[1] ఆ తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చింది గనుక యేసు జెరుసలం వెళ్ళాడు.
[2] జెరుసలంలో ‘గొర్రెల ద్వారం’ దగ్గర ఒక కోనేరు ఉంది. హీబ్రూ భాషలో దాని పేరు బెతెస్థ. దానికి అయిదు మంటపాలు ఉన్నాయి.
[3] వాటిలో రోగులూ గుడ్డివారూ కుంటివారూ కాళ్ళు చేతులు ఊచబారిపోయినవారూ గుంపులుగా పడి ఉన్నారు. వారు నీళ్ళ కదలికకోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
[4] ఎందుకంటే, ఒకానొక సమయంలో ఒక దేవదూత కోనేటిలోకి దిగివచ్చి నీళ్ళు కదలించిన తరువాత మొట్టమొదట నీళ్ళలో దిగిన రోగి – ఎలాంటి రోగంతో ఉన్నా – పూర్తిగా నయం కావడం జరిగేది.
[5] అక్కడ ఒక మనిషి ఉన్నాడు. అతని దుర్బలత ముప్ఫయి ఎనిమిదేళ్ళ నుంచి ఉంది.
[6] అతడు అక్కడ పడి ఉండడం యేసు చూశాడు. అతడు చాలా కాలంనుంచి ఆ స్థితిలోనే ఉన్నాడని ఆయనకు తెలుసు. “నీకు బాగుపడాలని ఇష్టం ఉందా?” అని ఆయన అతణ్ణి అడిగాడు.
[7] ఆ రోగి ఆయనతో ఇలా బదులు చెప్పాడు: “అయ్యా, నీళ్ళను కదిలించడం జరిగితే కోనేటిలో నన్ను దించడానికి నాకెవరూ లేరు గనుక నేను వచ్చేంతలోనే ఇంకెవరో నాకంటే ముందుగా దిగుతారు.”
[8] యేసు అతనితో “లేచి నీ పడక ఎత్తుకొని నడువు” అన్నాడు.
[9] వెంటనే ఆ మనిషి బాగుపడి తన పడక ఎత్తుకొని నడవసాగాడు.
[10] ఆ రోజు విశ్రాంతి దినం గనుక యూదులు బాగుపడిన ఆ మనిషితో “ఇది విశ్రాంతి దినం. నువ్వు నీ పడక మోయడం ధర్మశాస్త్రానికి విరుద్ధం” అన్నారు.
[11] అందుకు అతడు “నన్ను బాగు చేసినవాడు ‘నీ పడక ఎత్తుకొని నడువు’ అని నాతో చెప్పాడు” అన్నాడు.
[12] “నీ పడక ఎత్తుకొని నడవమని నీతో చెప్పినదెవరు?” అని వాళ్ళు అతణ్ణి అడిగారు.
[13] ఆయన ఎవరో బాగుపడినవానికి తెలియదు. ఎందుకంటే, అక్కడ ఉన్న పెద్ద గుంపులోనుంచి యేసు తప్పుకొన్నాడు.
[14] తరువాత యేసు అతణ్ణి దేవాలయంలో చూచి అతనితో “ఇదిగో విను, నీవు బాగయ్యావు. మునుపటి కంటే ఎక్కువ కీడు నీ మీదికి రాకుండా ఇకనుంచి అపరాధం చేయకు” అన్నాడు.
[15] ఆ మనిషి వెళ్ళి తనను బాగు చేసినవాడు యేసు అని యూదులకు తెలియజేశాడు.
[16] యేసు విశ్రాంతి దినాన ఈ పనులు చేసినందుచేత యూదులు ఆయనను హింసించారు, చంపడానికి చూశారు.
[17] అయితే యేసు వారికిలా బదులు చెప్పాడు: “ఇప్పటి వరకు నా తండ్రి పని చేస్తూ ఉన్నాడు, నేనూ పని చేస్తూ ఉన్నాను.”
[18] ఈ కారణంచేత యూదులు ఆయనను చంపడానికి మరి ఎక్కువగా కోరారు – ఆయన విశ్రాంతి దినాచారాలు మీరడం మాత్రమే గాక, దేవుణ్ణి తన తండ్రి అంటూ తనను దేవునితో సమానుడుగా చేసుకొన్నాడు.
[19] అందుచేత యేసు వారికి ఇలా జవాబిచ్చాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, తండ్రి చేసేది చూచి కుమారుడు అది మాత్రమే చేస్తాడు. తనంతట తానే ఏదీ చేయలేడు. తండ్రి ఏవి చేస్తే కుమారుడు ఆ విధంగానే చేస్తాడు.
[20] కుమారుడంటే తండ్రికి ప్రేమ. తాను చేసేదంతా ఆయనకు చూపుతాడు. మీరు ఆశ్చర్యపడాలని వీటికంటే గొప్ప పనులు ఆయనకు చూపుతాడు.
[21] తండ్రి చనిపోయినవారిని బ్రతికించి లేపే ప్రకారమే కుమారుడు కూడా తనకు ఇష్టం వచ్చినవారిని బ్రతికిస్తాడు.
[22] తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడు గాని తీర్పు తీర్చే అధికారమంతా కుమారునికి అప్పగించాడు.
[23] అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుణ్ణి గౌరవించాలని ఇందులో ఆయన ఉద్దేశం. కుమారుణ్ణి గౌరవించని వ్యక్తి ఆయనను పంపిన తండ్రిని గౌరవించడం లేదు.
[24] “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నా మాట విని నన్ను పంపినవానిమీద నమ్మకముంచేవాడు శాశ్వత జీవం గలవాడు. అతడు తీర్పులోకి రాడు. మరణంలోనుంచి జీవంలోకి దాటాడు.
[25] “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, చనిపోయినవారు దేవుని కుమారుని స్వరం వినే కాలం వస్తూ ఉంది. అది రానే వచ్చింది. ఆయన స్వరం వినేవారు బ్రతుకుతారు.
[26] ఎందుకంటే, తండ్రి ఎలాగు స్వయంగా జీవం గలవాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా జీవం కలిగి ఉండేలా తండ్రి ఆయనకు ఇచ్చాడు.
[27] ఇదిగాక, ఆయన మానవ పుత్రుడై ఉండడంచేత తీర్పు తీర్చడానికి ఆయనకు అధికారం ఇచ్చాడు.
[28] “ఇందుకు ఆశ్చర్యపడకండి. ఒక కాలం వస్తుంది. అప్పుడు సమాధులలో ఉన్నవారందరూ ఆయన స్వరం వింటారు.
[29] వారు బయటికి వస్తారు. మంచి చేసినవారు శాశ్వత జీవం కోసం లేస్తారు; దుర్మార్గత చేసినవారు శిక్షావిధికి లేస్తారు.
[30] నా అంతట నేనే ఏమీ చేయలేను. నేను వినే ప్రకారం తీర్పు తీరుస్తాను. నన్ను పంపినవారి ఇష్టప్రకారమే చేయాలని కోరుతూ ఉన్నాను గాని నా ఇష్టప్రకారం కాదు గనుక నేను తీర్చే తీర్పు న్యాయమైనది.
[31] “నా విషయం నేనే సాక్ష్యం చెప్పుకొంటే నా సాక్ష్యం నిజమైనది కాదు.
[32] నా విషయం సాక్ష్యం చెప్పేవాడు ఇంకొకడు ఉన్నాడు. నా విషయం ఆయన చెప్పే సాక్ష్యం నిజమని నాకు తెలుసు.
[33] “మీరు యోహాను దగ్గరకు మనుషులను పంపారు. అతడు సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పాడు.
[34] అయినా, మనుషుల సాక్ష్యం నేను చేకూర్చుకోను గాని మీకు పాపవిముక్తి కలగాలని నేను ఈ మాటలు చెపుతున్నాను.
[35] అతడు వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్న దీపం. అతని వెలుగులో కొంతకాలం సంతోషించడానికి మీరు ఇష్టపడ్డారు.
[36] “కానీ యోహాను సాక్ష్యాన్ని మించిన సాక్ష్యం నాకు ఉంది. నెరవేర్చడానికి తండ్రి నాకిచ్చిన పనులు – నేను చేస్తూ ఉన్న పనులే – తండ్రి నన్ను పంపాడని సాక్ష్యంగా ఉన్నాయి.
[37] ఇది గాక, నన్ను పంపిన తండ్రి తానే నా విషయం సాక్ష్యమిచ్చి ఉన్నాడు. ఆయన స్వరం మీరెన్నడూ వినలేదు. ఆయన స్వరూపాన్ని చూడలేదు.
[38] మీలో ఆయన వాక్కు నిలిచి ఉండడం లేదు. ఎందుకంటే, ఆయన పంపినవాణ్ణి మీరు నమ్మడం లేదు.
[39] మీరు లేఖనాలను పరిశోధిస్తున్నారు. వాటి మూలంగా మీకు శాశ్వత జీవం ఉందని మీ ఆలోచన. అవి నా విషయమే సాక్ష్యం చెపుతూ ఉన్నాయి.
[40] అయినా మీకు జీవం కలిగేలా నా దగ్గరకు రావడానికి మీకు ఇష్టం లేదు.
[41] “మనుషులు ఇచ్చే ఘనత నేను స్వీకరించను.
[42] మీరు నాకు తెలుసు – మీలో దేవుని ప్రేమ లేదు.
[43] నేను నా తండ్రి పేర వచ్చాను, మీరు నన్ను స్వీకరించడం లేదు. వేరొకడు తన పేరునే వస్తే వాణ్ణి మీరు స్వీకరిస్తారు.
[44] “మీరు ఒకరిచేత ఒకరు ఘనత స్వీకరిస్తూ, ఒకే ఒక దేవునినుంచి వచ్చే ఘనత వెదకకుండా ఉంటే నన్ను ఎలా నమ్ముతారు?
[45] తండ్రిదగ్గర మీమీద నేరం మోపుతానని తలంచకండి. మీరు మోషేమీద నమ్మకం ఉంచుతున్నారు. మీమీద నేరం మోపేవాడు అతడే.
[46] ఎందుకంటే, మోషే నన్ను గురించి వ్రాశాడు. మీరు అతని మాటలు నమ్మితే నన్ను కూడా నమ్ముతారు.
[47] అతడు వ్రాసినది మీరు నమ్మకపోతే నా మాటలు ఎలా నమ్ముతారు?”