[1] దావీదు కోసం భవనాన్ని కట్టడానికి తూరు రాజు హీరాం అతని దగ్గరికి రాయబారులనూ వాళ్ళతో కూడా దేవదారు మ్రానులనూ తాపీపనివాళ్ళనూ వడ్రంగులనూ పంపాడు.
[2] యెహోవా ఇస్రాయేల్ ప్రజలమీద తనను రాజుగా స్థిరపరచాడనీ తన ఇస్రాయేల్ ప్రజల కోసం రాజ్యాన్ని గొప్ప చేశాడనీ దావీదు గ్రహించాడు.
[3] జెరుసలంలో దావీదు ఇంకా కొంతమంది స్త్రీలను పెళ్ళి చేసికొన్నాడు. అతనికి ఇంకా కొంతమంది కొడుకులూ కూతుళ్ళూ జన్మించారు.
[4] జెరుసలంలో అతడికి పుట్టినవారి పేర్లు ఇవి: షమ్మూయ, షోబాబ్, నాతాను, సొలొమోను,
[5] ఇభారు, ఏలీషూవ, ఎల్‌పాలెట్,
[6] నోగహు, నెపెగు, యాఫీయ,
[7] ఎలీషామా, బేలెయాదా, ఎలీపేలెట్.
[8] ఇస్రాయేల్ ప్రజలందరి మీదా దావీదు రాజుగా అభిషేకం పొందాడని ఫిలిష్తీయవాళ్ళు విన్నప్పుడు అతణ్ణి పట్టుకోవడానికి వాళ్ళంతా దండెత్తి వచ్చారు. దాన్ని గురించి విని దావీదు వాళ్ళను ఎదుర్కోవడానికి బయలుదేరాడు.
[9] ఫిలిష్తీయవాళ్ళు వచ్చి రెఫాయీం లోయలో దిగారు.
[10] దావీదు “నేను ఫిలిష్తీయవాళ్ళ పైబడాలా? నీవు వాళ్ళను నా వశం చేస్తావా?” అని దేవుణ్ణి ప్రార్థించాడు. అందుకు యెహోవా “వెళ్ళు. నేను వాళ్ళను నీ వశం చేస్తాను” అని జవాబిచ్చాడు.
[11] అందుచేత దావీదు, అతని మనుషులు బేల్‌పెరాజీంకు వెళ్ళి వాళ్ళను ఓడించాడు. అప్పుడు దావీదు “వరదలు కొట్టుకుపోయే విధంగా యెహోవా నా శత్రువులను నా చేత నాశనం చేయించాడు” అని చెప్పాడు. అందుచేత ఆ స్థలాన్ని బేల్‌పెరాజీం అంటారు.
[12] అక్కడ ఫిలిష్తీయవాళ్ళు తమ విగ్రహాలను విడిచిపెట్టి పారిపోయారు. వాటిని కాల్చివేయాలని దావీదు ఆజ్ఞ జారీ చేశాడు.
[13] మరోసారి ఫిలిష్తీయవాళ్ళు వచ్చి ఆ లోయలో దిగారు.
[14] దావీదు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు “నీవు తిన్నగా వెళ్ళవద్దు. చుట్టు తిరిగి వాళ్ళ వెనక్కు వెళ్ళి కంబళి చెట్లకు ఎదురుగా వాళ్ళ పైబడు.
[15] కంబళిచెట్ల కొనలలో అడుగుల చప్పుడు వినగానే యుద్ధానికి బయలుదేరు. ఫిలిష్తీయ సైన్యాన్ని మొత్తడానికి దేవుడు నీ ముందు బయలుదేరుతున్నాడన్న మాట” అని జవాబిచ్చాడు.
[16] దేవుడు ఆజ్ఞాపించినట్టే దావీదు చేశాడు. వారు గిబియోనునుంచి గెజెరువరకు ఫిలిష్తీయవాళ్ళను తరుముతూ హతం చేశాడు.
[17] ఈ విధంగా దావీదు కీర్తి దేశాలన్నిటికీ వ్యాపించింది. యెహోవా అతని భయం ఇతర జనాలన్నిటికీ కలిగించాడు.