Skip to content
Opens in a new window

[1] ఇవి అహరోను సంతతివారికి కలిగిన వంతులు. అహరోను కొడుకులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.

[2] నాదాబు, అబీహు సంతానం లేకుండా తమ తండ్రికంటే ముందుగా చనిపోయారు గనుక ఎలియాజరు, ఈతామారు యాజులుగా సేవ చేశారు.

[3] ఎలియాజరు సంతతివారిలో సాదోకు ఒకడు. ఈతామారు సంతతివారిలో అహీమెలెకు ఒకడు. సాదోకు, అహీమెలెకుల సహాయంతో దావీదు అహరోను సంతతివారిని వారి లెక్కలప్రకారం గుంపులుగా చేసి వారికి బాధ్యతలు నియమించాడు.

[4] ఈతామారు సంతతివారిలోని నాయకుల కంటే ఎలియాజరు సంతతివారిలోని నాయకులు ఎక్కువమంది గనుక దానిప్రకారం వారిని గుంపులుగా చేశారు. ఎలియాజరు సంతతివారిలో పదహారుగురు కుటుంబ నాయకులు ఉన్నారు, ఈతామారు సంతతిలో ఎనిమిదిమంది కుటుంబ నాయకులు ఉన్నారు.

[5] ఎలియాజరు సంతతివారిలో కొందరూ ఈతామారు సంతతివారిలో కొందరూ పవిత్రాలయంలో అధికారులుగా దేవునికి సేవ చేసేవారు గనుక పక్షపాతం లేకుండా చీట్లు వేసి వంతులు పంచుకొన్నారు.

[6] రాజు, అధిపతులు, సాదోకుయాజి, అబ్యాతారు కొడుకు అహీమెలెకు, యాజులలో లేవీగోత్రికులలో కుటుంబ నాయకులు (ఎలియాజరు సంతతివారిలో ఒకడు, ఈతామారు సంతతివారిలో ఒకడు) సమకూడి ఉన్నప్పుడు వారి ఎదుటే లేవీగోత్రికుడూ రాజ్య దస్తావేజులు రాసిపెట్టేవాడూ నెతనేల్ కొడుకూ అయిన షెమయా అహరోను సంతతివారి పేర్లు దాఖలు చేశారు.

[7] మొదటి చీటి యెహోయారీబ్‌కు పడింది. రెండోది యెదాయాకు పడింది.

[8] మూడోది హారీంకు పడింది. నాలుగోది శెయొరీంకు పడింది.

[9] అయిదోది మల్కీయాకు పడింది. ఆరోది మీయామినుకు పడింది.

[10] ఏడోది హక్కోజ్‌కు పడింది. ఎనిమిదోది అబీయాకు పడింది.

[11] తొమ్మిదోది యేషూవకు పడింది. పదోది షెకనయాకు పడింది.

[12] పదకొండోది ఎల్‌యాషీబ్‌కు పడింది. పన్నెండోది యాకీంకు పడింది.

[13] పదమూడోది హుప్పాకు పడింది. పద్నాలుగోది యెషెబాబ్‌కు పడింది.

[14] పదిహేనోది బిలాగాకు పడింది. పదహారోది ఇమ్మేరుకు పడింది.

[15] పదిహేడోది హెజీరుకు పడింది. పద్ధెనిమిదోది హప్పిస్సేసుకు పడింది.

[16] పందొమ్మిదోది పెతహయాకు పడింది. ఇరవైయ్యోది యెహెజ్కేల్‌కు పడింది.

[17] ఇరవై ఒకటోది యాకీనుకు పడింది. ఇరవై రెండోది గామాల్‌కు పడింది.

[18] ఇరవై మూడోది దెలాయ్యాకు పడింది. ఇరవై నాలుగోది మయజయాకు పడింది.

[19] ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా వారి పూర్వీకుడైన అహరోనుకు ఆజ్ఞాపించినట్టు, అహరోను వారికి ఇచ్చిన పద్ధతి ప్రకారం వారు యెహోవా ఆలయంలో ప్రవేశించినప్పుడు వారు ఈ వరుసక్రమం అనుసరించవలసినవారు.

[20] లేవీ సంతతివారిలో మిగతావారెవరంటే, అమ్రాం సంతతివారిలో షూబాయేల్‌; షూబాయేల్ సంతతివారిలో యెహెదయా;

[21] రెహబయా విషయం రెహబయా కొడుకులలో పెద్దవాడు ఇష్షీయా;

[22] ఇసహార్‌వారిలో షెలోమోతు; షెలోమోతు కొడుకులలో యహతు;

[23] హెబ్రోను సంతానంలో పెద్దవాడైన యెరీయా, రెండోవాడైన అమరయా, మూడోవాడైన యహజీయేల్, నాలుగోవాడైన యెకమెయాం;

[24] ఉజ్జీయేల్ సంతానంలో మీకా; మీకా కొడుకులలో షామీరు;

[25] మీకా తోబుట్టువు ఇష్షీయా, ఇష్షీయా కొడుకులలో జెకర్యా;

[26] మెరారి కొడుకులైన మహలి, మూషి; యహజీయా వంశంలో బెనో;

[27] యహజీయావల్ల మెరారికి కలిగిన సంతతివారైన బెనో, షోహం, జక్కూరు, ఇబ్రీ.

[28] మహలికి ఎలియాజరు కలిగాడు. ఎలియాజరుకు కొడుకులు లేరు.

[29] కీషుకు యెరహమెయేల్ కలిగాడు.

[30] మూషి కొడుకులు మహలి, ఏదెరు, యెరీమోతు. వీరందరూ తమ కుటుంబాల ప్రకారం లేవీగోత్రికులు.

[31] వీరు తమ బంధువులైన అహరోను సంతతివారు చేసినట్టు, దావీదు రాజు ఎదుటా, సాదోకు, అహీమెలెకు, యాజులలో లేవీగోత్రికులలో కుటుంబ నాయకుల ఎదుటా చీట్లు వేసుకున్నారు. కుటుంబ నాయకులకూ వారి చిన్న సోదరులకూ ఒకే రీతిగా చీట్లు వేసుకొన్నారు.

1 దినవృత్తాంతాలు — Chapters