనేవాడంటూ లేకుండా చేసి హాసోరును కాల్చివేశారు.
[12] ఆ రాజులందరినీ, వాళ్ళ పట్టణాలనూ యెహోషువ పట్టుకొని ఖడ్గంతో హతమార్చి యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్టే సర్వనాశనం చేశాడు.
[13] యెహోషువ హాసోరును తగలబెట్టాడు గాని మట్టిదిబ్బలమీద ఉన్న ఆ మిగతా పట్టణాలను ఇస్రాయేల్ వారు తగలబెట్టలేదు.
[14] ఆ పట్టణాలలో దొరికిన దోపుడు సొమ్మునూ పశువులనూ ఇస్రాయేల్‌వారు తమ సొంతానికి తీసుకొన్నారు. కానీ మనుషులందరూ నాశనమయ్యేవరకు వాళ్ళను ఖడ్గంతో కూల్చారు. గాలి పీల్చుకొనే ఏ వ్యక్తినీ విడిచి పెట్టలేదు.
[15] యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే యెహోషువకు ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారమే యెహోషువ చేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విషయాలలో అతడు నెరవేర్చకుండా ఒక్కటి కూడా విడువలేదు.
[16] యెహోషువ ఆ దేశాన్నంతా – శేయీరు పర్వతం దిక్కుగా ఉన్న హలాక్ పర్వతంనుంచి హెర్మోను పర్వతంక్రింద లెబానోను లోయలో ఉన్న బయల్‌గాదు వరకు ఆ దేశాన్నంతా వశపరచుకొన్నాడు.
[17] కొండసీమనూ దక్షిణదేశాన్నీ గోషెను ప్రదేశాన్నంతా దిగువప్రదేశాలనూ అరాబా లోయ ప్రాంతాన్నీ– ఇస్రాయేల్ దేశంలోని కొండ ప్రదేశాలనూ దిగువ ప్రదేశాలనూ అతడు వశపరచుకొన్నాడు. ఆ ప్రదేశాల రాజులందరినీ పట్టుకొని వాళ్ళను కొట్టి చంపాడు.
[18] ఆ రాజులందరితో యెహోషువ చాలా కాలం యుద్ధం చేశాడు.
[19] గిబియోను వాసులైన ఆ హివ్వివాళ్ళు తప్ప ఇస్రాయేల్‌ప్రజతో ఏ పట్టణం కూడా సంధి చేసుకోలేదు. తక్కిన పట్టణాలన్నిటినీ వారు యుద్ధంలోనే జయించారు.
[20] ఆ దేశస్థులు ఇస్రాయేల్ ప్రజలతో యుద్ధం చేసి పూర్తిగా నాశనం అయ్యేలా యెహోవా వాళ్ళ గుండెలు బండబారిపోయేలా చేశాడు. తాను మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇస్రాయేల్ ప్రజ వాళ్ళను దయ చూడకుండా వాళ్ళను నిర్మూలం చేయాలని యెహోవా నిర్ణయం.
[21] ఆ సమయంలోనే యెహోషువ వచ్చి కొండసీమనుంచి, హెబ్రోనునుంచి, దెబీరునుంచి, అనాబునుంచి – యూదా కొండ ప్రదేశమంతటి నుంచీ అనాకువాళ్ళను రూపుమాపాడు. వాళ్ళ పట్టణాలతో పాటు వాళ్ళను సమూల నాశనం చేశాడు.
[22] ఇస్రాయేల్‌ప్రజల దేశంలో ఒక్క అనాకువాడు కూడా మిగలలేదు. గాజాలో, గాతులో, అష్డోదులో మాత్రమే కొంతమంది మిగిలారు.
[23] యెహోవా మోషేతో చెప్పిన ప్రకారం యెహోషువ దేశాన్నంతా స్వాధీనం చేసుకొన్నాడు. ఇస్రాయేల్‌ప్రజలకు వారి గోత్రాల భాగాల ప్రకారం అతడు దానిని వారసత్వంగా ఇచ్చాడు. యుద్ధాలు పోయి దేశం ప్రశాంతంగా ఉంది.