Skip to content
Opens in a new window
Listen to this chapter • 8:25

[1] ఆ తరువాత యేసు గలలీలో సంచారం చేస్తూ ఉన్నాడు. యూదులు తనను చంపడానికి చూస్తూ ఉండడంచేత ఆయనకు యూదయలో సంచారం చేయడం ఇష్టం లేకపోయింది.

[2] అయితే యూదుల పర్ణశాలల పండుగ దగ్గర పడ్డప్పుడు

[3] ఆయన తమ్ముళ్ళు ఆయనతో ఇలా అన్నారు: “నువ్వు చేస్తూ ఉన్న పనులు నీ శిష్యులు చూచేట్టు ఇక్కడనుండి యూదయకు వెళ్ళిపో.

[4] ఎవడైనా బహిరంగంగా ప్రసిద్ధికెక్కాలంటే రహస్యంగా పనులు జరిగించడు. నువ్వు ఈ పనులు చేస్తూ ఉంటే నిన్ను నువ్వు లోకానికి కనపరచుకో!”

[5] ఎందుకంటే, ఆయన సొంత తమ్ముళ్ళు కూడా ఆయన మీద నమ్మకం ఉంచలేదు.

[6] అందుచేత యేసు వారికిలా చెప్పాడు: “నా సమయం ఇంకా రాలేదు. మీ సమయం ఎప్పుడూ సిద్ధమే.

[7] లోకం మిమ్ములను ద్వేషించడం అసాధ్యం. కానీ నేను దాని క్రియలు చెడ్డవని దానిని గురించి సాక్ష్యం చెపుతూ ఉన్నాను, గనుక దానికి నా మీద ద్వేషం ఉంది.

[8] మీరు ఈ పండుగకు వెళ్ళండి. నా సమయం ఇంకా సంపూర్తి కాలేదు గనుక ఇప్పుడే ఈ పండుగకు వెళ్ళను.”

[9] ఆయన వారికిలా చెప్పిన తరువాత గలలీలో ఉండిపోయాడు.

[10] ఆయన తమ్ముళ్ళు పండుగకు వెళ్ళిన తరువాతే ఆయన కూడా వెళ్ళాడు – బహిరంగంగా కాదు గాని రహస్యంగా.

[11] ఆ పండుగలో యూదులు “ఆయనెక్కడ ఉన్నాడు?” అని అడుగుతూ ఆయనను వెతుకుతూ ఉన్నారు.

[12] ప్రజలలో ఆయనను గురించి చాలా సణుగుడు ఉంది. కొంతమంది “ఆయన మంచివాడు” అన్నారు, మరి కొందరు “కాదు. ప్రజల్ని మోసగించి తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు” అన్నారు.

[13] అయితే యూదులకు భయపడి ఆయనను గురించి ఎవరూ బహిరంగంగా మాట్లాడలేదు.

[14] పండుగ రోజుల మధ్య యేసు దేవాలయానికి వెళ్ళి ఉపదేశం చేయసాగాడు.

[15] “విద్యాభ్యాసం లేని ఈ మనిషికి పాండిత్యం ఎక్కడిది?” అంటూ యూదులు చాలా ఆశ్చర్యపడ్డారు.

[16] యేసు వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు: “నేను చేసే ఉపదేశం నాది కాదు గాని నన్ను పంపినవానిది.

[17] దేవుని ఇష్టప్రకారం చేయడానికి ఎవరైనా ఇష్టపడితే ఈ ఉపదేశం ఆయనదో, లేక నా అంతట నేనే చెపుతున్నానో తెలుసుకొంటారు.

[18] “తనంతట తానే మాట్లాడేవాడు సొంత గౌరవం చేకూరాలని చూస్తూ ఉంటాడు, గాని తనను పంపినవానికే గౌరవం చేకూరాలని చూచేవాడు సత్యవంతుడు. ఆయనలో అన్యాయం ఏమీ లేదు.

[19] మోషే మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు గదా. అయినా మీలో ఎవరూ ధర్మశాస్త్రం ఆచరణలో పెట్టడం లేదు. మీరెందుకు నన్ను చంపడానికి చూస్తూ ఉన్నారు?”

[20] “దయ్యం పట్టినవాడివి నీవు. నిన్ను చంపడానికి ఎవరు చూస్తున్నారు?” అని ఆ ప్రజలు జవాబిచ్చారు.

[21] యేసు వారికి ఇలా బదులు చెప్పాడు: “నేను ఒక క్రియ చేసినందుకు మీరంతా ఆశ్చర్యపడుతూ ఉన్నారు.

[22] మోషే మీకు సున్నతి అనే సంస్కారం నియమించాడు. అది మోషే నుంచి వచ్చినది కాదు గాని పూర్వీకుల ద్వారా కలిగింది. మీరు విశ్రాంతి దినాన ఒక మనిషికి సున్నతి జరిగిస్తారు.

[23] మోషే ధర్మశాస్త్రం మీరకూడదని విశ్రాంతి దినాన ఒక మనిషి సున్నతి పొందితే విశ్రాంతి దినాన నేను ఒక మనిషిని పూర్తిగా బాగు చేసినందుకు మీరు నా మీద కోపపడుతున్నారేమిటి?

[24] బయటికి కనిపించేదాన్ని బట్టి నిర్ణయానికి రాకండి. న్యాయ సమ్మతంగా నిర్ణయం చేసుకోండి.”

[25] అప్పుడు జెరుసలం వారిలో కొందరు ఇలా చెప్పుకొన్నారు: “వాళ్ళు చంపాలని చూస్తున్నవాడు ఈయనే గదా!

[26] ఇడుగో! ఆయన బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నాడు గాని వాళ్ళు ఆయనను ఏమీ అనరు! ఈయన నిజంగా అభిషిక్తుడు అని అధికారులకు తెలిసిపోయిందా ఏమిటి?

[27] కానీ ఈ మనిషి ఎక్కడివాడో మనకు తెలుసు. అభిషిక్తుడు వచ్చేటప్పుడు ఆయన ఎక్కడనుంచి వస్తాడో ఎవరికీ తెలీదు.”

[28] అందుచేత యేసు దేవాలయంలో ఉపదేశిస్తూ బిగ్గరగా ఇలా అన్నాడు: “నేను మీకు తెలుసు, నేనెక్కడినుంచి వచ్చానో అది కూడా మీకు తెలుసు. నా అంతట నేనే రాలేదు. నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఆయనను మీరెరుగరు.

[29] నేనైతే ఆయనను ఎరుగుదును. నేను వచ్చినది ఆయన దగ్గరనుంచే. నన్ను పంపినది ఆయనే.”

[30] అందుచేత వాళ్ళు ఆయనను పట్టుకోవడానికి చూశారు గానీ ఆయన సమయం ఇంకా రాకపోవడం వల్ల ఆయన ఎవరి చేతికీ చిక్కలేదు.

[31] ప్రజలలో అనేకులు ఆయనమీద నమ్మకం ఉంచారు, “అభిషిక్తుడు వచ్చేటప్పుడు ఈయనకంటే ఎక్కువ సూచకమైన అద్భుతాలు చేస్తాడా?” అన్నారు.

[32] ఆయనను గురించి ఈ విషయాలు ప్రజల గుంపు గుసగుసలాడడం పరిసయ్యులు విన్నారు గనుక ప్రధాన యాజులూ పరిసయ్యులూ ఆయనను పట్టుకోవడానికి భటులను పంపారు.

[33] యేసు వారితో “ఇంకా కొద్ది కాలమే నేను మీతో ఉంటాను. తరువాత నన్ను పంపినవాని దగ్గరికి వెళ్ళిపోతాను.

[34] మీరు నన్ను వెదుకుతారు గాని నన్ను కనుక్కోరు. నేనెక్కడ ఉంటానో మీరు అక్కడికి రాలేరు” అన్నాడు.

[35] అందుకు యూదులు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకొన్నారు: “మనం ఇతణ్ణి కనుక్కోకుండా ఎక్కడికి వెళ్ళిపోవాలని ఉద్దేశిస్తున్నాడు? గ్రీస్ దేశస్థుల మధ్య చెదరిపోయిన యూదుల దగ్గరికి వెళ్ళి గ్రీస్‌వారికి ఉపదేశం ఇవ్వాలనుకుంటున్నాడా ఏమిటి?

[36] ‘మీరు నన్ను వెతుకుతారు గాని నన్ను కనుక్కోరు. నేనెక్కడ ఉంటానో మీరు అక్కడికి రాలేరు’ అని అతడు చెప్పిన మాట ఏమిటి?”

[37] ఆ పండుగలో చివరి రోజున – ఆ మహా దినాన యేసు నిలబడి బిగ్గరగా ఇలా చెప్పాడు: “ఎవరైనా దప్పిగొంటే నా దగ్గరకు వచ్చి దప్పి తీర్చుకోవాలి.

[38] నా మీద నమ్మకం ఉంచే వ్యక్తి అంతరంగంలో నుంచి జీవ జల నదులు పారుతాయి. ఇది లేఖనాలు చెప్పిన ప్రకారమే.”

[39] ఆయనమీద నమ్మకం ఉంచుతున్నవారు పొందబోయే దేవుని ఆత్మను గురించి ఆయన ఆ మాట చెప్పాడు. అప్పటికి యేసు ఇంకా మహిమాస్థితి పొందలేదు గనుక పవిత్రాత్మను అనుగ్రహించడం ఇంకా జరుగలేదు.

[40] ఆ మాటలు విని జనసమూహంలో అనేకులు “నిజంగా ఈయనే ఆ ప్రవక్త” అన్నారు.

[41] మరి కొందరు “ఈయనే అభిషిక్తుడు” అన్నారు. మరి కొంతమంది “కానీ అభిషిక్తుడు గలలీలోనుంచి రాడు గదా!

[42] అభిషిక్తుడు దావీదు సంతానంలో నుంచి వస్తాడనీ దావీదు ఉండిన బేత్‌లెహేం గ్రామం నుండి వస్తాడనీ లేఖనం చెప్పలేదా?” అన్నారు.

[43] ఈ విధంగా ప్రజలలో ఆయనను గురించి విభేదం పుట్టింది.

[44] వారిలో కొందరు ఆయనను పట్టుకోవాలని కోరారు గాని ఆయన ఎవరి చేతికీ చిక్కలేదు.

[45] ఆ భటులు ప్రధాన యాజుల దగ్గరికీ పరిసయ్యుల దగ్గరికీ వచ్చినప్పుడు వీరు “అతణ్ణి మీరెందుకు తీసుకురాలేదు?” అని వారిని అడిగారు.

[46] భటులు “ఈ మనిషి మాట్లాడే విధంగా ఏ మనిషీ ఎన్నడూ మాట్లాడలేదు” అని జవాబిచ్చారు.

[47] అందుకు పరిసయ్యులు వారికి ఇలా బదులు చెప్పారు: “మీరు కూడా మోసపోయారా ఏమిటి?

[48] అధికారులలో గానీ పరిసయ్యులలో గానీ ఎవరూ అతణ్ణి నమ్మలేదు గదా.

[49] అయితే ధర్మశాస్త్రం తెలియని ఈ మూకమీద శాపం ఉందన్నమాట!”

[50] రాత్రివేళ ఆయన దగ్గరకు వచ్చిన నీకొదేము వారిలో ఒకడు. అతడు వారితో

[51] “ఒక మనిషి ప్రతివాదం విని ఆయన చేసేది ఏమిటో తెలుసుకోకముందే మన ధర్మశాస్త్రం ఆయనకు తీర్పు తీర్చదు గదా!” అన్నాడు.

[52] వారు “నువ్వు కూడా గలలీవాడివా? లేఖనాలను విచారించి చూడు – గలలీలో ప్రవక్త ఎవ్వడూ బయలు దేరలేదు” అని అతనికి బదులు చెప్పారు.

[53] అప్పుడు ఎవరి ఇంటికి వారు వెళ్ళారు.

యోహాను శుభవార్త — Chapters