Skip to content
Opens in a new window

[1] కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఆయన చెప్పినదాని ప్రకారం చేస్తూ, ఆయన చట్టాలను, న్యాయనిర్ణయాలను, ఆజ్ఞలను ఎప్పుడూ పాటిస్తూ ఉండాలి.

[2] ఈ రోజు మీతోనే మాట్లాడుతున్నాను గానీ మీ దేవుడు యెహోవా చేసిన శిక్షణను అనుభవించకుండా, ఎరగకుండా ఉన్న మీ సంతానంతో కాదని మీరు గుర్తించండి. యెహోవా మహత్తు, ఆయన బలిష్ఠమైన హస్తం, ఆయన చాపిన చెయ్యి మీకు తెలుసు.

[3] ఈజిప్ట్‌లో, ఈజిప్ట్ చక్రవర్తి ఫరోకు, అతడి దేశమంతటికీ ఆయన చేసిన అద్భుతమైన సూచనలు, క్రియలు మీకు తెలుసు.

[4] ఆయన ఈజిప్ట్ సైన్యానికీ వాళ్ళ గుర్రాలకూ రథాలకూ చేసినది మీరు చూశారు. వాళ్ళు మిమ్మల్ని తరుముతూ ఉంటే ఎర్ర సముద్రం నీళ్ళు వాళ్ళమీద పారేలా చేశాడు. ఈ రోజు వరకూ యెహోవా వాళ్ళను నాశనం చేసిన సంగతి మీకు తెలుసు.

[5] మీరు ఈ చోటికి చేరేవరకు ఎడారిలో మీ కోసం ఆయన ఏం చేసినదీ మీకు తెలుసు.

[6] రూబేను గోత్రికుడైన ఏలీయాబు కొడుకులైన దాతానుకూ అబీరాంకూ ఆయన చేసినది కూడా మీరు చూశారు. ఇస్రాయేల్ ప్రజలమధ్య భూమి నోరు తెరచి వాళ్ళనూ, వాళ్ళ ఇంటివాళ్ళనూ, గుడారాలనూ, వాళ్ళదగ్గర ఉన్న సమస్త జీవరాసులనూ మింగివేసింది.

[7] యెహోవా చేసిన ఆ క్రియలన్నీ మీ కండ్లకు కనిపించాయి గదా.

[8] ఈరోజు నేను మీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నిటి ప్రకారం ప్రవర్తించాలి. అలా ప్రవర్తిస్తే మీరు బలం పుంజుకొని ఏ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి నది దాటి వెళ్తున్నారో ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోగలరు.

[9] ఆ దేశంలో దీర్ఘ కాలం నివసించగలరు. యెహోవా మీ పూర్వీకులకూ వారి సంతానానికీ ఇస్తానని వారితో ప్రమాణం చేసిన దేశం అది. పాలు తేనెలు నదులై పారుతూ ఉన్న దేశం.

[10] మీరు స్వాధీనం చేసుకోబొయ్యే దేశం మీరు బయలుదేరి వచ్చిన ఈజిప్ట్‌దేశంలాంటిది కాదు. అక్కడ మీరు విత్తనాలు వేసి, కూరతోటకు నీరు కట్టినట్టు మీ కాళ్ళతో మీ పొలాలకు నీరు కట్టారు.

[11] మీరు నది దాటి, స్వాధీనం చేసుకోబొయ్యే దేశం కొండలూ లోయలూ ఉన్న దేశం. ఆకాశ వర్షాల నీరు త్రాగే దేశం.

[12] అది మీ దేవుడు యెహోవా లక్ష్యపెట్టే దేశం. మీ దేవుడు యెహోవా కనుచూపు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎప్పుడూ ఆ దేశం మీద ఉంటుంది.

[13] మీరు హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో మీ దేవుడు యెహోవాను ప్రేమిస్తూ సేవిస్తూ ఉండాలని ఈ రోజు నేను మీకాజ్ఞాపిస్తున్నాను. ఈ ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా శిరసావహిస్తే, ఆయన

[14] “మీ దేశానికి వర్షాలు వాటి కాలాలలో కురిపిస్తాను. మీరు మీ ధాన్యాన్ని, ద్రాక్షరసాన్ని, నూనెను కూర్చుకొనేలా తొలకరి వాన కడవరి వాన కురిపిస్తాను.

[15] మీ పశువులకోసం మీ మైదానాల్లో గడ్డి మొలిపిస్తాను. మీరు భోజనం చేసి తృప్తిపడతారు” అంటాడు.

[16] అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ హృదయం మోసపోతుందేమో, మీరు సరైన మార్గం విడిచి ఇతర దేవుళ్ళను పూజించి సేవిస్తారేమో,

[17] అలాంటప్పుడు యెహోవా కోపం మీ మీద రగులుకొంటుంది. ఆయన ఆకాశాన్ని మూసివేస్తాడు. వాన రాదు, భూమి పండదు. యెహోవా మీకిచ్చే ఆ మంచి దేశంలో లేకుండా మీరు త్వరలో నశించిపోతారు.

[18] కాబట్టి మీరు ఈ నా మాటలు మీ హృదయంలో మీ మనస్సులో బాగా ఉంచుకోవాలి. వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకోవాలి. అవి మీ నొసట ఉండాలి.

[19] మీ ఇండ్లలో కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పడుకొన్నప్పుడు, లేచినప్పుడు ఈ మాటల గురించి మాట్లాడుతూ మీ పిల్లలకు నేర్పాలి.

[20] మీ ఇండ్ల ద్వారబంధాల మీద మీ గుమ్మాలమీద వ్రాయాలి.

[21] మీరు అలా చేస్తూ ఉంటే యెహోవా మీ పూర్వీకులకిస్తానని ప్రమాణం చేసిన దేశంలో మీరు, మీ సంతానం సుదీర్ఘకాలం నివసిస్తారు. భూమికి పైగా ఆకాశం నిలిచేటంత కాలం మీరు అక్కడ ఉంటారు.

[22] మీరు మీ దేవుడు యెహోవాను ప్రేమిస్తూ, ఆయన విధానాలన్నిటి ప్రకారమూ నడుచుకుంటూ, ఆయనను విడవకుండా మీరు చేయాలని నేను మీకిచ్చే ఈ ఆజ్ఞలన్నిటినీ శ్రద్ధతో పాటించాలి.

[23] అప్పుడు యెహోవా మీ ఎదుటనుంచి ఆ జనాలన్నిటినీ వెళ్ళగొట్టివేస్తాడు, మీకంటే బలమైన గొప్ప జనాల దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొంటారు.

[24] మీరు పాదం మోపే ప్రతీ స్థలం మీది అవుతుంది. ఎడారినుంచి లెబానోనువరకూ, యూఫ్రటీస్ నదినుంచి పడమటి సముద్రం వరకూ మీ సరిహద్దులు వ్యాపిస్తాయి.

[25] ఎవ్వరూ మీ ఎదుట నిలబడలేకపోతారు. తాను మీతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టే దేశమంతటికీ మీ గురించిన భయాందోళన మీ దేవుడు యెహోవా పుట్టిస్తాడు.

[26] ఇదిగో వినండి, ఈ రోజు నేను మీ ఎదుట దీవెననూ శాపాన్నీ ఉంచుతున్నాను.

[27] ఈవేళ నేను మీకు ఇచ్చే మీ దేవుడు యెహోవా యొక్క ఆజ్ఞలు శిరసావహిస్తే మీకు దీవెన వస్తుంది.

[28] మీ దేవుడు యెహోవా ఆజ్ఞలు శిరసావహించకుండా, ఈ వేళ నేను మీకాజ్ఞాపించే మార్గంనుంచి తొలగిపోయి మీరు ఎరుగని ఇతర దేవుళ్ళను అనుసరిస్తే మీకు శాపం వస్తుంది.

[29] మీరు స్వాధీనం చేసుకోబొయ్యే దేశంలో మీ దేవుడు యెహోవా మిమ్మల్ని చేర్చిన తరువాత ఆ దీవెన గెరిజీం కొండమీద ప్రకటించాలి. ఏబాల్ కొండమీద ఆ శాపం ప్రకటించాలి.

[30] ఆ కొండలు యొర్దాను అవతల, పడమటి దిక్కుగా మోరేలోని సిందూర వృక్షాల దగ్గర ఉన్న గిల్గాలుకు ఎదురుగా ఉన్నాయి గదా. ఆ ప్రదేశం అరాబాలో నివసించే కనానువాళ్ళది.

[31] మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఈ యొర్దాను దాటబోతున్నారు. మీరు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని దానిలో నివసిస్తారు.

[32] ఈ రోజు నేను మీకు నియమించే చట్టాలు, న్యాయనిర్ణయాల ప్రకారం అక్కడ మీరు ప్రవర్తించాలి.

ద్వితీయోపదేశకాండం (ధర్మోపదేశం) — Chapters