[1] యేసు ఈ మాటలు చెప్పిన తరువాత తన శిష్యులతో కూడా కెద్రోను లోయ దాటివెళ్ళాడు. అక్కడ ఒక తోట ఉంది. ఆయన, ఆయన శిష్యులు దానిలోకి వెళ్ళారు.
[2] యేసు ఆయన శిష్యులను తరచుగా అక్కడ కలుసుకొనేవాడు గనుక ఆయనను శత్రువులకు పట్టి ఇచ్చే యూదాకు ఆ స్థలం తెలుసు.
[3] అప్పుడు యూదా, సైనికుల గుంపునూ ప్రధాన యాజులూ పరిసయ్యులూ పంపిన దేవాలయ ఉద్యోగులనూ కొందరిని అక్కడికి తీసుకువచ్చాడు. వారికి దివిటీలతో, దీపాలతో, ఆయుధాలు ఉన్నాయి.
[4] తనమీదికి జరగబోయేది అంతా తెలిసి యేసు ముందుకు వెళ్ళి “మీరు వెదకుతున్నది ఎవరిని?” అని వారితో అన్నాడు.
[5] “నజరేతువాడైన యేసును” అని వారు ఆయనకు జవాబిచ్చారు. యేసు వారితో “నేనే ఆయనను” అన్నాడు. ఆయనను పట్టి ఇచ్చే యూదా వారి మధ్య నిలబడి ఉన్నాడు.
[6] యేసు “నేనే ఆయనను” అనగానే వారు వెనక్కు తగ్గి నేలమీద పడిపోయారు.
[7] “మీరు వెదకుతున్నది ఎవరిని?” అని ఆయన వారిని మళ్ళీ అడిగాడు. వారు “నజరేతువాడైన యేసును” అన్నారు.
[8] “నేనే ఆయనని మీకు చెప్పాను గదా. నన్నే గనుక మీరు వెదకుతూ ఉంటే వీరిని వెళ్ళిపోనియ్యండి” అని యేసు బదులు చెప్పాడు.
[9] నీవు నాకు ఇచ్చిన వారిలో నేను ఎవరినీ పోగొట్టుకోలేదు అని ఆయన చెప్పిన మాట నెరవేరేందుకు అలా అన్నాడు.
[10] సీమోను పేతురు దగ్గర ఖడ్గం ఉంది. దానిని ఒరనుంచి దూసి అతడు ప్రముఖయాజి సేవకుణ్ణి కొట్టి అతడి కుడిచెవి తెగనరికాడు (ఆ సేవకుడి పేరు మల్కు).
[11] “ఖడ్గం ఒరలో పెట్టు. తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోది నేను త్రాగనా?” అని యేసు పేతురుతో చెప్పాడు.
[12] అప్పుడు ఆ సైనికుల గుంపు, వారి అధిపతి, యూదుల ఉద్యోగులు ఆయనను పట్టుకొని బంధించారు.
[13] మొట్టమొదట కయపకు మామ అయిన అన్నా అనేవాడి దగ్గరికి ఆయనను తీసుకువెళ్ళారు. ఆ సంవత్సరం కయప ప్రముఖ యాజిగా ఉన్నాడు.
[14] ప్రజలకోసం ఒక్కడే చావడం మేలు అని యూదులకు సలహా చెప్పినది ఈ కయపే.
[15] సీమోను పేతురు, మరో శిష్యుడు యేసువెంట వెళ్ళారు. ఆ శిష్యుడు ప్రముఖ యాజికి తెలుసు, గనుక ప్రముఖయాజి ముంగిటిలోకి యేసు వెంట వెళ్ళాడు.
[16] పేతురైతే బయట ద్వారం దగ్గర నిలిచాడు. అందుచేత ప్రముఖ యాజికి తెలిసిన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారానికి కాపలా ఉన్న ఆమెతో మాట్లాడి పేతురును లోపలికి తెచ్చాడు.
[17] ద్వారం కావలి కాస్తున్న ఆ పనిపిల్ల పేతురుతో “మీరు కూడా ఆ మనిషి శిష్యులలో ఒకరు కదూ!” అంది. అతడు “కాను” అన్నాడు.
[18] దేవాలయం ఉద్యోగులూ పని మనుషులూ అక్కడ నిలబడి ఉన్నారు. చలిగా ఉంది గనుక మంట వేసుకొని చలికాచుకొంటున్నారు. పేతురు వారితో నిలుచుండి చలికాచుకొంటున్నాడు.
[19] ఇంతలో, ప్రముఖయాజి ఆయన ఉపదేశాన్ని గురించీ శిష్యులను గురించీ యేసును ప్రశ్నించాడు.
[20] యేసు అతడికిలా జవాబిచ్చాడు: “నేను బాహాటంగా లోకానికి చెప్పాను. యూదులు ఎప్పుడూ సమకూడే సమాజ కేంద్రాలలో, దేవాలయంలో ఉపదేశం చేశాను. చాటుగా నేనేమీ చెప్పలేదు.
[21] మీరు నన్ను ప్రశ్నించడమెందుకు? నా బోధ విన్నవారిని నేను వారికి చెప్పిన దాని గురించి అడుగు. నేను చెప్పినది వారికి తెలుసు.
[22] ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు, దగ్గర నిలుచున్న అధికారి ఒకడు ఆయనను అరచేతితో చెంపదెబ్బ కొట్టి “ప్రముఖ యాజికి ఇలా జవాబిస్తున్నావేమిటి!” అన్నాడు.
[23] యేసు జవాబిస్తూ “నేను చెప్పినదానిలో దోషం ఉంటే ఆ దోషం ఏదో సాక్ష్యం చెప్పు. అది సరిగా ఉంటే నన్ను కొట్టడం ఎందుకు?” అన్నాడు.
[24] అప్పుడు అన్నా ఆయనను కట్లతోనే ప్రముఖయాజి అయిన కయప దగ్గరకు పంపాడు.
[25] సీమోను పేతురు ఇంకా నిలుచుండి చలి కాచుకొంటున్నాడు. అక్కడున్నవారు అతనితో “మీరు కూడా ఆయన శిష్యులలో ఒకరు కారా?” అన్నారు. అతడు ఒప్పుకోలేదు, “నేను కాదు” అన్నాడు.
[26] పేతురు ఎవడి చెవి నరికివేశాడో అతడి చుట్టాల్లో ఒకడు ప్రముఖయాజికి సేవకుడుగా ఉన్నాడు. అతడు పేతురుతో “మీరు తోటలో ఆయనతో ఉండడం నేను చూడలేదా?” అన్నాడు.
[27] మరోసారి పేతురు కాదన్నాడు. తక్షణమే కోడి కూసింది.
[28] యూదులు యేసును కయప దగ్గరనుంచి రోమన్ అధిపతి భవనానికి తీసుకువెళ్ళారు. అప్పటికి ఉదయం అయింది. వారు మాత్రం అపవిత్రం కాకుండేలా భవనంలో ప్రవేశించలేదు. ఎందుకంటే, పస్కాను తినాలని ఉన్నారు.
[29] అందుచేత రోమన్ అధిపతి పిలాతు బయటికి వారిదగ్గరకు వచ్చి “ఈ మనిషిపై మీరు మోపే నేరం ఏమిటి?” అని అడిగాడు.
[30] “ఇతడు నేరస్థుడు కాకపోతే ఇతణ్ణి మీకు అప్పగించేవారం కాము” అని వారు అతనికి బదులు చెప్పారు.
[31] పిలాతు వారితో “మీరే అతణ్ణి తీసుకువెళ్ళి మీ ధర్మశాస్త్రం ప్రకారం అతనికి తీర్పు తీర్చండి” అన్నాడు. అందుకు యూదులు అతనితో “ఎవరికీ మరణశిక్ష విధించడానికి మాకు అధికారం లేదు” అన్నారు.
[32] తాను ఎలాంటి మరణానికి గురి అవుతాడో దాని విషయం యేసు సూచించి చెప్పిన మాట నెరవేరేలా అది జరిగింది.
[33] అప్పుడు పిలాతు అధిపతి భవనంలోకి మళ్ళీ వెళ్ళి యేసును పిలిపించి ఆయనను ఇలా అడిగాడు: “యూదులకు రాజువు నీవేనా?”
[34] “మీ అంతట మీరే ఆ మాట అంటున్నారా? లేదా, ఇతరులు నా విషయం మీతో చెప్పారా?” అని యేసు అతనికి జవాబిచ్చాడు.
[35] “నేను యూదుడినా ఏం! నాకు నిన్ను అప్పగించినది నీ సొంత ప్రజలే, ప్రధాన యాజులే గదా. నీవు చేసినది ఏమిటి?” అని పిలాతు బదులు చెప్పాడు.
[36] యేసు ఇలా జవాబిచ్చాడు: “నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదే గనుక అయితే నన్ను యూదులకు పట్టి ఇవ్వడం జరగకుండా నా సేవకులు పోరాడేవారే. కానీ ఇప్పుడు నా రాజ్యం ఇక్కడిది కాదు.”
[37] అందుకు పిలాతు “అయితే నీవు రాజువా?” అని ఆయనను అడిగాడు. యేసు జవాబిస్తూ “నేను రాజునని మీరు చెప్పిన మాట నిజమే. సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పడానికి నేను జన్మించాను, ఈ కారణం చేత ఈ లోకానికి వచ్చాను. నేను చెప్పేదానిని సత్యంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ నా స్వరం వింటారు” అన్నాడు.
[38] అందుకు పిలాతు “సత్యం అంటే ఏమిటి?” అని ఆయనతో అన్నాడు. అలా అని బయటికి యూదుల దగ్గరికి తిరిగి వెళ్ళి “అతనిలో ఎలాంటి దోషమూ నాకు కనిపించలేదు.
[39] అయితే పస్కా పండుగలో నేను ఎవడైనా ఒక ఖైదీని మీకు విడుదల చేసే వాడుక మీకు ఉంది గదా. నేను యూదుల రాజును మీకు విడుదల చేయడం మీకిష్టమా?”
[40] అందుకు వారు “ఈ మనిషిని కాదు, బరబ్బను విడుదల చేయండి” అని మళ్ళీ అరిచారు. బరబ్బ బందిపోటు దొంగ.