Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:25

[1] “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, గొర్రెల దొడ్డిలోకి ద్వారంగుండా రాక వేరే విధంగా ఎక్కి వచ్చేవాడు దొంగ, దోపిడీగాడు.

[2] ద్వారంగుండా లోపలికి వచ్చేవాడు గొర్రెల కాపరి.

[3] ద్వారపాలకుడు ఆయనకు తలుపు తెరుస్తాడు. గొర్రెలు ఆయన స్వరం వింటాయి. తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు, బయటికి నడిపిస్తాడు.

[4] తన సొంత గొర్రెలను బయటికి తెచ్చినప్పుడు తాను వాటికి ముందు నడుస్తాడు. ఆ గొర్రెలకు ఆయన స్వరం తెలుసు గనుక అవి ఆయన వెంట వెళ్తాయి.

[5] పరాయివారి స్వరం వాటికి తెలియదు గనుక పరాయివాని వెంట వెళ్ళనే వెళ్ళవు. అసలు, అతని దగ్గర నుంచి పారిపోతాయి.”

[6] ఈ ఉదాహరణ యేసు వారితో చెప్పాడు గాని తమతో ఆయన చెప్పినవేవో వారికి అర్థం కాలేదు.

[7] అందుచేత యేసు వారితో మళ్ళీ ఇలా అన్నాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, గొర్రెలకు నేనే ద్వారాన్ని.

[8] నాకు ముందుగా వచ్చినవారంతా దొంగలు, దోపిడీదారులు. గొర్రెలు వారి మాట వినలేదు.

[9] నేను ద్వారాన్ని. నాద్వారా ఎవరైనా లోపలికి వస్తే అతనికి రక్షణ లభిస్తుంది. అతడు లోపలికి వస్తూ, బయటికి వెళ్తూ మేత కనుక్కొంటాడు.

[10] దొంగ వచ్చే కారణం దొంగతనం, హత్య, నాశనం చేయడానికే. మనుషులకు జీవం కలగాలనీ అది సమృద్ధిగా కలగాలనీ నేను వచ్చాను.

[11] నేను మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెలకోసం తన ప్రాణం ధారపోస్తాడు.

[12] జీతగాడు కాపరి కాడు. గొర్రెలు అతనివి కావు గనుక తోడేలు రావడం చూశాడంటే గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. తోడేలు వాటిని పట్టుకొంటుంది, చెదరగొట్టివేస్తుంది.

[13] జీతగాడు జీతగాడే గనుక పారిపోతాడు – గొర్రెల క్షేమం అంటే అతనికేమి పట్టదు.

[14] “నేను మంచి కాపరిని. నాకు నా గొర్రెలు తెలుసు, నా సొంత గొర్రెలకు నేను తెలుసు.

[15] తండ్రికి నేను తెలుసు. అలాగే నాకు తండ్రి తెలుసు. నా గొర్రెలకోసం నా ప్రాణం ధారపోస్తాను.

[16] ఈ దొడ్డిలో లేని వేరే గొర్రెలు కూడా నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తీసుకురావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు ఒకే మంద ఉంటుంది, ఒకే కాపరి ఉంటాడు.

[17] నా ప్రాణం మళ్ళీ తీసుకొనేలా దానిని ధారపోస్తాను, గనుక నేనంటే నా తండ్రికి ప్రేమ.

[18] నా నుంచి నా ప్రాణం ఎవరూ తీయరు. నా అంతట నేనే దానిని ధారపోస్తాను. దానిని ధారపోయడానికీ దానిని మళ్ళీ తీసుకోవడానికీ నాకు అధికారం ఉంది. నా తండ్రి నాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు.”

[19] ఆ మాటల కారణంగా యూదులలో మళ్ళీ విభేదం పుట్టింది.

[20] వారిలో చాలామంది ఇలా అన్నారు: “అతడు దయ్యం పట్టినవాడు, పిచ్చివాడు. అతడు మాట్లాడితే మీరు ఎందుకు వింటున్నారు?”

[21] మరి కొందరైతే “అతడివి దయ్యం పట్టినవాడి మాటలు కావు. దయ్యం గుడ్డివాళ్ళ కండ్లు తెరవగలదా ఏమిటి?” అన్నారు.

[22] అప్పుడు జెరుసలంలో ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది.

[23] అది చలికాలం. యేసు దేవాలయంలో ఉన్న ‘సొలొమోను మంటపం’లో నడుస్తున్నాడు.

[24] యూదులు ఆయన చుట్టూ పోగై ఆయనతో “ఎంతవరకు మమ్మల్ని ఇలా అనుమానంలో ఉంచుతావు? నీవే అభిషిక్తుడివి గనుక అయితే మాకు తేటగా చెప్పు!” అన్నారు.

[25] యేసు వారికిలా జవాబిచ్చాడు: “మీకు చెప్పాను గానీ మీరు నమ్మడం లేదు. నా తండ్రి పేర నేను చేస్తూ ఉన్న క్రియలు నన్ను గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాయి.

[26] అయితే మీరు నమ్మడం లేదు. ఎందుకంటే నేను మీతో చెప్పినట్టే మీరు నా గొర్రెలు కారు.

[27] నా గొర్రెలు నా స్వరం వింటారు. వారు నాకు తెలుసు. వారు నన్ను అనుసరిస్తారు.

[28] నేను వారికి శాశ్వత జీవం ఇస్తూ ఉన్నాను. వారు ఎన్నడూ నశించరు. వారిని నా చేతిలో నుంచి ఎవరూ ఎత్తుకుపోరు.

[29] వారిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. నా తండ్రి చేతిలోనుంచి వారిని ఎవరూ ఎత్తుకుపోలేరు.

[30] నేను, నా తండ్రి ఒకటే.”

[31] యూదులు మళ్ళీ ఆయన మీద రువ్వడానికి రాళ్ళు చేతపట్టుకొన్నారు.

[32] అయితే యేసు “నా తండ్రి నుంచి అనేక మంచి పనులు నేను మీకు చూపాను. ఆ పనుల్లో దేని కారణంగా మీరు నామీద రాళ్ళు రువ్వుతున్నట్టు?” అని వారికి బదులు చెప్పాడు.

[33] “మంచి పనికి కాదు గానీ దేవదూషణకే మేము నీ మీద రాళ్ళు రువ్వుతాం. నీవు మనిషివే అయినా నిన్ను దేవుడుగా చేసుకుంటున్నందుకే” అని యూదులు ఆయనకు బదులు చెప్పారు.

[34] యేసు వారికిలా జవాబిచ్చాడు: “మీ ధర్మశాస్త్రంలో ‘మీరు దేవుళ్ళని నేను గదా చెప్పాను’ అని వ్రాసి ఉంది గదా.

[35] లేఖనం అర్థ రహితం కానే కాదు. దేవుని వాక్కు ఎవరి దగ్గరకు వచ్చిందో ఆయన వారిని దేవుళ్ళు అన్నాడూ అంటే,

[36] తండ్రి ప్రత్యేకించి లోకానికి పంపినవాడు ‘నేను దేవుని కుమారుణ్ణి’ అని చెప్పినందుచేత ‘నీవు దేవదూషణ చేస్తున్నావు’ అని మీరు అంటారా?

[37] నా తండ్రి క్రియలు నేను చేయకపోతే నన్ను నమ్మకండి.

[38] అవి నేను చేస్తూ ఉంటే, నన్ను నమ్మకపోయినా తండ్రి నాలో ఉన్నాడనీ నేను తండ్రిలో ఉన్నాననీ మీరు తెలుసుకొని నమ్మేలా ఆ క్రియలే నమ్మండి.”

[39] మరోసారి వారు ఆయనను పట్టుకోవడానికి చూశారు గానీ ఆయన వారి చేతికి చిక్కకుండా వెళ్ళాడు.

[40] అప్పుడాయన యొర్దాను అవతలికి, యోహాను మొట్టమొదట బాప్తిసం ఇచ్చిన స్థలానికి తిరిగి వెళ్ళి అక్కడ ఆగిపోయాడు.

[41] చాలామంది ఆయన దగ్గరికి వచ్చి “యోహాను అద్భుతమైన సూచన ఏదీ చేయలేదు గాని ఈయన విషయం అతడు చెప్పినదంతా నిజమే” అని చెప్పుకొన్నారు.

[42] అక్కడ చాలామంది ఆయనమీద నమ్మకం ఉంచారు.

యోహాను శుభవార్త — Chapters