Skip to content
Opens in a new window

[1] ఇస్రాయేల్ ప్రజలంతా హెబ్రోనులో దావీదు దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: “మేము మీకు సన్నిహిత బంధువులం.

[2] మునుపు సౌలు పాలిస్తూ ఉన్నప్పుడు కూడా దండయాత్రలలో ఇస్రాయేల్ వారిని బయటికి తీసుకుపోయేదీ లోపలికి తీసుకువచ్చేది మీరే. యెహోవా ‘నా ఇస్రాయేల్ ప్రజలకు నీవు కాపరిగా ఉంటావు, వారిమీద పరిపాలకుడుగా ఉంటావు’ అని మీతో చెప్పాడు గదా.”

[3] ఇస్రాయేల్ ప్రజల పెద్దలంతా హెబ్రోనులో దావీదురాజు దగ్గరికి వచ్చిన తరువాత అక్కడ యెహోవా సన్నిధానంలో రాజు వారితో ఒడంబడిక చేశాడు. యెహోవా సమూయేలు ద్వారా వాగ్దానం చేసినట్టే వారు దావీదును ఇస్రాయేల్‌ప్రజలమీద రాజుగా అభిషేకించారు.

[4] దావీదు, ఇస్రాయేల్‌వారంతా యెబూసుకు, అంటే జెరుసలంకు వెళ్ళారు.

[5] అక్కడ కాపురమున్న యెబూసి జాతివాళ్ళు “నీవు లోపలికి రాలేవు” అని దావీదుతో అన్నారు. అయినా కోట ఉన్న సీయోను – అంటే, “దావీదు నగరం” – దావీదు స్వాధీనం చేసుకొన్నాడు.

[6] అంతకుముందు దావీదు “ఎవడు మొదట యెబూసివాణ్ణి హతం చేస్తాడో అతడు ప్రముఖ సైన్యాధిపతి అవుతాడు” అని చెప్పాడు. సెరూయా కొడుకు యోవాబు అందరికంటే ముందుగా ఎక్కిపోయాడు. కనుక ఆ ఆధిపత్యం పొందాడు.

[7] కోట ఉన్న ఆ స్థలంలో దావీదు కాపురమేర్పరచుకొన్నాడు. అందుచేతే దానికి “దావీదు నగరం” అనే పేరు వచ్చింది.

[8] కోటనుంచి లోపలికి, చుట్టూరా ఉన్న స్థలమంతటిలో నగరాన్ని కట్టించాడు దావీదు. నగరంలో మిగతా భాగాలను యోవాబు బాగు చేయించాడు.

[9] సేనల ప్రభువు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు, గనుక దావీదు ఎంతో అభివృద్ధి పొందుతూ వచ్చాడు.

[10] దావీదు వీరులలో ప్రముఖులు వీరు: ఇస్రాయేల్ ప్రజలను గురించి యెహోవా చేసిన వాగ్దానం ప్రకారం దావీదును రాజుగా చేయడానికి అతని రాజ్యంలో అతనికి ఇస్రాయేల్ ప్రజలందరితోకూడా సహాయం చేసిన ఆ వీరుల పేర్లు ఇవి:

[11] ఈ ముప్ఫయి మందిలో ప్రముఖుడు హకమోనివాడొకడి కొడుకైన యాషాబాం. ఒకే యుద్ధంలో అతడు మూడు వందల మందిని తన ఈటెతో చంపాడు.

[12] అతడి తరువాత అహోవ వంశంవాడైన దోదో కొడుకు ఎలియాజరు. అతడు ముగ్గురు ముఖ్య వీరులలో ఒకడు.

[13] ఒకసారి ఫిలిష్తీయ వాళ్ళు పసదమ్మీంలో యుద్ధానికి సమకూడి వస్తే, అతడు అక్కడ దావీదుతో ఉన్నాడు. యవలతో నిండి ఉన్న పొలం దగ్గర ఫిలిష్తీయవాళ్ళను చూచి ఇస్రాయేల్‌వారు పారిపోయారు

[14] గానీ వీరు ఆ పొలంలో నిలిచి దానిని కాపాడి ఫిలిష్తీయవాళ్ళను ఓడగొట్టారు. యెహోవా వారికి గొప్ప విజయం ఇచ్చాడు.

[15] మరోసారి ఫిలిష్తీయవాళ్ళ సైనికుల గుంపు రెఫాయీం లోయలో దిగారు. దావీదు అదుల్లాం గుహలో ఉన్నాడు. ముప్ఫయిమంది ముఖ్య వీరులలో ముగ్గురు ఆ బండదగ్గర ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు.

[16] ఆ భద్రమైన స్థలంలో దావీదు ఉన్నప్పుడు ఫిలిష్తీయ సైనికుల గుంపు బేత్లెహేంలో ఉంది.

[17] దావీదు నీళ్ళకోసం తహతహలాడుతూ “బేత్లెహేం ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్ళు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే ఎంత బావుండు!” అన్నాడు.

[18] అప్పుడు ఆ ముగ్గురు ఫిలిష్తీయ సైనికుల బారులగుండా చొరబడి బేత్లెహేం ద్వారం దగ్గర ఉన్న బావి నీళ్ళు చేది దావీదు దగ్గరికి తీసుకువచ్చారు. అయితే అతడు ఆ నీళ్ళు త్రాగడానికి నిరాకరించి యెహోవా సన్నిధానంలో పారబోశాడు.

[19] “నేను ఈ నీళ్ళు తాగకుండా నా దేవుడు నన్ను కాపాడుతాడు గాక! వీరు ప్రాణానికి తెగించి వెళ్ళి ఇవి తెచ్చారు. ఇవి వీరి రక్తంతో సమానం. నేను తాగుతానా?” అని చెప్పి నీళ్ళు త్రాగలేదు. ఆ ముగ్గురు వీరులు చేసిన కార్యాలు ఇలాంటివే.

[20] యోవాబు తోబుట్టువు అబీషై ఆ ముగ్గురికి నాయకుడు. ఒక యుద్ధంలో అతడు తన ఈటెను ఆడిస్తూ మూడు వందలమందిని హతమార్చాడు. అతడు ఆ ముగ్గురు వీరుల్లాగే పేరుప్రతిష్ఠలు పొందాడు.

[21] అతడు ఆ ముగ్గురికంటే రెండంతలుగా గౌరవించబడ్డాడు. అతడు వారికి అధిపతి అయ్యాడు గానీ వారిలో ఒకడుగా ఎంచబడలేదు.

[22] కబ్సేల్ గ్రామంవాడూ యెహోయాదా కొడుకూ అయిన బెనాయా కూడా పరాక్రమశాలి. అతడు గొప్ప సాహస కార్యాలను చేసేవాడు. అతడు మోయాబువాళ్ళలో ఇద్దరు మహా శూరులను హతమార్చాడు. మరోసారి చలిమంచు కురుస్తూ ఉన్న రోజున ఒక గుంటలోకి దిగి సింహాన్ని చంపాడు.

[23] మరొకప్పుడు అతడు అయిదు మూరల ఎత్తుగల ఈజిప్ట్‌వాణ్ణి చంపాడు. ఆ ఈజిప్ట్‌వాడి చేతిలో నేతగాడి దోనిలాంటి ఈటె ఉన్నా బెనాయా దుడ్డుకర్ర చేతపట్టుకొని వాడి మీదికి పోయాడు. ఈజిప్ట్‌వాడి చేతిలో ఉన్న ఈటెను ఊడలాగి దానితోనే వాణ్ణి చంపాడు.

[24] యెహోయాదా కొడుకు బెనాయా చేసిన కార్యాలు అలాంటివే. అతడు ఆ ముగ్గురు వీరుల్లాగే పేరు ప్రతిష్ఠలు పొందాడు.

[25] ఆ ముప్ఫయి మందిలో ఘనతకెక్కాడు గానీ మొదటి ముగ్గురికి సాటి కాలేదు. దావీదు అతణ్ణి తన రక్షకభటుల మీద అధిపతిగా నియమించాడు.

[26] ఆ వీరులు వీరు: యోవాబు తోబుట్టువు అశాహేల్‌; బేత్లెహేం పురవాసి దోదో కొడుకు ఎల్‌హానాను;

[27] హరోర్‌వాడు షమ్మోతు; పెలోనువాడు హేలెసు;

[28] తెకోవవాడూ ఇక్కేషు కొడుకూ అయిన ఈరా; అనతోతు గ్రామంవాడు అబియెజెరు;

[29] హుషాతువాడు సిబ్బెకయి; అహోహివాడు ఈలై;

[30] నెటోపాతివాడు మహరయి; నెటోపాతివాడూ బయనా కొడుకూ అయిన హేలెదు;

[31] బెన్‌యామీనులో ఉన్న గిబియా గ్రామంవాడూ రీబయి కొడుకైన ఈతయి; పిరాతోనువాడు బెనాయా,

[32] గాయషు వాగుల ప్రాంతంవాడు హూరయి; అర్బా గ్రామంవాడు అబీయేల్‌;

[33] బహురూం గ్రామం వాడు అజమావెతు; షాలబోను గ్రామంవాడు ఎల్‌యాబా;

[34] గిజోనువాడైన హాషేం కొడుకులు; హరారు గ్రామంవాడైన షాగే కొడుకు యోనాతాను;

[35] హరారు గ్రామం వాడైన శాకారు కొడుకు అహీయాం; ఊర్ కొడుకు ఎలీపాల్‌;

[36] మెకేరాతువాడు హెపెరు; పెలోనువాడు అహీయా;

[37] కర్మెల్ గ్రామంవాడు హెజ్రో; ఎజబయి కొడుకు సమరయి;

[38] నాతాను తోబుట్టువు యోవేల్‌; హగ్రీ కొడుకు మిబహారు;

[39] అమ్మోనువాడు జెలెకు; బెరోతు గ్రామంవాడు నహరయి (అతడు సెరూయా కొడుకైన యోవాబు ఆయుధాలను మోసేవాడు);

[40] ఇత్రీ వంశంవాడు ఈరా; ఇత్రీ వంశంవాడు గారేబ్‌;

[41] హిత్తివాడు ఊరియా; అహలయి కొడుకు జాబాదు;

[42] రూబేను గోత్రంవాడైన షీజా కొడుకూ రూబేనువారికి నాయకుడూ అయిన అదీనా, అతనితో కూడా ఉన్న ముప్ఫయి మంది;

[43] మయకా కొడుకు హానాను; మిత్నీవాడు యెహోషాపాతు;

[44] ఆష్తెరాతువాడు ఉజ్జీయా; అరోయేర్ పట్టణంవాడైన హోతాం కొడుకులు షామా, యెహీయేల్‌;

[45] షిమ్రీ కొడుకు యెదీయేల్‌; తిజి గ్రామంవాడూ యెదీయేల్ తోబుట్టువు అయిన యోహా;

[46] మహవవాడు ఎలీయేల్‌; ఎల్‌నయం కొడుకులు యెరీబయి, యోషవయా; మోయాబువాడు ఇతమా;

[47] ఎలీయేల్‌; ఓబేదు; మెజోబాయా గ్రామం వాడు యాశీయేల్.

1 దినవృత్తాంతాలు — Chapters