Skip to content
Opens in a new window

[1] మోషే ఇస్రాయేల్ ప్రజలందరితో ఆ మాటలు చెప్పిన తరువాత వారితో ఇంకా అన్నాడు,

[2] “ఇప్పుడు నా వయసు నూట ఇరవై ఏండ్లు, ఇకనుంచి రాకపోకలు నేను చేయలేను. యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో చెప్పాడు.

[3] మీ దేవుడు యెహోవా తానే మీకు ముందుగా దాటిపోతాడు; అక్కడి జనాలను మీ ఎదుట లేకుండా నాశనం చేస్తాడు. మీరు వాళ్ళ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. యెహోవా చెప్పినట్టు యెహోషువ మీకు ముందుగా దాటిపోతాడు.

[4] తాను నాశనం చేసిన అమోరీవాళ్ళ రాజులు సీహోనుకూ, ఓగుకూ వాళ్ళ దేశానికీ ఏం చేశాడో అదే యెహోవా ఈ జనాలకు కూడా చేస్తాడు.

[5] యెహోవా వాళ్ళను మీ వశం చేస్తాడు. నేను మీకిచ్చే ఆజ్ఞల ప్రకారమే మీరు వాళ్ళకు చేయాలి.

[6] దృఢంగా ఉండండి! ధైర్యంగా ఉండండి! భయపడకండి! వాళ్ళను చూచి హడలిపోకండి, మీ దేవుడు యెహోవా తానే మీతోపాటు వస్తాడు, ఆయన మిమ్మల్ని చెయ్యి విడువడు. ఏమీ వదలిపెట్టడు.”

[7] అప్పుడు మోషే యెహోషువను పిలిచి ఇలా అన్నాడు: “నీవు దృఢంగా ఉండు! ధైర్యంగా ఉండు! ఈ ప్రజలకు ఇస్తానని వారి పూర్వీకులతో యెహోవా ప్రమాణం చేసిన దేశానికి వీరితోపాటు నీవు వెళ్తావు. వారు దానిని స్వాధీనం చేసుకొనేలా నీవు చేస్తావు.

[8] యెహోవా తానే నీకు ముందుగా వెళ్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. నిన్ను విడువడు. ఏమీ వదిలిపెట్టడు. నిర్భయంగా ఉండు! నిరుత్సాహపడకు!”

[9] మోషే ఈ ధర్మశాస్త్రం వ్రాసి యెహోవా యొక్క ఒడంబడిక పెట్టెను మోసే యాజులైన లేవీగోత్రికులకూ, ఇస్రాయేల్‌ప్రజల పెద్దలకూ ఇచ్చాడు.

[10] అప్పుడు వారికి ఈ ఆజ్ఞ జారీ చేశాడు. “ప్రతి ఏడో సంవత్సరంలో– అప్పులు రద్దుచేసే ఆ నియామక సంవత్సరంలో– పర్ణశాలల పండుగ సమయంలో,

[11] మీ దేవుడు యెహోవా ఎన్నుకొన్న స్థలంలో ఇస్రాయేల్ ప్రజలంతా ఆయన సన్నిధానంలో కనిపించడానికి వచ్చేటప్పుడు, వారందరి ఎదుట మీరు ఈ ధర్మశాస్త్రం చదివి వారికి వినిపించాలి.

[12] వారు విని నేర్చుకొని, మీ దేవుడైన యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఈ ధర్మశాస్త్ర వాక్కులన్నిటి ప్రకారం ప్రవర్తించేలా మీరు వారిని సమకూర్చాలి. పురుషులనూ, స్త్రీలనూ, పిల్లలనూ, మీ గ్రామాలలో నివసించే విదేశీయులనూ సమకూర్చాలి.

[13] ఈ విధంగా అంతకుముందు ధర్మశాస్త్రం తెలియని వారి పిల్లలు వినాలి, మీరు స్వాధీనం చేసుకోవడానికి యొర్దాను దాటిపోబొయ్యే దేశంలో మీరు బ్రతికే రోజులన్నీ వారు మీ దేవుడైన యెహోవాపట్ల భయభక్తులతో ప్రవర్తించడానికి నేర్చుకోవాలి.”

[14] ఆ తరువాత యెహోవా మోషేతో “ఇదిగో విను, నీవు చనిపోవలసిన రోజు దగ్గరపడింది. యెహోషువను పిలువు. నేను అతనికి ఆజ్ఞ జారీ చేసేలా మీరిద్దరూ వచ్చి సన్నిధిగుడారంలో నిలబడాలి” అన్నాడు. గనుక మోషే, యెహోషువ వెళ్ళి సన్నిధి గుడారంలో నిలబడ్డారు.

[15] అప్పుడు గుడారం పైగా మేఘస్తంభంలో యెహోవా ప్రత్యక్షమయ్యాడు. ఆ మేఘం గుడారం ద్వారం పైగా నిలిచింది.

[16] యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఇదిగో విను. నీవు కన్నుమూసి నీ పూర్వీకుల దగ్గర చేరబోతున్నావు. ఈ ప్రజలు ఎవరి దేశం చేరి, ఏ జనాల మధ్య ఉండబోతున్నారో ఆ జనాల దేవుళ్ళ వెంట వ్యభిచారులలాగా వెళ్ళి, నన్ను వదలివేస్తారు; నేను వారితో చేసిన ఒడంబడికను మీరుతారు.

[17] ఆ కాలంలో నా కోపాగ్ని వారిమీద రగులు కొంటుంది. నేను వారిని విడిచి, నా ముఖం కనబడకుండా మరో వైపు త్రిప్పుతాను, వారు నాశనమవుతారు. అనేక ఆపదలూ బాధలూ వారిని గురిచేసుకొని వారిని మ్రింగివేస్తాయి. ఆ రోజుల్లో వారు ‘మన దేవుడు మన మధ్య ఉండకపోవడంచేతనే గదా ఈ ఆపదలు మన మీదికి వచ్చాయి’ అని చెప్పుకొంటారు.

[18] వారు ఇతర దేవుళ్ళవైపు తిరగడం అనే దుర్మార్గం కారణంగా ఆ కాలంలో నేను వారినుంచి నా ముఖం అటువైపు త్రిప్పితీరుతాను.

[19] కాబట్టి మీరిద్దరు ఈ కీర్తన వ్రాసి ఇస్రాయేల్ ప్రజలకు నేర్పాలి. ఈ కీర్తన ఇస్రాయేల్ ప్రజల మీద నాకు సాక్షిలాగా ఉండేలా దానిని వారికి కంఠపాఠంగా చేయాలి.

[20] నేను వారి పూర్వీకులతో ప్రమాణం చేసినట్టు, పాలుతేనెలు నదులై పారుతూ ఉన్న దేశంలో వారిని చేర్చిన తరువాత, వారు తిని, త్రాగి, తృప్తిపొంది, క్రొవ్వినవారవుతారు, ఇతర దేవుళ్ళవైపు తిరిగి, ఆ దేవుళ్ళను కొలిచి, నన్ను తృణీకరించి, నా ఒడంబడిక మీరుతారు.

[21] అనేక ఆపదలూ బాధలూ వారికి ప్రాప్తించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిలాగా ఉండి సాక్ష్యం ఇస్తూ ఉంటుంది (ఈ కీర్తన వారి సంతతివారి నోట ఉంటుంది. వారు దీనిని మరచిపోరు), నేను ప్రమాణం చేసిన దేశంలో వారిని చేర్చేముందే, ఈ రోజు వారు చేసే ఆలోచన నాకు తెలుసు.”

[22] అందుచేత మోషే ఆ రోజే ఈ కీర్తన రాసి, ఇస్రాయేల్ ప్రజలకు నేర్పాడు.

[23] యెహోవా యెహోషువకు ఆజ్ఞ జారి చేస్తూ అన్నాడు: “దృఢంగా ఉండు! ధైర్యంగా ఉండు! నేను ఇస్రాయేల్ ప్రజలతో ప్రమాణం చేసిన దేశానికి నీవు వారిని తీసుకువెళ్ళాలి. నేను నీకు తోడుగా ఉంటాను.”

[24] ఈ ధర్మశాస్త్ర వాక్కులన్నీ మోషే ఒక గ్రంథంలో రాయడం ముగించాక

[25] యెహోవా ఒడంబడిక పెట్టెను మోసే లేవీగోత్రికులకు మోషే ఇలా ఆజ్ఞాపించాడు:

[26] “ఈ ధర్మశాస్త్ర గ్రంథం తీసుకొని మీ దేవుడు యెహోవా ఒడంబడికపెట్టె ప్రక్కన ఉంచండి. అది అక్కడ మీ మీద సాక్షిగా ఉంటుంది.

[27] తిరగబడే మీ మనస్తత్వమూ మీ తలబిరుసుతనమూ నాకు తెలుసు. నేను బ్రతికినన్నాళ్ళూ, మీతో ఉన్నన్నాళ్ళూ మీరు యెహోవా మీద తిరగబడేవారు. నేను చనిపోయిన తరువాత మీరు ఇంకెక్కువగా అలా చేస్తారు గదా!

[28] కనుక మీ గోత్రాల పెద్దలందరినీ, మీ నాయకులను నా దగ్గరికి పోగుచేయండి. నేను ఈ మాటలు వారికి వినిపించి, ఆకాశం, భూమి వారి మీద సాక్ష్యమిచ్చేలా వాటిని పిలుస్తాను.

[29] ఎందుకని? నేను చనిపోయాక మీరు తప్పకుండా చెడిపోతారని నాకు తెలుసు. నేను మీకాజ్ఞాపించే మార్గంనుంచి తొలగిపోతారనీ తెలుసు. యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించి మీ చేతులతో చేసినవాటివల్ల ఆయనకు కోపం పుట్టిస్తారు. అందుచేత చివరి రోజుల్లో విపత్తులు మీకు వస్తాయి.”

[30] అప్పుడు మోషే ఇస్రాయేల్ ప్రజల సర్వసమాజానికి ఈ కీర్తన మాటలన్నీ పలికాడు:

ద్వితీయోపదేశకాండం (ధర్మోపదేశం) — Chapters