Skip to content
Opens in a new window
Listen to this chapter • 8:46

[1] అందుచేత యేసు పస్కా పండుగకు ఆరు రోజులు ముందుగా బేతనీకి వచ్చాడు. అక్కడ లాజరు మృతి చెందాడు, యేసు చనిపోయిన వారిలోనుంచి అతణ్ణి లేపాడు.

[2] వారు ఆయనకు అక్కడ విందు చేశారు. మార్త పరిచర్య చేస్తూ ఉంది, లాజరు యేసుతో భోజనానికి కూర్చుని ఉన్నవారిలో ఒకడు.

[3] మరియ అయితే చాలా విలువైన అత్తరు సుమారు సగం కిలో బరువు తెచ్చింది. అది స్వచ్ఛమైన జటామాంసి. ఆమె యేసు పాదాలను అభిషేకించి తలవెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. ఇల్లంతా పరిమళ సువాసనతో నిండిపోయింది.

[4] ఆయన శిష్యులలో ఒకడూ సీమోను కుమారుడూ ఆయనను శత్రువులకు పట్టి ఇవ్వనై ఉన్నవాడైన ఇస్కరియోతు యూదా

[5] “ఈ అత్తరు ఎందుకు మూడు వందల దేనారాలకు అమ్మి బీదలకివ్వలేదు?” అన్నాడు.

[6] అతడు ఇలా అన్నది బీదలమీద శ్రద్ధ ఉండి కాదు. అతడు దొంగ, అతని దగ్గర శిష్యుల డబ్బుసంచి ఉండడంచేత దానిలో వేసినది సొంతానికి తీసుకొనేవాడు.

[7] కనుక యేసు “ఆమెను ఇలా చేయనివ్వండి. ఆమె ఈ అత్తరు ఉంచినది నా అంత్యక్రియలరోజు కోసమే.

[8] బీదలు ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంటారు గానీ నేను ఎల్లప్పుడు మీతో ఉండను” అన్నాడు.

[9] ఆయన అక్కడ ఉన్నాడని యూదులలో చాలామందికి తెలియవచ్చింది. వారు యేసునే కాదు, ఆయన చనిపోయిన వారిలోనుంచి లేపిన లాజరును కూడా చూద్దామని వచ్చారు.

[10] లాజరు కారణంగా యూదులలో అనేకులు తమను విడిచి యేసుమీద నమ్మకం ఉంచినందుచేత

[11] ప్రధాన యాజులు అతణ్ణి కూడా చంపాలని కుట్రపన్నారు.

[12] మరుసటి రోజున యేసు జెరుసలం వస్తున్నాడని పండుగకు వచ్చిన మహా సమూహానికి వినవచ్చింది.

[13] వారు ఖర్జూర మట్టలు చేతపట్టుకొని ఆయనకు ఎదురు వెళ్ళి “జయం! ప్రభువు పేరట వచ్చేవాడు, ఇస్రాయేల్‌ప్రజల రాజు ధన్యజీవి!” అని కేకలు వేయడం ఆరంభించారు.

[14] ఇలా వ్రాసి ఉంది: సీయోను కుమారీ, భయపడకు! మీ రాజు గాడిద పిల్ల మీద కూర్చుని ఉండి వస్తున్నాడు.

[15] దీనిప్రకారమే యేసు ఒక గాడిదపిల్లను కనుక్కొని దానిమీద కూర్చున్నాడు.

[16] ఈ విషయాలు మొట్టమొదట ఆయన శిష్యులకు అర్థం కాలేదు గాని యేసు మహిమాస్థితి పొందిన తరువాత అవి ఆయనను గురించి వ్రాసి ఉన్నవనీ వారు ఆయనపట్ల అలా జరిగించారనీ శిష్యులు జ్ఞాపకం చేసుకొన్నారు.

[17] ఆయన లాజరును చనిపోయినవారిలో నుంచి లేపి సమాధినుంచి పిలిచినప్పుడు ఆయనతో ఉన్న ప్రజలు ఆయనను గురించిన సాక్ష్యం చెపుతూ వచ్చారు.

[18] ఆయన ఈ సూచకమైన అద్భుతం చేశాడని వినడంచేత ఆ ప్రజలు ఆయనకు ఎదురు వెళ్ళారు.

[19] అందుచేత పరిసయ్యులు తమలో తాము ఇలా చెప్పుకొన్నారు: “చూశారా, మీరు చేసినదానిలో నెగ్గినది ఏమీ లేదు. ఇదిగో, లోకమంతా ఆయన వెంట వెళ్ళింది.”

[20] పండుగలో ఆరాధించడానికి వచ్చినవారిలో గ్రీసు దేశస్థులు కొందరు ఉన్నారు.

[21] వారు ఫిలిప్పు దగ్గరికి వచ్చారు (అతడు గలలీలోని బేత్‌సయిదా నివాసి). వారు “అయ్యా, యేసును చూడాలని మా ఆశ” అని అతణ్ణి కోరారు.

[22] ఫిలిప్పు వచ్చి అంద్రెయకు చెప్పాడు. అంద్రెయ, ఫిలిప్పు యేసుకు చెప్పారు.

[23] యేసు వారికిలా సమాధానం చెప్పాడు: “మానవ పుత్రుడు మహిమాస్థితి పొందే గడియ వచ్చింది.

[24] మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే అది ఒంటిరిగానే ఉండిపోతుంది. అది చస్తే సమృద్ధిగా ఫలిస్తుంది.

[25] తన ప్రాణం అంటే ప్రీతి ఉన్నవాడు దానిని పోగొట్టుకొంటాడు. కానీ ఈ లోకంలో ఉన్న తన ప్రాణం అంటే ద్వేషం ఉన్నవాడు దానిని శాశ్వత జీవంకోసం సంరక్షిస్తాడు.

[26] “ఎవరైనా నాకు సేవ చేస్తే నన్ను అనుసరిస్తూ ఉండాలి. నేనెక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉంటారు. ఎవరైనా నాకు సేవ చేస్తే అతణ్ణి నా తండ్రి ఘనపరుస్తాడు.

[27] ఇప్పుడు నా ప్రాణానికి ఆందోళనగా ఉంది. నేనేమి అనాలి? తండ్రీ, ఈ ఘడియ నుంచి నన్ను తప్పించు అనాలా? కానీ, నేను ఈ ఘడియకు వచ్చినది ఇందుకే.

[28] తండ్రీ, నీ పేరుకు మహిమ చేకూర్చుకో!” అప్పుడు పరలోకంనుంచి ఒక స్వరం ఇలా వినిపించింది: “నేను దానికి మహిమ చేకూర్చుకొన్నాను, మళ్ళీ చేకూర్చుకొంటాను.”

[29] అక్కడ నిలుచుండి అది విన్న జనం “ఉరిమింది” అన్నారు. ఇతరులు “ఒక దేవదూత ఆయనతో మాట్లాడాడు” అన్నారు.

[30] అందుకు యేసు “ఈ స్వరం వచ్చినది నాకోసం కాదు గాని మీకోసమే.

[31] ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతుంది. ఇప్పుడు లోక పాలకుణ్ణి బయటికి త్రోసివేయడం జరుగుతుంది.

[32] నన్ను భూమినుంచి పైకెత్తడం జరిగితే నేను నావైపుకు అన్ని జనాలనూ ఆకర్షించుకొంటాను” అన్నాడు.

[33] ఆయన ఎలాంటి మరణానికి గురి కాబోతున్నాడో సూచించడానికి ఆ మాట చెప్పాడు.

[34] ప్రజలు ఆయనకు జవాబిస్తూ “అభిషిక్తుడు ఎప్పటికీ మాతోనే ఉంటాడని ధర్మశాస్త్రంలో ఉందని విన్నాం. ‘మానవపుత్రుణ్ణి పైకెత్తడం జరగాల’ని మీరు అంటున్నారేం? అసలు ఈ మానవ పుత్రుడు ఎవరు?” అన్నారు.

[35] అందుచేత యేసు వారితో ఇలా అన్నాడు: “మీ మధ్య వెలుగు ఉండేది ఇంకా కొంత కాలమే. చీకటి మిమ్ములను కమ్మకుండా వెలుగు మీ మధ్య ఉండగానే దానిలో నడుచుకోండి. చీకటిలో నడుస్తున్నవానికి తాను ఎక్కడికి వెళ్తూ ఉన్నాడో తనకు తెలియదు.

[36] మీ మధ్య వెలుగు ఉండగానే మీరు వెలుగు సంతానం అయ్యేలా ఈ వెలుగును నమ్మండి.” ఈ సంగతులు చెప్పి యేసు వెళ్ళి వారికి కనబడకుండా తనను మరుగు చేసుకొన్నాడు.

[37] ఆయన వారి ఎదుట సూచనకోసమైన అద్భుతాలు ఇన్ని చేసినా వారు ఆయనమీద నమ్మకం ఉంచలేదు.

[38] యెషయాప్రవక్త చెప్పిన ఈ వాక్కు నెరవేరేలా అది జరిగింది: “ప్రభూ, మేము తెలియజేసిన సమాచారం నమ్మినదెవరు? ప్రభు హస్తం ఎవరికి వెల్లడి అయింది?”

[39] ఇందుచేత వారు నమ్మలేకపోయారు. ఎందుకంటే, యెషయా ఇంకా ఇలా చెప్పాడు:

[40] వారు తమ కండ్లతో చూడకుండా, తమ హృదయాలతో అర్థం చేసుకోకుండా, నావైపు తిరిగి నావల్ల బాగుపడకుండా ఆయన వారి కండ్లకు గుడ్డితనం కలిగించాడు, వారి హృదయాలను కఠిన పరిచాడు.

[41] యెషయా యేసు మహిమ చూచి ఆయన విషయం చెప్పినప్పుడు ఈ విషయాలు అన్నాడు.

[42] అయినా అధికారులలో కూడా అనేకులు ఆయనమీద నమ్మకం ఉంచారు గాని పరిసయ్యుల కారణంగా అది ఒప్పుకోలేదు. తమను సమాజ కేంద్రంనుంచి వెలివేయడం జరుగుతుందేమో అని భయపడ్డారు.

[43] దేవుని మెప్పుకంటే మనుషుల మెప్పు వారికి ఎక్కువ ప్రీతిపాత్రమైనదన్న మాట.

[44] అప్పుడు యేసు బిగ్గరగా ఇలా అన్నాడు: “నామీద నమ్మకం ఉంచేవాడు నామీద కాదు, నన్ను పంపినవాని మీద నమ్మకం ఉంచుతున్నాడు.

[45] నన్ను చూచేవాడు నన్ను పంపినవాణ్ణి చూస్తున్నాడు.

[46] నామీద నమ్మకం ఉంచేవారు చీకటిలో ఉండిపోకుండా నేను వెలుగుగా లోకానికి వచ్చాను.

[47] నా మాటలు ఎవరైనా విని నమ్మకపోతే నేను వానికి తీర్పు చేయడం లేదు. లోకానికి తీర్పు తీర్చడానికి నేను రాలేదు గాని లోకానికి విముక్తి కలిగించడానికే వచ్చాను.

[48] నా మాటలు అంగీకరించక నన్ను నిరాకరించేవానికి తీర్పు తీర్చేది ఒకటి ఉంటుంది. చివరి రోజున వారికి తీర్పు తీర్చేది నేను చెప్పిన వాక్కే.

[49] ఎందుకంటే, నా అంతట నేనే మాట్లాడలేదు. నేనేమి చెప్పాలో, ఏమి మాట్లాడాలో నన్ను పంపిన తండ్రి నన్ను ఆదేశించాడు.

[50] ఆయన ఆదేశం శాశ్వత జీవమని నాకు తెలుసు. అందుచేత నేను ఏ సంగతులు చెప్పినా తండ్రి నాకు చెప్పినట్టే చెపుతున్నాను.”

యోహాను శుభవార్త — Chapters