Skip to content
Opens in a new window

[1] ఫిలిష్తీయవాళ్ళు ఇస్రాయేల్‌వారితో యుద్ధం చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఇస్రాయేల్‌వారు పారిపోయారు. చాలా మంది హతమై గిలబోవ పర్వతం మీద కూలారు.

[2] ఫిలిష్తీయవాళ్ళు సౌలునూ అతని కొడుకులనూ తరిమి యోనాతాను, అబీనాదాబ్, మెల్కీషూవ అనే సౌలు కొడుకులను హతమార్చారు.

[3] సౌలు చుట్టూరా యుద్ధం తీవ్రమైంది. అతడు అంబులు వేసేవాళ్ళ కంటబడి వాళ్ళచేత గాయాలు పడ్డాడు.

[4] సౌలు తన ఆయుధాలు మోసేవాణ్ణి చూచి “నీ కత్తి దూసి నన్ను పొడువు! లేకపోతే సున్నతి లేని వీళ్ళు వచ్చి నన్ను దూషణకు గురి చేస్తారు” అన్నాడు, కానీ ఆయుధాలు మోసేవాడు చాలా భయపడి అలా చేయడానికి నిరాకరించాడు. అందుచేత సౌలు తన ఖడ్గాన్ని పట్టుకొని దానిపై పడ్డాడు.

[5] సౌలు చనిపోయాడని గ్రహించి ఆయుధాలు మోసేవాడు తన కత్తిమీద పడి చనిపోయాడు.

[6] సౌలు, తన కొడుకులలో ముగ్గురు, తన ఇంటివారందరూ ఒకే రోజున చనిపోయారు.

[7] ఇస్రాయేల్ సైన్యం పారిపోయిందనీ సౌలు, అతని కొడుకులు చనిపోయారనీ తెలుసుకొని లోయలో ఉన్న ఇస్రాయేల్ ప్రజలంతా వారి ఊళ్ళను విడిచి పారిపోయారు. ఫిలిష్తీయవాళ్ళు వచ్చి వాటిని ఆక్రమించారు.

[8] మరుసటి రోజున ఫిలిష్తీయ వాళ్ళు హతమైనవారిని దోచుకోవడానికి వచ్చారు. గిలబోవ పర్వతం మీద పడి ఉన్న సౌలునూ అతని కొడుకులనూ చూచి

[9] అతని కవచం దోచుకొని, అతని తలనూ అతని ఆయుధాలనూ తీసుకుపోయారు. తమ విగ్రహాల మధ్య, తమ ప్రజలమధ్య ఈ వార్త తెలియజేయడానికి ఫిలిష్తీయదేశంలో నలుదిక్కులకు మనుషులను పంపారు.

[10] వాళ్ళు సౌలు ఆయుధాలను తమ దేవతల గుడిలో ఉంచారు. అతని తలను దాగోనుదేవుడి గుడిలో తగిలించారు.

[11] ఫిలిష్తీయవాళ్ళు సౌలుకు చేసిన దాని విషయం యాబేష్‌గిలాదు పురవాసులందరికి వినబడింది.

[12] అప్పుడు బలంగల వీరులందరూ వెళ్ళి సౌలు మృతదేహాన్నీ అతని కొడుకుల మృతదేహాలనూ తీసుకొని యబేష్‌కు తెచ్చారు. వారి ఎముకలను యాబేష్‌లో సిందూరవృక్షం క్రింద పాతిపెట్టి ఏడు రోజులు ఉపవాసమున్నారు.

[13] యెహోవామీద ద్రోహం చేసినందుచేత సౌలు చనిపోయాడు. అతడు యెహోవా వాక్కును పాటించలేదు. కర్ణపిశాచం గల స్త్రీ దగ్గర విచారణ చేశాడు గానీ యెహోవా దగ్గర కాదు.

[14] ఈ కారణాలచేత యెహోవా అతణ్ణి చావుకు గురి చేసి రాజ్యాన్ని యెష్షయి కొడుకైన దావీదుకు అప్పగించాడు.

1 దినవృత్తాంతాలు — Chapters