[1] ఆదివారం నాడు పెందలకడ ఇంకా చీకటిగా ఉండగానే మగ్‌దలేనే మరియ సమాధి దగ్గరకు వచ్చింది. సమాధి ద్వారానికి ఉన్న రాయి అప్పటికే తీసివేసి ఉండడం చూచింది.
[2] గనుక ఆమె సీమోను పేతురు దగ్గరకూ యేసు ప్రేమించిన ఆ మరో శిష్యుని దగ్గరకూ పరుగెత్తి వెళ్ళింది. “వారు ప్రభువును సమాధిలో నుంచి తీసుకు పోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో మాకు తెలియదు” అంది.
[3] అందుచేత పేతురు, ఆ మరో శిష్యుడు సమాధి దగ్గరకు వెళ్ళడానికి బయలుదేరారు.
[4] ఇద్దరూ కలిసి పరుగెత్తుతూ ఉన్నారు గాని ఆ శిష్యుడు పేతురుకంటే త్వరగా పరుగెత్తి మొదట సమాధి చేరాడు.
[5] అతడు వంగి సమాధిలో ఆ అవిసెనార గుడ్డలు ఉండడం చూశాడు గాని లోపలికి వెళ్ళలేదు.
[6] అప్పుడు అతడి వెనకాలే సీమోను పేతురు వచ్చాడు. అతడు సమాధిలో ప్రవేశించి అక్కడ ఉన్న అవిసెనార బట్టలు చూశాడు.
[7] యేసు తలకు చుట్టిన గుడ్డ కూడా చూశాడు. అది ఆ అవిసెనార బట్టలతో గాక వేరే చోట చుట్టిపెట్టి ఉంది.
[8] అప్పుడు, మొదట సమాధి దగ్గరికి చేరిన ఆ మరో శిష్యుడు కూడా లోపలికి వెళ్ళి చూచి నమ్మాడు.
[9] ఆయన చనిపోయినవారిలోనుంచి సజీవంగా లేవడం తప్పనిసరి అనే లేఖనం అప్పటికి వారు గ్రహించలేదు.
[10] అప్పుడు ఆ శిష్యులు మళ్ళీ తమ ఇండ్లకు వెళ్ళారు.
[11] మరియ సమాధి బయట నిలుచుండి ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తూ వంగి సమాధిలోకి చూచింది.
[12] తెల్లని వస్త్రాలు ధరించిన ఇద్దరు దేవదూతలు ఆమెకు కనబడ్డారు. యేసు మృతదేహం మునుపు ఉన్న స్థలంలో తలవైపు ఒకరూ కాళ్ళవైపు మరొకరూ కూర్చుని ఉన్నారు.
[13] వారు ఆమెతో ఇలా అన్నారు: “అమ్మా! ఎందుకు ఏడుస్తూ ఉన్నావు?” ఆమె “వారు నా ప్రభువును తీసుకుపోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో నాకు తెలియదు” అంది.
[14] ఆమె అలా చెప్పి వెనక్కు తిరిగింది. యేసు అక్కడ నిలుచుండడం ఆమెకు కనిపించింది గాని యేసని ఆమె గుర్తుపట్టలేదు.
[15] యేసు ఆమెతో “అమ్మా, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఎవరిని వెదకుతున్నావు?” అన్నాడు. ఆయన తోటమాలి అనుకొని ఆమె ఆయనతో ఇలా అంది: “అయ్యా, ఆయనను మోసుకుపోయినది మీరే గనుక అయితే ఆయనను ఎక్కడ ఉంచారో నాతో చెప్పండి. నేను ఆయనను తీసుకుపోతాను.”
[16] అప్పుడు యేసు ఆమెతో “మరియా” అన్నాడు. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనతో “రబ్బోనీ!” అంది. ఆ మాటకు “గురువు” అని అర్థం.
[17] యేసు ఆమెతో ఇలా అన్నాడు: “నన్ను అంటిపెట్టుకొని ఉండబోకు. ఎందుకంటే నేను ఇంకా నా తండ్రిదగ్గరకు పైకి వెళ్ళలేదు. అయితే నా సోదరుల దగ్గరకు వెళ్ళి ఈ విధంగా చెప్పు: నా తండ్రి, మీ తండ్రి దగ్గరకు, నా దేవుడు, మీ దేవుని దగ్గరకు పైకి వెళ్ళిపోతున్నాను.”
[18] మగ్‌దలేనే మరియ వెళ్ళి తాను ప్రభువును చూశాననీ ఆయన తనతో ఆ విషయాలు చెప్పాడనీ శిష్యులకు తెలియజేసింది.
[19] ఆ రోజు – ఆ ఆదివారం నాడు – సాయంకాల సమయాన శిష్యులు ఒక గదిలో సమకూడి ఉన్నారు. యూదులకు భయం కారణంగా తలుపులు మూసి గడియ వేసుకొని ఉన్నాయి. అప్పుడు యేసు వచ్చి వారి మధ్య నిలుచుండి వారితో “మీకు శాంతి కలుగుతుంది గాక!” అన్నాడు.
[20] అలా చెప్పి వారికి తన చేతులనూ ప్రక్కనూ చూపెట్టాడు. ప్రభువును చూచి శిష్యులు ఆనందించారు.
[21] యేసు మళ్ళీ వారితో ఇలా అన్నాడు: “మీకు శాంతి కలుగుతుంది గాక! తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్ములను పంపుతున్నాను.”
[22] ఆ విధంగా చెప్పి ఆయన వారిమీద ఊది “పవిత్రాత్మను స్వీకరించండి.
[23] మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారు క్షమాపణ పొందారు. ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి అలాగే నిలిచి ఉన్నాయి” అన్నాడు.
[24] యేసు వచ్చినప్పుడు పన్నెండుమందిలో ఒకడైన తోమా లేడు. (ఇతణ్ణి ‘దిదుమ’ అంటారు.)
[25] కాబట్టి తక్కిన శిష్యులు “మేము ప్రభువును చూశాం” అని అతనితో చెప్పారు. అతడైతే వారితో “ఆయన చేతులలో మేకుల మచ్చ నేను చూడకపోతే, ఆ మేకుల మచ్చలో నా వ్రేలు పెట్టకపోతే, ఆయన ప్రక్కన నా చేయి పెట్టకపోతే నేను నమ్మను” అన్నాడు.
[26] ఎనిమిది రోజుల తరువాత ఆయన శిష్యులు మళ్ళీ ఆ గది లోపల ఉన్నారు. తోమా వారితో కూడా ఉన్నాడు. తలుపులు మూసి గడియ వేసి ఉన్నాయి. యేసు వచ్చి వారి మధ్య నిలిచి “మీకు శాంతి కలుగుతుంది గాక!” అన్నాడు.
[27] అప్పుడు తోమాతో “నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడు! నీ చేయి చాచి నా ప్రక్కన పెట్టు. అవిశ్వాసంతో ఉండకుండా నమ్ము!” అన్నాడు.
[28] అందుకు తోమా ఆయనతో “నా ప్రభూ! నా దేవా!” అని ఆయనకు జవాబిచ్చాడు.
[29] యేసు అతనితో “తోమా, నీవు నన్ను చూచి నందుచేత నమ్మావు. చూడకుండానే నమ్మేవారు ధన్యులు” అన్నాడు.
[30] యేసు సూచనకోసమైన అద్భుతాలు ఇంకా అనేకం తన శిష్యుల సమక్షంలో చేశాడు. అవి ఈ పుస్తకంలో వ్రాసినవి కావు.
[31] కానీ యేసు అంటే అభిషిక్తుడూ దేవుని కుమారుడూ అని మీరు నమ్మాలనీ నమ్మి ఆయన పేరు మూలంగా జీవం కలిగి ఉండాలనీ ఇవి వ్రాసి ఉన్నాయి.