[1] తరువాత సైతాను ఇస్రాయేల్‌ప్రజలకు వ్యతిరేకంగా లేచి వారిని లెక్కపెట్టడానికి దావీదును పురికొలిపాడు.
[2] గనుక దావీదు “జనాభా లెక్క ఎంతో నేను తెలుసుకోవాలి. మీరు వెళ్ళి బేర్‌షెబా నుంచి దానువరకు ఉన్న ఇస్రాయేల్‌ప్రజలను లెక్కపెట్టి తిరిగి వచ్చి వారి సంఖ్యను నాకు చెప్పండి” అని యోవాబుకూ ప్రజల నాయకులకూ ఆజ్ఞ జారీ చేశాడు.
[3] అందుకు యోవాబు “యెహోవా జనసంఖ్యను నూరంతలు ఎక్కువ చేస్తాడు గాక! అయితే రాజా, నా యజమానీ, వారందరూ నీ సేవకులు కారా? నా యజమాని ఇలా చేయాలని ఎందుకు కోరుతున్నావు? నీవెందుకు ఇస్రాయేల్ ప్రజల మీదికి అపరాధం తెచ్చిపెడతావు?” అని జవాబిచ్చాడు.
[4] అయితే రాజాజ్ఞ యోవాబును బలవంతం చేసింది గనుక యోవాబు వెళ్ళి ఇస్రాయేల్ దేశమంతటా సంచారం చేసి జెరుసలంకు తిరిగి వచ్చాడు.
[5] యోవాబు జనాభా లెక్కలు దావీదుకు తెలియజేశాడు. ఇస్రాయేల్ ప్రజలందరిలో ఖడ్గం ప్రయోగించేవారు పదకొండు లక్షలమంది ఉన్నారు. యూదావారిలో ఖడ్గం ప్రయోగించేవారు నాలుగు లక్షల డెబ్భై వేలమంది ఉన్నారు.
[6] రాజు ఇచ్చిన ఈ ఆజ్ఞ యోవాబుకు అసహ్యంగా ఉంది గనుక అతడు లేవీవారినీ బెన్యామీనువారినీ జనాభా లెక్కలలో చేర్చలేదు.
[7] రాజాజ్ఞ యెహోవా దృష్టిలో కూడా చెడ్డగా ఉంది గనుక ఆయన ఇస్రాయేల్ ప్రజలను మొత్తాడు.
[8] అప్పుడు దావీదు దేవునికి ప్రార్థన చేసి “నేను అలా జరిగించి ఘోరమైన పాపం చేశాను. చాలా తెలివితక్కువ పని చేశాను. దయచేసి నీ దాసుడైన నా దోషం క్షమించు” అన్నాడు.
[9] యెహోవా దావీదుకు దీర్ఘదర్శిగా ఉన్న గాదుతో ఇలా అన్నాడు:
[10] “నీవు వెళ్ళి దావీదుతో చెప్పు – యెహోవా చెప్పేదేమిటంటే, మూడు విషయాలలో ఒకదానిని ఎన్నుకొనే అవకాశం నీకు ఇస్తున్నాను. నీవు ఏది కోరుకొంటావో అది నీకు జరిగిస్తాను.”
[11] కనుక గాదు దావీదుదగ్గరికి వచ్చి అన్నాడు “యెహోవా చెప్పేదేమిటంటే, ఈ మూడు విషయాలలో ఒకదానిని ఎన్నుకో –
[12] మూడు సంవత్సరాల కరవు; మూడు నెలలు నీ శత్రువుల కత్తికి గురి అయి వారిచేత నాశనం కావడం; మూడు రోజులు యెహోవా ఖడ్గం అనే విపత్తు రావడం, అంటే యెహోవా దూత ఇస్రాయేల్‌దేశంలో అంతటా నాశనం చేయడం. నన్ను పంపినవానికి నేను ఏ జవాబివ్వాలో ఆలోచించు.”
[13] అందుకు దావీదు “నేను పెద్ద చిక్కులో ఉన్నాను. అయితే యెహోవా అధిక కరుణాసంపద గలవాడు. ఆయన చేతిలోనే నేను పడాలి గాని మనుషుల చేతిలో పడకూడదు” అని గాదుతో అన్నాడు.
[14] అందుచేత యెహోవా ఇస్రాయేల్ ప్రజల మీదికి విపత్తు రప్పించాడు. వారిలో డెబ్భై వేలమంది చనిపోయారు.
[15] దేవుడు జెరుసలంను నాశనం చేయడానికి ఒక దూతను పంపాడు. ఆ దూత దానిని నాశనం చేయబోయినప్పుడు అది చూచి యెహోవా ఆ విపత్తు విషయం పరితపించాడు. ఆయన “అంతే చాలు! నీ చెయ్యి వెనుకకు తీయి!” అని నాశనం చేసే దూతకు ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు యెహోవా దూత యెబూసివాడైన ఒరనాను కళ్ళం దగ్గర నిలుచున్నాడు.
[16] దావీదు తలెత్తి చూచినప్పుడు భూమికీ ఆకాశానికీ మధ్య నిలుచున్న యెహోవా దూత కనిపించాడు. ఆ దూత ఖడ్గం చేతపట్టుకొని దానిని జెరుసలం మీద చాపుతూ ఉన్నాడు. గోనెపట్ట కట్టుకొన్న దావీదు, ప్రజల పెద్దలు సాష్టాంగపడ్డారు.
[17] దావీదు దేవునితో “ప్రజలను లెక్క పెట్టాలని ఆజ్ఞ జారీ చేసినది నేనే గదా. పాపం చేసినది, మూర్ఖంగా ప్రవర్తించినది నేనే. ఈ ప్రజలు గొర్రెలలాంటివాళ్ళు. వాళ్ళు ఏమీ చేయలేదు గదా. యెహోవా! నా దేవా! నన్నూ నా తండ్రి వంశం వాళ్ళనూ శిక్షించు గాని బాధపెట్టే నీ చేయి నీ ప్రజలమీద ఇంకా ఉండకుండా చెయ్యి” అన్నాడు.
[18] అప్పుడు దావీదు వెళ్ళి యెబూసివాడైన ఒరనాను కళ్ళంలో యెహోవాకు బలిపీఠం కట్టించాలని దావీదుకు చెప్పమని యెహోవా దూత గాదుకు ఆజ్ఞాపించాడు.
[19] యెహోవా పేర గాదు పలికిన మాట విని దావీదు అక్కడికి వెళ్ళాడు.
[20] ఒరనాను గోధుమలు నూరుస్తూ ఉన్నాడు. అతడు వెనక్కు తిరిగి ఆ దేవదూతను చూశాడు. అతడూ అతనితో ఉన్న అతని నలుగురు కొడుకులూ దాగుకొన్నారు.
[21] దావీదు ఒరనానుదగ్గరికి వస్తూ ఉంటే ఒరనాను అతణ్ణి చూచి కళ్ళంనుంచి బయటికి వచ్చి దావీదు ఎదుట సాష్టాంగపడ్డాడు.
[22] దావీదు “ప్రజలమీదికి వచ్చిన ఈ విపత్తు నిలిచిపోయేలా ఈ కళ్ళం ఉన్న స్థలంలో నేను యెహోవాకు బలిపీఠం కట్టించాలి. దాన్ని నాకు సరైన వెలకు అమ్ము” అని ఒరనానుతో అన్నాడు.
[23] అందుకు ఒరనాను “దానిని తీసుకోండి! నా యజమానులైన రాజుకు ఏది ఇష్టమో అది చేయవచ్చు. ఇదిగో హోమబలికి ఎడ్లను ఇస్తాను. కట్టెలుగా మార్చే కర్ర సామాను ఇస్తాను. నైవేద్యానికి గోధుమలు ఇస్తాను. ఇదంతా నేనిస్తాను” అని దావీదుతో చెప్పాడు.
[24] దావీదురాజు “అలా తీసుకోను. నీకు సరైన వెల ఇచ్చి వాటిని కొంటాను. నేను నీ సొత్తును యెహోవాకోసం తీసుకోను, వెల ఇవ్వక తీసుకొన్నదానిని హోమబలిగా అర్పించను” అని ఒరనానుతో చెప్పాడు.
[25] అప్పుడు దావీదు ఆ స్థలం కోసం ఆరు వందల తులాల బంగారం ఒరనానుకు ఇచ్చాడు.
[26] అక్కడ దావీదు యెహోవాకు బలిపీఠం కట్టించి హోమబలులూ శాంతిబలులూ అర్పించాడు. అప్పుడతడు యెహోవాను ప్రార్థించాడు, యెహోవా ఆకాశంనుంచి బలిపీఠంమీదికి మంటలు పంపి అతనికి జవాబిచ్చాడు.
[27] యెహోవా తన దూతకు ఆజ్ఞ జారీ చేశాడు. దూత తన ఖడ్గం మళ్ళీ ఒరలో ఉంచాడు.
[28] యెబూసివాడైన ఒరనాను కళ్ళంలో యెహోవా తనకు జవాబిచ్చాడని గ్రహించి దావీదు అక్కడ బలులు అర్పించాడు.
[29] మోషే ఎడారిలో చేయించిన యెహోవా నివాసం, హోమ బలిపీఠం ఆ కాలంలో గిబియోనులో ఎత్తయిన స్థలంలో ఉన్నాయి.
[30] అయితే యెహోవా దూత పట్టుకొని ఉన్న ఖడ్గానికి భయపడి దావీదు దేవుని దగ్గర విచారణ చేయడానికి ఆ స్థలానికి వెళ్ళలేకపోయాడు.