[1] ఇది ఇస్రాయేల్ ప్రజల లెక్క వివరణ. వారి కుటుంబ నాయకులు, వెయ్యిమందికి వందమందికి అధిపతులు, వారి అధికారులు సైన్య భాగాల విషయాలన్నిటిలో రాజుకు సేవ చేశారు. ఈ సైన్య భాగాలకు సంవత్సరమంతట్లో నెల నెల వంతుల ప్రకారం బాధ్యత ఉంది. ఒక్కొక్క భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు.
[2] మొదటి నెలలో మొదటి భాగంమీద జలదీయేల్ కొడుకు యాషాబాం అధిపతిగా ఉన్నాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు.
[3] అతడు పెరెజ్ సంతతివాడు, ఆ మొదటి నెల సైన్యాధిపతులందరికీ అధిపతి.
[4] రెండో నెలలో రెండో భాగంమీద అహోవా వంశంవాడు దోదయి అధిపతిగా ఉన్నాడు. అతని భాగంలో మికలోత్ అనేవాడు నాయకుడుగా ఉన్నాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు.
[5] మూడో నెలలో ప్రముఖయాజి అయిన యెహోయాదా కొడుకు బెనాయా సైన్యాధిపతిగా ఉన్నాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు.
[6] ఈ బెనాయా ముప్ఫయిమంది వీరులలో ఒకడు, వారికి అధిపతి. అతని భాగంలో అతని కొడుకు అమ్మీజాబాదు అధిపతిగా ఉన్నాడు.
[7] నాలుగో నెలలో యోవాబు తోబుట్టువు అశాహేల్ నాలుగో భాగంమీద అధిపతిగా ఉన్నాడు. అతని తరువాత అతని కొడుకు జెబదయా అధిపతి అయ్యాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు.
[8] అయిదో నెలలో అయిదో భాగంమీద ఇజ్రా హేతువాడైన షమహూతు అధిపతిగా ఉన్నాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు.
[9] ఆరో నెలలో ఆరో భాగంమీద తెకోవ ఊరివాడైన ఇక్కెషు కొడుకు ఈరా అధిపతిగా ఉన్నాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు.
[10] ఏడో నెలలో ఏడో భాగం మీద ఎఫ్రాయిం గోత్రం వాడూ పెలోన్ సంతతివాడు అయిన హేలెసు అధిపతిగా ఉన్నాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు.
[11] ఎనిమిదో నెలలో ఎనిమిదో భాగంమీద హుషా గ్రామస్తుడూ జెరహు వంశంవాడూ అయిన సిబ్బెకయి అధిపతిగా ఉన్నాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు.
[12] తొమ్మిదో నెలలో తొమ్మిదో భాగంమీద అనాతోతు గ్రామస్తుడూ బెన్‌యామీన్ గోత్రంవాడూ అయిన అబీయెజెరు అధిపతిగా ఉన్నాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు.
[13] పదో నెలలో పదో భాగంమీద నెటోపా గ్రామస్తుడూ జెరహు వంశంవాడూ అయిన మహారయి అధిపతిగా ఉన్నాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు.
[14] పదకొండో నెలలో పదకొండో భాగంమీద పిరాతోను గ్రామవాసీ ఎఫ్రాయిం గోత్రంవాడూ అయిన బెనాయా అధిపతిగా ఉన్నాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు.
[15] పన్నెండో నెలలో పన్నెండో భాగంమీద నెటోపా గ్రామస్తుడూ ఒతనీయేల్ వంశంవాడూ అయిన హెలదయి అధిపతిగా ఉన్నాడు. అతని భాగంలో ఇరవై నాలుగు వేలమంది ఉన్నారు.
[16] ఇస్రాయేల్ ప్రజల గోత్రాలపై అధికారులు రూబేను గోత్రంవారిమీద జిఖ్రీ కొడుకు ఎలియాజరు ఉన్నాడు; షిమ్యోను గోత్రంవారిమీద మయకా కొడుకు షెపటయా ఉన్నాడు;
[17] లేవీ గోత్రంవారిమీద కెమూయేల్ కొడుకు హషబయా ఉన్నాడు; అహరోను వంశంవారిమీద సాదోకు ఉన్నాడు;
[18] యూదా గోత్రంవారిమీద దావీదు సోదరులలో ఎలీహు అనేవాడు ఉన్నాడు; ఇశ్శాకారు గోత్రంవారిమీద మికాయేల్ కొడుకు ఒమ్రీ ఉన్నాడు;
[19] జెబూలూను గోత్రంవారిమీద జబదయా కొడుకు ఇషమయా ఉన్నాడు; నఫ్తాలి గోత్రంవారిమీద అజ్రీయేల్ కొడుకు యెరీమోతు ఉన్నాడు;
[20] ఎఫ్రాయిం గోత్రంవారిమీద అజయా కొడుకు హోషేయ ఉన్నాడు; మనష్షే అర్ధ గోత్రం వారి మీద పెదాయా కొడుకు యోవేల్ ఉన్నాడు;
[21] గిలాదులో ఉన్న మనష్షే అర్ధగోత్రం వారి మీద జెకర్యా కొడుకు ఇద్దో ఉన్నాడు: బెన్యామీను గోత్రం వారి మీద అబ్నేర్ కొడుకు యహశీయేల్ ఉన్నాడు;
[22] దాను గోత్రంవారిమీద యెరోహాం కొడుకు అజరేల్ ఉన్నాడు; వీరు ఇస్రాయేల్ గోత్రాలకు అధికారులు.
[23] ఇస్రాయేల్ ప్రజలను ఆకాశ నక్షత్రాలంత మందిగా చేస్తానని యెహోవా వాగ్దత్తం చేశాడు గనుక ఇరవై ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయసు ఉన్న వారిని లెక్కపెట్టించలేదు.
[24] జనాభా లెక్కలు వ్రాయడం సెరూయా కొడుకు యోవాబు ఆరంభించాడు గానీ ఆ పని ముగించలేదు. జనాభా లెక్కలు వ్రాయడం కారణంగా ఇస్రాయేల్ ప్రజలమీదికి దేవుని కోపం వచ్చింది. జనసంఖ్య మొత్తం దావీదురాజు వృత్తాంత గ్రంథంలో చేరలేదు.
[25] రాజు గిడ్డంగులకు అదీయేల్ కొడుకు అజమావెతు అధికారి. పల్లెటూళ్ళ ప్రాంతాలలో, పట్టణాలలో, గ్రామాలలో, కోటలలో కూడబెట్టినవి ఉజ్జియా కొడుకు యోనాతాను ఆధీనంలో ఉన్నాయి.
[26] భూమి సాగు చేసే పొలం పనివారిమీద కెలూబు కొడుకు ఎజ్రీ అధికారిగా ఉన్నాడు.
[27] ద్రాక్ష తోటలమీద రమా గ్రామం వాడు షిమీ అధికారిగా ఉన్నాడు. ద్రాక్షరసం కోసమైన ద్రాక్షపండ్లు, ద్రాక్షరసం కూడబెట్టిన కొట్లమీద షిపమోతు గ్రామం వాడు జబది అధికారిగా ఉన్నాడు.
[28] షెఫెలా ప్రాంతంలో ఉన్న ఆలీవ్ చెట్లమీద, మేడిచెట్లమీద గెదేరు గ్రామం వాడు బేల్ హనాను అధికారిగా ఉన్నాడు. నూనె కొట్లమీద యోవాషు అధికారిగా ఉన్నాడు.
[29] షారోను ప్రాంతంలో మేసే పశువులమీద షారోనువాడైన షిట్రయి అధికారిగా ఉన్నాడు. లోయలలో ఉన్న పశువులమీద అదలయి కొడుకు షాపాతు అధికారిగా ఉన్నాడు.
[30] ఒంటెలమీద ఇస్మాయేల్ జాతివాడైన ఓబీల్ అధికారిగా ఉన్నాడు. గాడిదలమీద మేరోనోతు గ్రామం వాడు యెహెదయా అధికారిగా ఉన్నాడు.
[31] గొర్రెల, మేకల మందలమీద హగరిజాతివాడైన యాజీజ్ అధికారిగా ఉన్నాడు. వీరందరూ దావీదురాజుకు ఉన్న ఆస్తిపాస్తుల మీద నియమించబడ్డ అధికారులు.
[32] దావీదు పినతండ్రి యోనాతాను తెలివైన సలహాదారుడు, ధర్మశాస్త్రి. రాజు కొడుకుల దగ్గర ఉండడానికి హక్మోనీ కొడుకు యెహీయేలు నియమించబడ్డవాడు.
[33] అహీతోపెల్ రాజుకు సలహాదారుడు. అర్కీ జాతివాడైన హూషయి రాజుకు మిత్రుడు.
[34] అహీతోపెల్ చనిపోయిన తరువాత బెనాయా కొడుకు యెహోయాదా, అబియాతారు మంత్రులయ్యారు. రాజు సైన్యానికి యోవాబు అధిపతిగా ఉన్నాడు.