[1] బేతనీ గ్రామం వాడైన లాజరుకు జబ్బు చేసింది. ఆ గ్రామంలోనే మరియ, ఆమె సోదరి మార్త ఉండేవారు.
[2] ఈ మరియ అత్తరుతో ప్రభువును అభిషేకించి తన తల వెంట్రుకలతో ఆయన పాదాల తుడిచింది. జబ్బుగా ఉన్న లాజరు ఈమె సోదరుడు.
[3] అందుచేత అక్కచెల్లెండ్లు యేసుకు ఇలా కబురంపారు: “ప్రభూ! నీవు ప్రేమతో చూచే వాడికి జబ్బు చేసింది.”
[4] అది విని యేసు “ఆ రోగం రావడం మరణం కోసం కాదు గాని దాని ద్వారా దేవుని కుమారునికి మహిమ కలిగేలా దేవుని మహిమకోసమే వచ్చింది” అన్నాడు.
[5] యేసుకు మార్త, ఆమె సోదరి, లాజరు అంటే ప్రేమ.
[6] అతడు జబ్బుగా ఉన్నాడని విని కూడా ఆయన ఉన్న చోట ఇంకా రెండు రోజులు ఉండిపోయాడు.
[7] ఆ తరువాత ఆయన శిష్యులతో అన్నాడు “యూదయకు తిరిగి వెళ్దాం, పదండి.”
[8] శిష్యులు “గురువర్యా, ఇటీవలే యూదులు నీమీద రాళ్ళు రువ్వాలని చూశారు! తిరిగి అక్కడికి వెళ్తావా?” అని ఆయనతో అన్నారు.
[9] యేసు ఇలా జవాబిచ్చాడు: “పగటికి ఉన్నవి పన్నెండు గంటలు గదా. ఎవరైనా పగటివేళ నడిస్తే అతనికి ఈ లోకం వెలుగు కనిపిస్తుంది గనుక తడబడడం అంటూ ఉండదు.
[10] కానీ రాత్రివేళ నడిచేవాడిలో వెలుగు లేకపోవడంచేత తడబడుతాడు.”
[11] ఇలా చెప్పిన తరువాత ఆయన “మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతణ్ణి మేల్కొలపడానికి వెళ్తాను” అని వారితో చెప్పాడు.
[12] అందుకు శిష్యులు “ప్రభూ! అతడు నిద్రపోతూ ఉంటే బాగుపడుతాడు” అన్నారు.
[13] యేసు అతని మృతిని గురించి అలా చెప్పాడు గాని సహజమైన నిద్ర వల్ల కలిగే విశ్రాంతిని గురించి ఆయన చెప్పాడని వారనుకొన్నారు.
[14] కనుక యేసు వారితో స్పష్టంగా ఇలా చెప్పాడు: “లాజరు చనిపోయాడు.
[15] నేను అక్కడ లేనందుచేత సంతోషిస్తూ ఉన్నాను. ఈ సంతోషం మీ మేలు విషయమే. అంటే మీకు నమ్మకం కుదరాలని నా ఉద్దేశం. అతనిదగ్గరకు వెళ్దాం, పదండి.”
[16] అప్పుడు తోమా (అతణ్ణి ‘దిదుమ’ అని కూడా అంటారు) సాటి శిష్యులతో అన్నాడు “ఆయనతో చనిపోవడానికి మనం కూడా వెళ్దాం.”
[17] యేసు వచ్చినప్పుడు లాజరు సమాధిలో నాలుగు రోజులు ఉండడం ఆయన చూశాడు.
[18] బేతనీ జెరుసలం దగ్గరే, సుమారు మూడు కిలోమీటర్ల దూరాన ఉంది.
[19] కనుక మరియ, మార్తలను వారి సోదరుని విషయం ఓదార్చడానికి చాలామంది యూదులు వారిదగ్గరికి వచ్చారు.
[20] యేసు వస్తూ ఉన్నాడని మార్త విన్నప్పుడు ఆయనకు ఎదురు వెళ్ళింది. మరియ అయితే ఇంట్లో కూర్చుని ఉంది.
[21] మార్త యేసుతో ఇలా అంది: “ప్రభూ, ఒక వేళ నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయి ఉండడు.
[22] ఇప్పుడు కూడా నీవు దేవుణ్ణి ఏది అడిగినా అది దేవుడు నీకిస్తాడని నాకు తెలుసు.”
[23] యేసు ఆమెతో “నీ సోదరుడు సజీవంగా లేస్తాడు” అన్నాడు.
[24] “చివరి రోజున పునర్జీవితంలో అతడు లేస్తాడని నాకు తెలుసు” అని మార్త ఆయనతో అంది.
[25] అందుకు యేసు “పునర్జీవితాన్నీ జీవాన్నీ నేనే. నామీద నమ్మకం ఉంచినవాడు చనిపోయినా జీవిస్తాడు.
[26] బ్రతికి ఉండి నామీద నమ్మకం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఇది నమ్ముతున్నావా?” అని ఆమెతో అన్నాడు.
[27] ఆమె ఆయనతో “అవును, ప్రభూ! నీవే లోకానికి రావలసిన దేవుని కుమారుడివనీ అభిషిక్తుడివనీ నమ్ముతున్నాను” అంది.
[28] ఇలా చెప్పి ఆమె వెళ్ళి తన సోదరి మరియను పిలిచి రహస్యంగా “గురువుగారు వచ్చి నిన్ను పిలుస్తున్నారు” అంది.
[29] ఆమె ఆ మాట విని గబాలున లేచి ఆయన దగ్గరికి తరలివెళ్ళింది.
[30] యేసు ఇంకా గ్రామంలోకి రాలేదు. మార్త తనకు ఎదురు వచ్చిన స్థలంలోనే ఉన్నాడు.
[31] ఇంటిలో మరియతో కూడా ఉన్న యూదులు ఆమెను ఓదారుస్తూ ఉన్నారు. మరియ గబాలున లేచి బయటికి వెళ్ళడం చూచినప్పుడు ఆమె సమాధి దగ్గర ఏడ్వడానికి వెళ్తుందని చెప్పి ఆమె వెంట వెళ్ళారు.
[32] యేసు ఉన్న స్థలానికి మరియ చేరి ఆయనను చూచి ఆయన పాదాలదగ్గర సాగిలపడి “ప్రభూ! ఒకవేళ నీవు ఇక్కడ ఉండి ఉంటే నా సోదరుడు చనిపోయి ఉండడు” అంది.
[33] ఆమె ఏడ్వడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడ్వడం యేసు చూచి ఆందోళన చెంది ఆత్మలో పరితపిస్తూ ఇలా అన్నాడు:
[34] “అతణ్ణి మీరెక్కడ ఉంచారు?” వారు “ప్రభూ, వచ్చి చూడండి” అని ఆయనతో అన్నారు.
[35] యేసు కన్నీళ్ళు విడిచాడు.
[36] అందువల్ల యూదులు “ఇదిగో అతడంటే ఈయనకు ఎంత ప్రేమో చూశారా!” అని చెప్పుకొన్నారు.
[37] అయితే వారిలో కొంతమంది “ఆ గుడ్డివాడి కండ్లు తెరిచిన ఈ మనిషి లాజరు చావకుండా చేయలేక పోయేవాడా?” అన్నారు.
[38] మళ్ళీ తనలో పరితపిస్తూ యేసు సమాధి దగ్గరికి వచ్చాడు. అది గుహ. దానిమీద బండ ఉంది.
[39] యేసు “బండ తీసివేయండి” అన్నాడు. చనిపోయినవాని సోదరి మార్త “ప్రభూ, అతడు నాలుగు రోజులు నిర్జీవంగా ఉన్నాడు, గనుక కంపుకొడతుంది” అని ఆయనతో చెప్పింది.
[40] యేసు “నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావని నేను నీతో అనలేదా?” అని ఆమెతో అన్నాడు.
[41] అప్పుడు వారు చనిపోయిన వాడున్న స్థలం నుంచి బండను తీసివేశారు. యేసు పైకి చూస్తూ ఇలా అన్నాడు: “తండ్రీ! నా ప్రార్థన విన్నందుచేత నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాను.
[42] నీవు ఎప్పుడూ నా ప్రార్థనలు వింటున్నావని నాకు తెలుసు గాని నీవు నన్ను పంపావని ఇక్కడ నిలుచున్న ప్రజలు నమ్మాలని వారిని బట్టి ఇది చెప్పాను.”
[43] ఇలా చెప్పి ఆయన “లాజరూ! బయటికి రా!” అని బిగ్గరగా పిలిచాడు.
[44] చనిపోయినవాడు బయటికి వచ్చాడు. సమాధి కట్లు అతని కాళ్ళకూ చేతులకూ కట్టి ఉన్నాయి. అతని ముఖానికి రుమాలు చుట్టివేసి ఉంది. యేసు వారితో “ఆ కట్లు విప్పి అతణ్ణి వెళ్ళనియ్యండి” అన్నాడు.
[45] ఈ కారణంగా, మరియ దగ్గరికి వచ్చిన యూదులలో అనేకులు ఆయన చేసినవి చూచి ఆయనమీద నమ్మకం ఉంచారు.
[46] కానీ వారిలో మరి కొందరు పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి యేసు చేసినది వారికి తెలియజేశారు.
[47] కనుక ప్రధాన యాజులూ పరిసయ్యులూ సమాలోచన సభను సమకూర్చారు. అప్పుడు వారు ఇలా చెప్పుకొన్నారు: “ఈ మనిషి అనేక సూచకమైన అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు గానీ మనం ఏం చేయాలి?
[48] మనం ఇలాగే అతణ్ణి చేయనిస్తే అందరూ అతణ్ణి నమ్ముతారు. అప్పుడు రోమ్ వాళ్ళు వచ్చి మన స్థలాన్నీ దేశాన్నీ పూర్తిగా స్వాధీనం చేసుకొంటారు.”
[49] వారిలో ఒకడు కయప. అతడు ఆ సంవత్సరం ప్రముఖ యాజి. అతడు వారితో అన్నాడు “మీకేమీ తెలీదు.
[50] సర్వజాతి నాశనం కాకుండా ప్రజలకోసం ఒకే మనిషి చావడం మనకు మేలని మీరు ఆలోచించరు.”
[51] ఈ మాట తనంతట తానే చెప్పలేదు గానీ ఆ సంవత్సరం అతడు ప్రముఖ యాజి అయి ఉండి యేసు ఆ ప్రజకోసం చనిపోతాడని భవిష్యద్వాక్కు పలికాడు.
[52] ఆ ప్రజకోసమే కాదు గాని బయట చెదరి ఉన్న దేవుని పిల్లలందరినీ ఆయన ఒకటిగా సమకూరుస్తాడని కూడా భవిష్యద్వాక్కు పలికాడు.
[53] అందుచేత ఆ రోజునుంచి ఆయనను చంపడానికి వారు కుట్ర పన్నుతూ వచ్చారు.
[54] కాబట్టి యేసు అప్పటినుంచి యూదులలో బహిరంగంగా సంచరించలేదు గాని అక్కడనుంచి ఎడారి దగ్గర ఉన్న ప్రాంతానికి, ఎఫ్రాయిం అనే ఊరికి వెళ్ళిపోయాడు. అక్కడ తన శిష్యులతోకూడా ఆగాడు.
[55] యూదుల పస్కా పండుగ దగ్గర పడింది గనుక పస్కా పండుగకు మునుపు తమను శుద్ధి చేసుకోవడానికి చాలామంది పల్లెటూళ్ళనుంచి జెరుసలం వెళ్ళారు.
[56] వారు యేసును వెతుకుతూ దేవాలయంలో నిలుచుండి ఒకరితో ఒకరు ఇలా చెప్పుకొన్నారు: “ఆయన పండుగకు రానే రాడా? ఏమనుకొంటున్నారు?”
[57] అయితే ప్రధాన యాజులూ పరిసయ్యులూ ఆయనను పట్టుకోవాలని ఆయన ఎక్కడ ఉన్నది తెలిసినవారెవరైనా తమకు తెలియజేయాలని ఆజ్ఞ జారీ చేశారు.