Skip to content
Opens in a new window

[1] దావీదు తన భవనంలో కాపురం చేశాడు. తరువాత అతడు నాతానుప్రవక్తతో “ఇదిగో, నేను దేవదారు మ్రానుతో కట్టిన భవనంలో కాపురముంటున్నాను గాని యెహోవా ఒడంబడికపెట్టె డేరాలో ఉంది” అన్నాడు.

[2] అందుకు నాతాను “దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనుక నీ మనసులో ఉన్నదంతా నెరవేర్చు” అని దావీదుతో చెప్పాడు.

[3] అయితే ఆ రాత్రి దేవునినుంచి వాక్కు నాతానుకు వచ్చింది. అదేమిటంటే,

[4] “నీవు వెళ్ళి నా సేవకుడు దావీదుతో ఇలా చెప్పు: యెహోవా చెప్పేదేమిటంటే, నాకు నివాసంగా ఒక మందిరాన్ని నీవు కట్టించకూడదు.

[5] ఈజిప్ట్ నుంచి ఇస్రాయేల్‌ప్రజలను తీసుకువచ్చిన రోజునుంచి ఈ రోజువరకు నేను మందిరంలో నివాసం చేయలేదు. ఒక గుడారంనుంచి మరో గుడారానికి ఒక నివాస స్థలంనుంచి ఇంకో నివాస స్థలానికి వెళ్ళిపోతూ వచ్చాను.

[6] ఇస్రాయేల్ ప్రజలందరితో కూడా ప్రయాణం చేస్తూ ఉన్న స్థలాలలో, నా ప్రజకు కాపరులుగా ఉండమని నేను ఆజ్ఞాపించిన నాయకులలో ఎవరినైనా చూచి ‘నా కోసం దేవదారు మ్రానులతో మందిరాన్ని ఎందుకు కట్టించలేదు?’ అని అడిగానా?

[7] “ఇప్పుడు నీవు నా సేవకుడు దావీదుతో ఇలా చెప్పాలి: సేనలప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, నీవు ఇస్రాయేల్ ప్రజలకు నాయకుడుగా ఉండాలని గొర్రెలను మేపే నిన్ను పచ్చిక మైదానాలనుంచి రప్పించాను.

[8] నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట లేకుండా నాశనం చేశాను. ఇప్పుడు నీ పేరును లోకంలో ఉన్న మహా ఘనుల పేర్లలాగా చేస్తాను.

[9] నా ఇస్రాయేల్ ప్రజలకోసం ఒక స్థలం ఏర్పరచి అందులో వారిని నాటుతాను. వారు ఇంకా కదలకుండా తమ స్వస్థలంలో ఉంటారు.

[10] మునుపు జరిగినట్టు – నా ఇస్రాయేల్‌ప్రజలమీద నేను న్యాయాధిపతులను నియమించిన కాలం నుంచి జరిగినట్టు – ఇకమీదట దుర్మార్గులు వారిని బాధించరు. నీ శత్రువులందరినీ అణచివేస్తాను. అంతేగాక, యెహోవా నీకు రాజవంశాన్ని స్థాపిస్తాడని నేనే నీతో చెపుతున్నాను.

[11] నీ ఆయువు అయిపోయి నీ పూర్వీకుల దగ్గరికి చేరేటప్పుడు, నీకు పుట్టిన నీ సంతానాన్ని నీ స్థానంలో ఉంచి అతడి రాజ్యాన్ని స్థిరపరుస్తాను.

[12] అతడే నాకు మందిరం కట్టిస్తాడు. నేను అతడి రాజ్య సింహాసనాన్ని శాశ్వతంగా స్థాపిస్తాను.

[13] నేను అతడికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడుగా ఉంటాడు. నీకంటే ముందుగా పరిపాలించినవాడికి నా అనుగ్రహం దూరం చేసినట్టు నేను అతనికి దూరం చేయను.

[14] నా మందిరం మీదా నా రాజ్యంమీదా శాశ్వతంగా అతణ్ణి స్థిరపరుస్తాను. అతని సింహాసనం ఎప్పటికీ సుస్థిరంగా ఉంటుంది.”

[15] దైవదర్శనంలో వచ్చిన ఈ మాటలన్నీ నాతాను దావీదుకు తెలియజేశాడు.

[16] అప్పుడు దావీదురాజు లోపలికి వెళ్ళి యెహోవా సన్నిధానంలో కూర్చుని ఇలా ప్రార్థన చేశాడు: “యెహోవాదేవా! ఇంతటి ఉన్నత స్థితికి నీవు నన్ను తేవడానికి నేను ఎంతటివాణ్ణి? నా వంశం ఏపాటిది?

[17] దేవా! ఇది నీ దృష్టిలో స్వల్ప విషయం. నీవు నీ సేవకుడైన నా వంశం భవిష్యత్తును గురించి తెలియజేశావు. నేను మహా ఘనుడుగా ఉన్నట్టు నీవు నన్ను చూస్తున్నావు.

[18] నీ దాసుడైన నన్ను గౌరవించిన సంగతిని గురించి దావీదు నీతో ఇంకేమి చెప్పగలడు? నీ దాసుడు నీకు తెలుసు గదా.

[19] యెహోవా! నీ దాసుడి కోసం నీ చిత్తానుసారంగా ఈ గొప్ప కార్యం చేశావు, ఈ గొప్ప వాగ్దానాలు తెలియజేశావు.

[20] యెహోవా! మా చెవులు విన్నదంతా నిజం. నీవంటివాడెవ్వడూ లేడు.

[21] లోకం అంతట్లో నీ ఇస్రాయేల్ ప్రజలాంటి జనం ఏదీ లేదు గదా. నీవు నా ప్రజను ఈజిప్ట్‌నుంచి విడిపించావు. వారి ముందునుంచి ఇతర జనాలను వెళ్ళగొట్టావు. నీకోసం ఈ ప్రజను విమోచించడానికీ పేరు ప్రతిష్ఠలు సంపాదించుకోవడానికీ మహా భయంకర క్రియలు చేయడానికీ నీవు బయలుదేరావు.

[22] నీ ఇస్రాయేల్ ప్రజను ఎప్పటికీ నీ సొంత ప్రజగా ఉండేలా చేశావు. యెహోవా, నీవే వారికి దేవుడివయ్యావు.

[23] “యెహోవా! నీ దాసుడైన నా విషయం, నా వంశం విషయం నీవు చేసిన వాగ్దానం ఎప్పటికీ స్థిరమయ్యేలా చెయ్యి.

[24] అది సుస్థిరమయ్యేలా, నీ పేరుకు ఎప్పటికీ ఘనత చేకూరేలా నీవు చెప్పినట్టు చెయ్యి. అప్పుడు మనుషులు ‘ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు’ అంటారు. నీ దాసుడైన దావీదు వంశం సుస్థిరమవుతుంది.

[25] నా దేవా! నాకోసం రాజవంశాన్ని స్థాపిస్తావని నీవు నీ దాసుడైన నాకు తెలియజేశావు గనుక నీకు ప్రార్థన చేయడానికి నీ దాసుడైన నాకు ధైర్యం కలిగింది.

[26] యెహోవా! నీవే దేవుడివి. నీ దాసుడైన నా వంశం శాశ్వతంగా నీ సన్నిధానంలో నిలిచి ఉండేలా దానిని దీవించడం నీకు ఇష్టమైంది. యెహోవా! నీవు దానిని దీవించావు. దానికి ఎప్పుడూ దీవెన ఉంటుంది.”

1 దినవృత్తాంతాలు — Chapters