Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:08

[1] మూడో రోజున గలలీలోని కానాలో పెండ్లి జరిగింది. యేసు తల్లి అక్కడ ఉంది.

[2] యేసునూ ఆయన శిష్యులనూ కూడా పెండ్లికి పిలిచారు.

[3] ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి ఆయనతో “వారిదగ్గర ద్రాక్షరసం లేదు” అంది.

[4] యేసు ఆమెతో “అమ్మా, నీతో నాకేమి పని? నా సమయం ఇంకా రాలేదు” అన్నాడు.

[5] ఆయన తల్లి పనివారితో “మీతో ఆయన చెప్పినది చేయండి” అంది.

[6] అక్కడ ఆరు రాతి బానలు ఉన్నాయి. ఒక్కొక్కటీ సుమారు డెబ్భయి, లేదా నూరు లీటర్ల నీళ్ళు పట్టేది. అవి యూదుల శుద్ధి ఆచారం కోసం అక్కడ ఉంచారు.

[7] యేసు వారితో “ఈ బానల నిండా నీళ్లు పోయండి” అన్నాడు. అంచుల వరకు వారు నీళ్ళు నింపారు.

[8] అప్పుడాయన వారితో “ఇప్పుడు ముంచి విందు యజమాని దగ్గరికి తీసుకువెళ్ళండి” అన్నాడు. అలాగే వారు తీసుకువెళ్ళారు.

[9] ద్రాక్షరసంగా మారిన ఆ నీరు ఎక్కడనుంచి వచ్చిందో ఆ నీళ్ళు తోడిన పనివారికి మాత్రమే తెలిసింది. విందు యజమానికి తెలియదు. అతడు దానిని రుచి చూచి పెండ్లి కొడుకును పిలిచి ఇలా అన్నాడు:

[10] “ప్రతి ఒక్కరూ మొదట్లోనే మంచి ద్రాక్షరసం వడ్డిస్తారు. అతిథులు బాగా త్రాగాక రుచి తక్కువది పోస్తారు. మీరైతే ఇప్పటివరకు మంచి ద్రాక్షరసమే ఉంచారు.”

[11] యేసు చేసిన సూచనకోసమైన అద్భుతాలలో ఈ మొదటిది గలలీలోని కానాలో చేసి తన మహాత్యం వ్యక్తపరిచాడు. ఆయన శిష్యులు ఆయనమీద నమ్మకం ఉంచారు.

[12] ఆ తరువాత యేసు, ఆయన తల్లి, ఆయన తమ్ముళ్ళు, ఆయన శిష్యులు కపెర్‌నహూం వెళ్ళారు. వారు అక్కడ అనేక రోజులు ఉండిపోలేదు.

[13] యూదుల పస్కా పండుగ దగ్గరపడింది. యేసు జెరుసలం వెళ్ళాడు.

[14] దేవాలయంలో ఎద్దులనూ గొర్రెలనూ పావురాలనూ అమ్మేవారినీ కూర్చుని ఉన్న డబ్బు మారకందారులనూ ఆయన చూశాడు.

[15] ఆయన త్రాళ్లతో కొరడా చేసి వాళ్ళందరినీ గొర్రెలతో ఎద్దులతోపాటు దేవాలయంనుంచి వెళ్లగొట్టాడు. డబ్బు మారకందారుల నాణేలు వెదజల్లివేశాడు. వాళ్ళ బల్లలు పడద్రోశాడు.

[16] పావురాలు అమ్మేవారితో ఆయన “వీటిని బయటికి తీసుకువెళ్ళండి. నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా చేయకండి!” అన్నాడు.

[17] “నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను తినివేసింది” అని వ్రాసి ఉందని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొన్నారు.

[18] అప్పుడు యూదులు జవాబిస్తూ ఆయనతో “నీవు ఈ క్రియలు చేస్తూ ఉన్నావే. సూచనగా ఏ అద్భుతం మాకు చూపుతావు?” అన్నారు.

[19] “ఈ దేవాలయాన్ని నాశనం చేయండి, మూడు రోజులలో దీనిని లేపుతాను” అని యేసు వారికి బదులు చెప్పాడు.

[20] అందుచేత యూదులు “ఈ దేవాలయాన్ని కట్టడానికి నలభై ఆరేళ్ళు పట్టిందే. నీవు దాన్ని మూడు రోజులలో లేపుతావా?” అన్నారు.

[21] అయితే ఆయన తన శరీరం అనే దేవాలయాన్ని ఉద్దేశించి అలా చెప్పాడు.

[22] కనుక చనిపోయిన వారిలో నుంచి ఆయన సజీవంగా లేచిన తరువాత, ఆయన తమతో అలా చెప్పాడని ఆయన శిష్యులకు జ్ఞప్తికి వచ్చింది. యేసు చెప్పిన మాట, లేఖనం వారు నమ్మారు.

[23] ఆయన పస్కా పండుగ సమయాన జెరుసలంలో ఉన్నప్పుడు ఆయన చేసిన సూచనకోసమైన అద్భుతాలు చూచి అనేకులు ఆయన పేరుమీద నమ్మకం ఉంచారు.

[24] కానీ యేసు తనను వారి వశం చేసుకోలేదు. ఎందుకంటే అందరూ ఆయనకు తెలుసు.

[25] మనిషిలో ఉన్నదంతా ఆయన తెలిసినవాడు గనుక మనిషిని గురించి ఎవరి సాక్ష్యమూ ఆయనకు అక్కర లేదు.

యోహాను శుభవార్త — Chapters