Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:21

[1] పరిసయ్యులలో నీకొదేము అనే పేరు గల మనిషి ఉన్నాడు. అతడు యూదులకు ఒక అధికారి.

[2] ఈ మనిషి రాత్రివేళ యేసు దగ్గరికి వచ్చి ఆయనతో ఇలా అన్నాడు: “గురువర్యా, మీరు దేవుని దగ్గరనుంచి వచ్చిన ఉపదేశకులని మాకు తెలుసు. ఎందుకంటే దేవుని తోడ్పాటు ఉంటేనే తప్ప మీరు చేసే సూచకమైన అద్భుతాలు ఎవరూ చేయలేరు.”

[3] అందుకు యేసు జవాబిస్తూ “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, క్రొత్తగా జన్మించితేనే తప్ప ఎవరూ దేవుని రాజ్యాన్ని చూడలేరు” అని అతనితో చెప్పాడు.

[4] నీకొదేము ఆయనతో “ముసలితనంలో ఉన్న మనిషి ఎలా జన్మించగలడు? అతడు రెండో సారి తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టలేడు గదా!” అన్నాడు.

[5] యేసు ఇలా జవాబిచ్చాడు: “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, ఒకడు నీళ్ళమూలంగా, దేవుని ఆత్మమూలంగా జన్మిస్తేనే తప్ప అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు.

[6] శరీరం మూలంగా పుట్టినది శరీరం. దేవుని ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మ.

[7] మీరు క్రొత్తగా జన్మించాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడకండి.

[8] గాలి ఎటు వీచాలని ఉంటే అటు వీస్తుంది. దాని శబ్దం మీకు వినబడుతుంది గాని అది ఎక్కడనుంచి వస్తుందో, ఎక్కడికి పోతుందో మీకు తెలియదు. దేవుని ఆత్మమూలంగా జన్మించిన ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారు.”

[9] “ఈ విషయాలు ఎలా సాధ్యం?” అని నీకొదేము ఆయనకు చెప్పిన జవాబు.

[10] యేసు అతనికిలా సమాధానం చెప్పాడు: “మీరు ఇస్రాయేల్ ప్రజలకు ఉపదేశకులై ఉండి కూడా ఈ విషయాలు గ్రహించరా?

[11] మీతో ఖచ్చితంగా చెపుతున్నాను, మాకు తెలిసినవే చెపుతాం, చూచినవాటిని గురించే సాక్ష్యం చెపుతాం. మా సాక్ష్యం మీరు అంగీకరించడం లేదు.

[12] నేను ఈ లోక సంబంధమైన విషయాలు చెప్పినప్పుడు మీరు నమ్మకపోతే నేను పరలోక సంబంధమైన విషయాలు చెపితే ఎలా నమ్ముతారు?

[13] పరలోకంనుంచి వచ్చినవాడు, అంటే పరలోకంలో ఉన్న మానవ పుత్రుడు తప్ప ఇంకెవరూ పరలోకానికి ఎక్కలేదు.

[14] “ఎడారిలో మోషే కంచు పామును పైకెత్తినట్టే మానవపుత్రుణ్ణి పైకెత్తడం తప్పనిసరి.

[15] ఆయన మీద నమ్మకం ఉంచేవారెవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందేలా ఈ విధంగా జరగాలి.

[16] “దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒకే ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుని మీద నమ్మకం ఉంచేవారెవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందాలని ఇందులో దేవుని ఉద్దేశం.

[17] “తన కుమారుని ద్వారా లోకానికి విముక్తి, రక్షణ లభించాలని దేవుడు ఆయనను లోకంలోకి పంపాడు గాని లోకానికి శిక్ష విధించడానికి కాదు.

[18] ఆయన మీద నమ్మకం ఉంచేవానికి శిక్షావిధి లేదు. నమ్మకం పెట్టనివానికి ఇంతకు ముందే శిక్ష విధించడం జరిగింది. ఎందుకంటే అతడు దేవుని ఒకే ఒక కుమారుని పేరుమీద నమ్మకం పెట్టలేదు.

[19] ఆ శిక్షావిధికి కారణం ఇదే – వెలుగు లోకంలోకి వచ్చింది గాని తమ క్రియలు చెడ్డవి అయి ఉండడం వల్ల మనుషులకు ప్రీతిపాత్రమైనది చీకటే, వెలుగు కాదు.

[20] దుర్మార్గత చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికీ వెలుగు అంటే గిట్టదు. తన పనులు బయటపడుతాయేమో అని అలాంటివాడు వెలుగు దగ్గరికి రాడు.

[21] గానీ సత్యాన్ని అనుసరించి చేసేవాడు తన పనులు దేవుని మూలంగా జరిగాయని వెల్లడి అయ్యేలా వెలుగు దగ్గరికి వస్తాడు.”

[22] ఆ తరువాత యేసు, ఆయన శిష్యులు యూదయ ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ ఆయన వారితో కొంత కాలం గడుపుతూ బాప్తిసం ఇప్పిస్తూ ఉన్నాడు.

[23] సాలీము దగ్గర ఉన్న ఐనోనులో చాలా నీళ్ళు ఉన్నాయి గనుక యోహాను కూడా అక్కడ బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. ప్రజలు అక్కడికి వచ్చి బాప్తిసం పొందుతూ ఉన్నారు.

[24] యోహానును ఇంకా చెరసాలలో వేయడం జరగలేదు.

[25] యోహాను శిష్యులకూ యూదులకూ మధ్య శుద్ధి ఆచారాల గురించిన వివాదం పుట్టింది.

[26] వారు యోహాను దగ్గరికి వచ్చి “గురువర్యా! మునుపు యొర్దాను అవతల నీతో ఉన్నవాడు – నీవు సాక్ష్యం చెప్పిన ఆ వ్యక్తి – ఇప్పుడు బాప్తిసం ఇస్తూ ఉన్నాడు, అందరూ ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు” అన్నారు.

[27] యోహాను ఇలా సమాధానం చెప్పాడు: “పరలోకం నుంచి ఇవ్వడం జరిగితే తప్ప ఏ మనిషికీ ఏమీ లభించదు.

[28] నేను క్రీస్తును కాననీ ఆయనకు ముందుగా పంపబడ్డవాణ్ణనీ నేను చెప్పినట్టు మీరే సాక్షులు.

[29] పెండ్లి కుమారునికే పెండ్లి కుమార్తె ఉంటుంది. అయితే పెండ్లి కుమారుని స్నేహితుడు నిలబడి పెండ్లి కుమారుని స్వరం విన్నప్పుడు ఆ స్వరాన్ని బట్టి అధికంగా సంతోషిస్తాడు. అలాగే నా సంతోషం సంపూర్ణం అయింది.

[30] ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి.

[31] “పైనుంచి వచ్చినవాడు అందరికీ పైవాడే. భూమినుంచి వచ్చినవాడు భూమికి చెందినవాడు, భూమి నుంచి వచ్చినట్టు మాట్లాడుతాడు. పరలోకం నుంచి వచ్చినవాడు అందరికీ పైగా ఉన్నాడు.

[32] ఆయన చూచినవాటిని, విన్నవాటిని గురించి సాక్ష్యం చెప్తాడు గానీ ఆయన సాక్ష్యం ఎవరూ అంగీకరించడం లేదు.

[33] ఆయన సాక్ష్యం అంగీకరించినవాడు తద్వారా దేవుడు సత్యవంతుడని రూఢి చేస్తున్నాడు.

[34] దేవుడు పంపిన ఆయన దేవుని వాక్కులు పలుకుతాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు పరిమితంగా ఆత్మను ఇచ్చేవాడు కాడు.

[35] కుమారుణ్ణి తండ్రి ప్రేమిస్తున్నాడు, సమస్తమూ ఆయన చేతికి అప్పచెప్పాడు.

[36] కుమారుని మీద నమ్మకం ఉంచినవాడు శాశ్వత జీవం గలవాడు. కానీ కుమారుణ్ణి నమ్మడానికి నిరాకరించేవాడికి జీవం చూపుకు కూడా అందదు. దేవుని కోపం అతని మీద ఎప్పుడూ ఉంటుంది.”

యోహాను శుభవార్త — Chapters