[1] ఆ తరువాత యేసు గలలీ సరస్సు (ఇది తిబెరియ సరస్సు) దాటి అవతలికి వెళ్ళాడు.
[2] రోగులకు ఆయన చేసిన సూచన కోసమైన అద్భుతాలు చూచి చాలామంది ఆయన వెంట వచ్చారు.
[3] అక్కడ యేసు ఒక కొండెక్కి తన శిష్యులతో కూడా కూర్చున్నాడు.
[4] పస్కా అనే యూదుల పండుగ దగ్గర పడింది.
[5] యేసు తలెత్తి పెద్ద గుంపు తనవైపుకు రావడం చూచి ఫిలిప్పుతో ఇలా అన్నాడు: “వీరు తినడానికి రొట్టెలు మనం ఎక్కడ కొనాలి?”
[6] అతణ్ణి పరీక్షించడానికి ఆయన అలా అన్నాడు – తాను ఏమి చేయబోతున్నాడో ఆయనకు తెలుసు.
[7] ఫిలిప్పు “వీళ్ళలో ఒక్కొక్కరికి కొంచెం దొరకాలన్నా రెండు వందల దేనారాల రొట్టెలు కూడా ఏమీ చాలవు” అని ఆయనకు జవాబిచ్చాడు.
[8] ఆయన శిష్యులలో ఒకడు – సీమోను పేతురు సోదరుడు అంద్రెయ – యేసుతో ఇలా అన్నాడు:
[9] “ఇక్కడ ఓ అబ్బాయి ఉన్నాడు. వాని దగ్గర అయిదు యవల రొట్టెలూ రెండు చిన్న చేపలూ ఉన్నాయి. అయితే ఇంతమందికి అదేపాటిది?”
[10] “ప్రజలను కూర్చోబెట్టండి” అని యేసు అన్నాడు. ఆ చోట పచ్చిక విస్తారంగా ఉంది గనుక పురుషులు కూర్చున్నారు. వారి సంఖ్య సుమారు అయిదు వేలు.
[11] అప్పుడు యేసు ఆ రొట్టెలు చేతపట్టుకొని దేవునికి కృతజ్ఞత అర్పించాడు, శిష్యులకు పంచి ఇచ్చాడు. శిష్యులు కూర్చుని ఉన్నవారికి వడ్డించారు. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంతమట్టుకు వడ్డించారు.
[12] వారు కడుపారా తిన్న తరువాత ఆయన తన శిష్యులతో “మిగిలిన ముక్కలు ఎత్తండి – ఏమీ నష్టం కాకూడదు” అన్నాడు.
[13] అలాగే వారు వాటిని ఎత్తారు, ఆ అయిదు యవల రొట్టెలు ప్రజలు తినగా మిగిలిన ముక్కలతో పన్నెండు గంపలు నింపారు.
[14] యేసు చేసిన అద్భుతమైన ఈ సూచన చూచి ప్రజలు “నిజంగా, లోకానికి రావలసిన ప్రవక్త ఈయనే!” అన్నారు.
[15] వారు వచ్చి తనను రాజుగా చేయడానికి బలవంతంగా తీసుకుపోతారని యేసుకు తెలుసు, కనుక ఆయన మళ్ళీ కొండకు ఒంటరిగా వెళ్ళాడు.
[16] సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సరస్సు ఒడ్డుకు వెళ్ళి
[17] పడవ ఎక్కి అవతల ఉన్న కపెర్‌నహూంకు దాటిపోసాగారు. అంతలో చీకటి పడింది. యేసు వారిదగ్గరికి ఇంకా రాలేదు.
[18] అప్పుడు పెద్ద గాలి వీస్తూ ఉండడంచేత సరస్సు అల్లకల్లోలం కాసాగింది.
[19] వారు సుమారు అయిదు కిలోమీటర్ల దూరం తెడ్లతో పడవ నడిపిన తరువాత యేసు సరస్సు మీద నడుస్తూ పడవకు దగ్గరగా రావడం చూశారు. వారికి భయం వేసింది.
[20] అయితే ఆయన వారితో “నేనే, భయపడకండి!” అన్నాడు.
[21] అప్పుడు ఆయనను పడవలో చేర్చుకోవడం వారికి ఇష్టం అయింది. వెంటనే పడవ వారు వెళ్ళిపోతున్న స్థలం చేరింది.
[22] మరుసటి రోజున సరస్సు అవతల నిలిచి ఉన్న ప్రజలకు ఈ విషయం తెలిసింది: ఆయన శిష్యులు ఎక్కిన పడవ తప్ప మరొకటి అక్కడ లేదు, యేసు తన శిష్యులతో కూడా ఆ పడవ ఎక్కలేదు. శిష్యులు మాత్రమే వెళ్ళిపోయారు.
[23] అప్పుడు వేరే పడవలు తిబెరియ నుంచి వచ్చాయి. యేసు కృతజ్ఞత అర్పించిన తరువాత వారు తిన్న స్థలం దగ్గరికి అవి వచ్చాయి.
[24] ఆ గుంపుకు యేసు గానీ ఆయన శిష్యులు గానీ అక్కడ కనబడకపోవడం చేత వారా పడవలెక్కి యేసును వెదకుతూ కపెర్‌నహూం వచ్చారు.
[25] సరస్సు అవతల ఆయన కనబడ్డప్పుడు వారు ఆయనను “గురువర్యా! మీరెప్పుడు ఇక్కడికి వచ్చారు?” అని అడిగారు.
[26] యేసు వారికిలా జవాబిచ్చాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మీరు నన్ను ఎందుకు వెదుకుతున్నారంటే, సూచనకోసమైన అద్భుతాలు చూచినందుకు కాదు గానీ మీరు కడుపారా ఆ రొట్టెలు తిన్నందుకే.
[27] చెడిపోయే ఆహారం కోసం కష్టపడకండి. శాశ్వత జీవానికి నిలిచి ఉండే ఆహారంకోసం కష్టపడండి. ఇది మానవ పుత్రుడు మీకు ప్రసాదిస్తాడు. ఎందుకంటే, తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేశాడు.”
[28] అందుకు వారు ఆయనను “దేవుని క్రియలు జరిగించడానికి మేమేం చేయాలి?” అని అడిగారు.
[29] “దేవుని క్రియ అంటే ఆయన పంపినవాణ్ణి మీరు నమ్మడమే” అని యేసు వారికి బదులు చెప్పాడు.
[30] అందుచేత వారు ఆయనతో ఇలా అన్నారు: “అలాంటప్పుడు మేము చూచి మిమ్మల్ని నమ్మడానికి మీరు సూచనగా ఏ అద్భుతం చేస్తారు? ఏ క్రియ జరిగిస్తారు?
[31] మన పూర్వీకులు ఎడారిలో మన్నా తిన్నారు. ‘ఆయన ఆకాశంనుంచి వారికి ఆహారం ప్రసాదించాడు’ అని రాసి ఉంది గదా.”
[32] అందుకు యేసు “మీకు ఖచ్చితంగా చెపుతున్నాను, ఆకాశంనుంచి మీకు ఆహారమిచ్చినది మోషే కాదు గానీ నా తండ్రి పరలోకంనుంచి నిజమైన ఆహారం మీకిస్తున్నాడు.
[33] దేవుడు ఇచ్చే ఆహారం ఏమిటంటే, పరలోకంనుంచి దిగివచ్చి లోకానికి జీవం ఇచ్చేవాడే” అని వారితో అన్నాడు.
[34] కనుక వారు ఆయనతో “ప్రభూ! ఆ ఆహారం మాకు ఎప్పటికీ ఇస్తూ ఉండండి” అన్నారు.
[35] యేసు వారికిలా చెప్పాడు: “జీవాహారం నేనే. నా దగ్గరకు వచ్చే వ్యక్తికి ఆకలి ఎన్నడూ కాదు, నా మీద నమ్మకం ఉంచిన వ్యక్తికి దాహం ఎన్నడూ కాదు.
[36] అయినా మీరు నన్ను చూచి కూడా నమ్మలేదని మీతో చెప్పాను.
[37] “తండ్రి నాకు ఇచ్చిన వారందరూ నా దగ్గరకు వస్తారు. నా దగ్గరకు వచ్చే వ్యక్తిని నేనెన్నడూ బయటికి త్రోసివేయను.
[38] నన్ను పంపినవాని సంకల్పం నెరవేర్చడానికే నేను పరలోకం నుంచి దిగివచ్చాను గాని నా సొంత సంకల్పం నెరవేర్చడానికి కాదు.
[39] నన్ను పంపిన తండ్రి సంకల్పం ఏమంటే, ఆయన నాకు ఇచ్చిన దాన్నంతటిలోనూ నేను దేన్నీ పోగొట్టుకోకుండా చివరి రోజున దాన్ని లేపడమే.
[40] నన్ను పంపినవాని సంకల్పం ఇదే: కుమారుణ్ణి చూచి ఆయన మీద నమ్మకం ఉంచే ప్రతి ఒక్కరూ శాశ్వత జీవం పొందాలి; చివరి రోజున నేను వారిని సజీవంగా లేపుతాను.”
[41] తాను పరలోకంనుంచి దిగివచ్చిన ఆహారాన్ని అన్నందుకు ఆయనను గురించి యూదులు సణుక్కొన్నారు.
[42] “ఈ యేసు యోసేపు కొడుకు గదా. అతని తల్లిదండ్రులు మనకు తెలిసినవారే గదా. ఇప్పుడితడు ‘నేను పరలోకంనుంచి దిగివచ్చాను’ అంటాడేమిటి!” అన్నారు.
[43] యేసు వారికిలా బదులు చెప్పాడు: “మీలో మీరు సణుక్కోకండి.
[44] నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించనిదే ఎవరూ నా దగ్గరకు రాలేరు. వారిని చివరి రోజున సజీవంగా లేపుతాను.
[45] ‘వారందరికీ దేవుడు ఉపదేశిస్తాడు’ అని ప్రవక్తల లేఖనంలో వ్రాసి ఉంది. అందుచేత తండ్రివల్ల విని నేర్చుకొనే ప్రతి ఒక్కరూ నా దగ్గరకు వస్తారు.
[46] దేవుని నుంచి వచ్చినవాడు తప్ప ఇంకెవరూ తండ్రిని చూడలేదు. ఆయన తండ్రిని చూశాడు.
[47] మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నామీద నమ్మకముంచినవారికి శాశ్వత జీవం ఉంది.
[48] జీవాహారాన్ని నేనే.
[49] ఎడారిలో మీ పూర్వీకులు మన్నా తిని కూడా చనిపోయారు.
[50] కానీ ఈ ఆహారం తిన్నవారు చావరు. పరలోకం నుంచి ఈ ఆహారం దిగివచ్చిన కారణం అదే.
[51] పరలోకంనుంచి దిగివచ్చిన సజీవమైన ఆహారాన్ని నేనే. ఈ ఆహారం ఎవరైనా తింటే శాశ్వతంగా జీవిస్తారు. లోకానికి జీవంకోసం నేను ఇవ్వబోయే ఆహారం నా శరీరమే!”
[52] అప్పుడు యూదులు “ఈ మనిషి తన శరీరాన్ని తినడానికి మనకు ఎట్లా ఇవ్వగలడు?” అంటూ ఒకరితో ఒకరు వాదించుకొన్నారు.
[53] కనుక యేసు వారితో ఇలా అన్నాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మీరు మానవ పుత్రుని శరీరం తినకపోతే, ఆయన రక్తం త్రాగకపోతే మీలో మీకు జీవం ఉండదు.
[54] నా శరీరం తిని నా రక్తం త్రాగినవాడెవడైనా శాశ్వత జీవం గలవాడు. చివరి రోజున నేను అతణ్ణి లేపుతాను.
[55] నా శరీరం నిజంగా ఆహారం, నా రక్తం నిజంగా పానీయం.
[56] నా శరీరం తిని నా రక్తం త్రాగినవాడు నాలో ఉంటాడు. నేను అతనిలో ఉంటాను.
[57] జీవం గల తండ్రి నన్ను ఎలా పంపాడో, నేను తండ్రి మూలంగా ఎలా జీవిస్తూ ఉన్నానో అలాగే నన్ను తిన్నవాడు నామూలంగా జీవిస్తూ ఉంటాడు.
[58] పరలోకం నుంచి దిగివచ్చిన ఆహారం ఇదే! మీ పూర్వీకులు మన్నా తిని చనిపోయినట్టు కాదు – ఈ ఆహారం తిన్నవాడు ఎప్పటికీ జీవిస్తాడు.
[59] ఆయన కపెర్‌నహూంలో ఉపదేశిస్తూ సమాజ కేంద్రంలో ఆ మాటలు చెప్పాడు.
[60] ఆయన శిష్యులలో చాలమంది అది విని “ఈ మాట కఠినమైనది. ఇది ఎవరు వినగలరు?” అన్నారు.
[61] తన శిష్యులు దానిని గురించి సణుగుకొంటూ ఉన్న సంగతి యేసుకు తెలుసు. కనుక ఆయన వారితో ఇలా అన్నాడు: “మీకు ఇది అభ్యంతరమా?
[62] అయితే మానవ పుత్రుడు మునుపున్న చోటికి పైకి వెళ్ళడం మీరు చూస్తే మీకెలా ఉంటుందో!
[63] జీవమిచ్చేది దేవుని ఆత్మ మాత్రమే. శరీరం ప్రయోజనమేమీ లేనిది. మీతో నేను చెప్పే మాటలు ఆత్మ సంబంధమైనవి, జీవం ఇచ్చేవి.
[64] కానీ మీలో కొందరు నమ్మడం లేదు.” నమ్మనివారెవరో తనను శత్రువులకు పట్టి ఇచ్చేవాడెవడో మొదటి నుంచి యేసుకు తెలుసు.
[65] ఆయన ఇంకా అన్నాడు “తండ్రి వారిని అనుగ్రహించనిదే ఎవరూ నా దగ్గరకు రాలేరని నేను చెప్పినది అందుకే.”
[66] అప్పటినుంచి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కు తగ్గి ఆయనతో మరెన్నడూ తిరగలేదు.
[67] అప్పుడు యేసు తన పన్నెండుమందితో “మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా?” అన్నాడు.
[68] సీమోను పేతురు ఆయనకు ఇలా జవాబిచ్చాడు: “ప్రభూ, మేము ఎవరిదగ్గరికి వెళ్తాం? నీవు శాశ్వత జీవ వాక్కులు గలవాడవు.
[69] అంతేకాక, అభిషిక్తుడవూ సజీవుడైన దేవుని కుమారుడవూ నీవే అని మేము నమ్ముతూ తెలుసుకొన్నాం.”
[70] “పన్నెండుగురైన మిమ్ములను ఎన్నుకొన్నాను గదా. మీలో ఒకడు పిశాచం” అని యేసు వారికి బదులు చెప్పాడు.
[71] ఆయన సీమోను కొడుకైన ఇస్కరియోతు యూదాను గురించి చెప్పాడు. ఎందుకంటే అతడు పన్నెండుగురిలో ఒకడై ఉండి, ఆయనను శత్రువులకు పట్టి ఇవ్వబోయేవాడు.