[1] అప్పుడు, పస్కా పండుగకు ముందు ఈ లోకాన్ని విడిచి తండ్రిదగ్గరకు వెళ్ళిపోవలసిన సమయం వచ్చిందని యేసుకు తెలుసు. లోకంలో ఉన్న తన సొంతవారిని ఆయన ప్రేమిస్తూ వారిని అంతంవరకూ ప్రేమతో చూశాడు.
[2] ఆయనను శత్రువులకు పట్టి ఇవ్వాలనే ఉద్దేశం అపనింద పిశాచం ఇంతకుముందే సీమోను కొడుకైన ఇస్కరియోతు యూదా హృదయంలో పుట్టించాడు. అప్పటికి సాయంకాల భోజనం చేయడం ముగిసింది.
[3] పరమ తండ్రి సమస్తమూ తన చేతికి అప్పగించాడనీ తాను దేవుని దగ్గరనుంచి వచ్చి దేవుని దగ్గరకు తిరిగి వెళ్ళిపోతాననీ యేసుకు తెలిసికూడా
[4] ఆయన భోజనపంక్తిలోనుంచి లేచి తన పైవస్త్రాలు విడిచి అవతల పెట్టి తువాలు తీసుకొని దానిని నడుముకు చుట్టుకొన్నాడు.
[5] అప్పుడు పళ్ళెంలో నీళ్ళు పోసి శిష్యుల పాదాలు కడుగుతూ నడుముకు చుట్టుకొన్న తువాలుతో తుడవసాగాడు.
[6] అలాగే ఆయన సీమోను పేతురు దగ్గరికి వచ్చాడు. అతడు ఆయనతో “ప్రభూ! నా పాదాలు కడుగుతావా?” అన్నాడు.
[7] అందుకు యేసు జవాబిస్తూ “నేను చేస్తున్నది ఇప్పుడు నీకు అర్థం కావడం లేదు గాని తరువాత నీకు తెలిసిపోతుంది” అని అతనితో చెప్పాడు.
[8] పేతురు “నీవు నా పాదాలు ఎన్నడూ కడగవు!” అని ఆయనతో అన్నాడు. యేసు “నేను నిన్ను కడుగకపోతే నీకు నాతో భాగం లేదు” అని అతనికి బదులు చెప్పాడు.
[9] సీమోను పేతురు “ప్రభూ! నా పాదాలు మాత్రమే గాక నా చేతులూ నా తల కూడా కడిగేయండి!” అని ఆయనతో అన్నాడు.
[10] యేసు అతనితో ఇలా అన్నాడు: “స్నానం చేసినవాడు తన పాదాలు మాత్రమే కడగాలి. వాడు కేవలం శుద్ధుడు. మీరు శుద్ధులే గాని మీలో ప్రతి ఒక్కడూ శుద్ధుడు కాదు.”
[11] తనను శత్రువులకు పట్టి ఇవ్వబోయే వాడెవడో ఆయనకు తెలుసు. కనుకనే “మీలో ప్రతి ఒక్కడూ శుద్ధుడు కాదు” అన్నాడు.
[12] వారి పాదాలు కడిగి తన పైవస్త్రాలు వేసుకొని మళ్ళీ కూర్చున్న తరువాత ఆయన వారితో ఇలా అన్నాడు: “నేను మీకు చేసినదాని భావం మీకు తెలుసా?
[13] మీరు నన్ను గురువు, ప్రభువు అంటారు. మీరలా అనడం సరిగానే ఉంది – అలాగే ఉన్నాను.
[14] ప్రభువుగా గురువుగా ఉన్న నేను మీ పాదాలు కడిగితే మీరూ ఒకరి పాదాలు ఒకరు కడగవలసినదే.
[15] నేను మీకు చేసిన ప్రకారం మీరూ చేయాలని మీకు ఆదర్శాన్ని చూపాను.
[16] మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, దాసుడు తన యజమానిని మించినవాడు కాడు. పంపేవాని కంటే పంపబడ్డవాడు మించినవాడు కాడు.
[17] మీరు ఈ విషయాలు తెలుసుకొంటే వీటి ప్రకారం చేస్తే మీరు ధన్యజీవులు.
[18] మీలో ప్రతి ఒక్కణ్ణి గురించి నేను చెప్పడం లేదు. నేను ఎన్నుకొన్నవారు నాకు తెలుసు. అయితే ఈ విధంగా లేఖనం నెరవేరాలి: రొట్టె నాతో తిన్నవాడు నాకు వ్యతిరేకంగా మడిమ ఎత్తాడు.
[19] ఇది జరిగినప్పుడు నేనే ‘ఉన్నవాడను’ అని మీరు నమ్మాలని ఇది జరగకముందే మీకు చెపుతున్నాను.
[20] మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నేను పంపేవారిని స్వీకరించేవాడు నన్నూ స్వీకరిస్తున్నాడు, నన్ను స్వీకరించేవాడు నన్ను పంపినవాణ్ణీ స్వీకరిస్తున్నాడు.”
[21] ఈ మాటలు చెప్పిన తరువాత యేసు తన ఆత్మలో ఆందోళన చెందాడు. “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మీలో ఒకడు నన్ను శత్రువులకు పట్టి ఇస్తాడు” అని సాక్ష్యం చెప్పాడు.
[22] ఆయన ఎవణ్ణి గురించి చెప్పాడో అని అనుమానంతో శిష్యులు ఒకరివైపు ఒకరు చూచుకోసాగారు.
[23] ఆయన శిష్యులలో ఒకడు – యేసు ప్రేమించినవాడు యేసు ఛాతీని ఆనుకొని ఉన్నాడు.
[24] అతనికి సీమోను పేతురు సైగ చేసి ఆయన ఎవణ్ణి గురించి చెప్పాడో అడగమని సూచించాడు.
[25] అతడు యేసు ఛాతీని ఆనుకొని ఉండి ఆయనను ఇలా అడిగాడు: “ప్రభూ, అతడెవడు?”
[26] అందుకు యేసు “ఎవరికి రొట్టె ముక్క ముంచి ఇస్తానో అతడే” అని జవాబిచ్చాడు. ఆ ముక్క ముంచి సీమోను కొడుకైన ఇస్కరియోతు యూదాకు ఇచ్చాడు.
[27] ఆ ముక్క తీసుకొన్న తరువాత సైతాను వానిలో చొరబడ్డాడు. అప్పుడు యేసు వానితో “నీవు చేసేది త్వరగా చెయ్యి!” అన్నాడు.
[28] ఆయన ఏ కారణంచేత వానికి అది చెప్పాడో భోజనానికి కూర్చుని ఉన్నవారిలో ఎవరికీ తెలియదు.
[29] డబ్బుసంచి యూదాదగ్గర ఉంది గనుక పండుగకోసం తమకు కావలసినవి కొనమని గానీ బీదలకు ఏమైనా ఇమ్మని గానీ యేసు వానితో చెప్పాడేమో అని కొందరు అనుకొన్నారు.
[30] వాడు ఆ ముక్క తీసుకోగానే బయటికి వెళ్ళాడు. అది రాత్రివేళ.
[31] వాడు బయటికి వెళ్ళినతరువాత యేసు ఈవిధంగా అన్నాడు: “ఇప్పుడు మానవ పుత్రునికి మహిమ చేకూరుతుంది, ఆయనమూలంగా దేవునికి కూడా మహిమ చేకూరుతుంది.
[32] ఆయనమూలంగా దేవునికి మహిమ చేకూరితే దేవుడు తనమూలంగా ఆయనను మహిమపరుస్తాడు, వెంటనే ఆయనను మహిమపరుస్తాడు.
[33] చిన్నపిల్లలూ! ఇంకా కొంత కాలమే మీతో ఉంటాను. మీరు నన్ను వెదకుతారు గాని నేను యూదులకు చెప్పినట్టు మీకూ చెపుతున్నాను, నేను వెళ్ళిపోయే స్థలానికి మీరు రాలేరు.
[34] ఒక క్రొత్త ఆజ్ఞ మీకిస్తున్నాను – మీరు ఒకరినొకరు ప్రేమతో చూచుకోవాలి. నేను మిమ్ములను ప్రేమతో చూచినట్టే మీరూ ఒకరినొకరు ప్రేమతో చూచుకోవాలి.
[35] మీరు ఒకరినొకరు ప్రేమతో చూచుకొంటే దాన్నిబట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొంటారు.”
[36] సీమోను పేతురు “ప్రభూ! ఎక్కడికి వెళ్ళిపోతున్నావు?” అని ఆయననడిగాడు. యేసు “నేను వెళ్ళే స్థలానికి నీవిప్పుడు నా వెంట రాలేవు. తరువాత నా వెంట వస్తావు” అని సమాధానం చెప్పాడు.
[37] పేతురు “ప్రభూ, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీకోసం నా ప్రాణం ధారపోస్తాను” అని ఆయనతో జవాబిచ్చాడు.
[38] యేసు “నీ ప్రాణం నాకోసం ధారపోస్తావా? నీతో ఖచ్చితంగా చెపుతున్నాను, నన్ను ‘ఎరగన’ని నీవు మూడు సార్లు చెప్పకముందే కోడి కూయదు” అన్నాడు.