[1] దావీదు ఏండ్లు నిండిన ముసలివాడయినప్పుడు అతడు తన కొడుకు సొలొమోనును ఇస్రాయేల్ ప్రజలమీద రాజుగా చేశాడు.
[2] అతడు ఇస్రాయేల్ ప్రజల నాయకులందరినీ యాజులనూ లేవీగోత్రికులనూ సమకూర్చాడు.
[3] ముప్ఫయి సంవత్సరాలు మొదలుకొని అంతకు పై వయసు గల లేవీగోత్రికులు లెక్కపెట్టబడ్డారు. వారిలో పురుషుల సంఖ్య ముప్ఫయి ఎనిమిది వేలు.
[4] వారిలో ఇరవై నాలుగు వేలమంది యెహోవా ఆలయం పని జరిగించడానికి నియమించబడ్డారు. ఆరు వేలమంది అధికారులుగా, న్యాయాధిపతులుగా,
[5] నాలుగు వేలమంది ద్వారపాలకులుగా నియమించబడ్డారు. నాలుగు వేలమంది దేవసంస్తుతి చేయడానికీ దావీదు చేయించిన వాద్యాలతో యెహోవాను సంకీర్తనం చేయడానికీ నియమించబడ్డారు.
[6] లేవీ కొడుకులైన గెర్షోను, కహాతు, మెరారి వంశాలప్రకారం వారిని గుంపులుగా విభాగించాడు దావీదు.
[7] గెర్షోను వంశంలో లద్దాను, షిమీ ఉన్నారు.
[8] లద్దాను కొడుకులు ముగ్గురు – యెహీయేల్, జేతాం, యోవేల్. యెహీయేల్ మొదట పుట్టినవాడు.
[9] షిమీ కొడుకులు: షెలోమీతు, హజీయేల్, హారాను అనే ముగ్గురు లద్దాను కుటుంబాల నాయకులు.
[10] యహతు, జీనా, యూషు, బెరీయా అనే నలుగురు కూడా షిమీ కొడుకులు.
[11] యహతు పెద్దవాడు, జీనా రెండోవాడు, యూషుకూ, బెరీయాకూ చాలామంది కొడుకులు లేరు గనుక వారు ఒకే కుటుంబంగా ఎంచబడ్డారు.
[12] కహాతు కొడుకులు నలుగురు – అమ్రాం, ఇసహారు, హెబ్రోను, ఉజ్జీయేల్.
[13] అమ్రాం కొడుకులు అహరోను, మోషే. అహరోను, అతని సంతతివారు ఎప్పటికీ ప్రత్యేకించబడ్డారు. వారు చేయవలసిన సేవ అతి పవిత్ర వస్తువులను ప్రతిష్ఠించడం, యెహోవా సన్నిధానంలో ధూపం వేయడం, ఆయన సేవ జరిగించడం, ఆయన పేర ప్రజలను దీవించడం.
[14] దేవుని మనిషి అయిన మోషే సంతానం లేవీగోత్రికులలో ఎంచబడ్డారు.
[15] మోషే కొడుకులు గెర్షోం, ఎలియాజరు.
[16] గెర్షోం సంతతివారిలో మొదటివాడు షెబూయేల్.
[17] ఎలియాజరు సంతతివారిలో మొదటివాడు రెహబయా. అతడు తప్ప ఎలియాజరుకు ఇంకా కొడుకులు లేరు. అయితే రెహబయాకు చాలా మంది కొడుకులు ఉన్నారు.
[18] ఇసహారు కొడుకులలో షెలోమీతు పెద్దవాడు.
[19] హెబ్రోను కొడుకులు: పెద్దవాడు యెరీయా, రెండోవాడు అమరయా, మూడోవాడు యహజీయేల్, నాలుగోవాడు యెకమెయాం.
[20] ఉజ్జీయేల్ కొడుకులు: మీకా పెద్దవాడు, యెషీయా రెండోవాడు.
[21] మెరారి కొడుకులు మహలి, మూషి. మహలి కొడుకులు ఎలియాజరు, కీషు.
[22] ఎలియాజరు చనిపోయినప్పుడు అతనికి కూతుళ్ళు ఉన్నారు గాని కొడుకులు లేరు. వారి బంధువులైన కీషు కొడుకులు వారిని పెళ్ళి చేసుకొన్నారు.
[23] మూషి కొడుకులు ముగ్గురు – మహలి, ఏదెరు, యెరీమోతు.
[24] వీరు తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం, లేవీ సంతతివారు. వారు కుటుంబ నాయకులు, ఇరవై సంవత్సరాలు మొదలుకొని అంతకు పై వయసు గలిగి పేరునుబట్టి జనాభాలెక్కలలో నమోదైన వ్యక్తులు, యెహోవా ఆలయ సేవ చేయడానికి నియమించబడ్డవారు.
[25] దావీదు “ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా తన ప్రజలకు నెమ్మది ప్రసాదించి ఎల్లకాలం జెరుసలంలో నివాసం చేయడానికి వచ్చాడు.
[26] కనుక లేవీగోత్రికులకు ఇకనుంచి దైవ నివాసాన్నీ, దాని సేవకోసం ఉన్న వస్తువులనూ మోసే పనిలేదు” అన్నాడు.
[27] దావీదు ఇచ్చిన చివరి ఆదేశం ప్రకారం లేవీగోత్రికులలో ఇరవై సంవత్సరాలు మొదలుకొని అంతకు పై వయసుగలవారు లెక్కపెట్టడం జరిగింది.
[28] వారు చేయవలసిన సేవ ఏమిటంటే, అహరోను సంతతివారికి సహాయం చేస్తూ ఆవరణాల్లో గదులలో పనిచేయడం, పవిత్ర వస్తువులన్నిటినీ శుద్ధి చేయడం, దేవుని ఆలయంలో ఇతర పనులు చేయడం,
[29] బల్లమీద సన్నిధి రొట్టెలు ఉంచడం, నైవేద్యాల కోసం పిండిని సిద్ధం చేయడం, పొంగజేసే పదార్థం లేని అప్పడాలు చేయడం, పేల్చడం, కలపడం, అన్ని పరిమాణాలూ కొలతలూ చూడడం,
[30] ప్రతి రోజూ ఉదయం, సాయంకాలం నిలబడి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు అర్పించడం,
[31] విశ్రాంతి దినాలలో, అమావాస్యలలో, నియామకమైన పండుగలలో, యెహోవాకు హోమబలులు అర్పించవలసిన సమయాలన్నిటిలో అలా చేయడం. వారు లెక్కకు సరిగా, వంతుల ప్రకారం, క్రమంగా యెహోవా సన్నిధానంలో సేవ చేయవలసినవారు.
[32] ఈ విధంగా లేవీగోత్రికులు సన్నిధి గుడారం, పవిత్ర స్థలం విషయాల్లో బాధ్యత వహిస్తూ, వారి బంధువులైన అహరోను సంతతివారి చేతి క్రింద, యెహోవా ఆలయ సేవ చేయవలసినవారు.