[1] మోషే, ఇస్రాయేల్‌ప్రజల పెద్దలు ప్రజలకిలా ఆజ్ఞాపించారు: “ఈ రోజు నేను మీకిచ్చే ఆజ్ఞలన్నిటి ప్రకారం మీరు ప్రవర్తించాలి.
[2] మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో ప్రవేశించడానికి మీరు యొర్దాను దాటే రోజు మీరు పెద్ద రాళ్ళను నిలబెట్టి, వాటిమీద సున్నం పూయాలి;
[3] మీ పూర్వీకుల దేవుడు యెహోవా మీకు మాట ఇచ్చినట్టు, మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో, పాలు తేనెలు నదులై పారుతూవున్న దేశంలో ప్రవేశించడానికి మీరు నదిని దాటాక ఆ రాళ్ళమీద ఈ ధర్మశాస్త్ర వాక్కులన్నీ రాయాలి.
[4] మీరు యొర్దాను దాటాక, నేను ఈవేళ మీకాజ్ఞాపించినట్టు, ఆ రాళ్ళను ఏబాల్ పర్వతం మీద నిలబెట్టాలి, వాటిమీద సున్నం పూయాలి.
[5] అక్కడ మీ దేవుడు యెహోవాకు రాళ్ళతో బలిపీఠం కట్టాలి. ఆ బలిపీఠం రాళ్ళమీద ఇనుప పనిముట్టుపడకూడదు.
[6] చెక్కనిరాళ్ళతోనే మీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టాలి. దానిమీద మీ దేవుడైన యెహోవాకు హోమబలులు సమర్పించాలి.
[7] శాంతిబలులు కూడా సమర్పించి, అక్కడ భోజనం చేసి, మీ దేవుడైన యెహోవా సన్నిధానంలో సంతోషించాలి.
[8] ఈ ధర్మశాస్త్ర వాక్కులన్నీ సున్నం పూసిన ఆ రాళ్ళమీద చాలా స్పష్టంగా రాయాలి.”
[9] మోషే, యాజులైన లేవీ గోత్రికులు ఇస్రాయేల్ ప్రజలందరితోనూ ఇలా అన్నారు: “ఇస్రాయేల్ ప్రజలారా! మౌనం వహించి వినండి! ఈరోజు మీరు మీ దేవుడు యెహోవాకు ప్రత్యేక ప్రజ అయ్యారు.
[10] కనుక మీ దేవుడైన యెహోవా మాట వినాలి; ఈ రోజు నేను మీ కాజ్ఞాపించే ఆయన శాసనాలు, ఆజ్ఞలప్రకారం ప్రవర్తించాలి.”
[11] ఆ రోజే మోషే ప్రజలకు ఇలా ఆజ్ఞాపించాడు:
[12] మీరు యొర్దాను దాటిన తరువాత షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాకారు, యోసేపు, బెన్యామీను గోత్రాలవారు ప్రజలగురించి దీవెనలు పలకడానికి గెరిజీమ్ పర్వతం మీద నిలబడాలి.
[13] శాపాలు పలకడానికి రూబేను, గాదు, ఆషేరు, బెబూలూను, దాను, నఫ్తాలి గోత్రాలవారు ఏబాల్ పర్వతం మీద నిలబడాలి.
[14] అప్పుడు లేవీగోత్రికులు ఇస్రాయేల్ ప్రజలందరితో బిగ్గరగా ఇలా చెప్పాలి:
[15] “మలిచిన విగ్రహాన్ని గానీ, పోత విగ్రహాన్ని గానీ చేయించి, దానిని చాటున నిలబెట్టేవాడు శాపగ్రస్తుడు. విగ్రహం శిల్పి చేతులతో చేసినది. అది యెహోవాకు అసహ్యం.” అందుకు ప్రజలంతా “తథాస్తు” అనాలి.
[16] “తన తండ్రిని గానీ, తల్లిని గానీ అవమానపరచేవాడు శాపగ్రస్తుడు” అని వారు చెప్పినప్పుడు ప్రజలంతా “తథాస్తు” అనాలి.
[17] “తన పొరుగువాడి సరిహద్దు రాయిని తీసివేసేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “తథాస్తు” అనాలి.
[18] “గుడ్డివాణ్ణి త్రోవ తప్పించేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “తథాస్తు” అనాలి.
[19] “విదేశీయులపట్ల, తండ్రిలేనివారిపట్ల, విధవరాండ్రపట్ల న్యాయాన్ని వక్రం చేసేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “తథాస్తు” అనాలి.
[20] “తన తండ్రి భార్యతో శయనించేవాడు తన తండ్రి శయ్య అపవిత్రపరచినట్టే. వాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “తథాస్తు” అనాలి.
[21] “ఏదైనా జంతువుతో సంపర్కం చేసేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “తథాస్తు” అనాలి.
[22] “తన తోబుట్టిన ఆమెతో – తన తండ్రి కూతురుతో గానీ, తన తల్లి కూతురుతో గానీ శయనించేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “తథాస్తు” అనాలి.
[23] “తన భార్య తల్లితో శయనించేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “తథాస్తు” అనాలి.
[24] “రహస్యంగా తన పొరుగువాణ్ణి చావగొట్టేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “తథాస్తు” అనాలి.
[25] “నిర్దోషి ప్రాణాన్ని తీయడానికి లంచం పుచ్చుకొన్నవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “తథాస్తు” అనాలి.
[26] “ఈ ధర్మశాస్త్ర వాక్కులప్రకారం ప్రవర్తించకుండా వాటిని నెరవేర్చకుండా ఉండేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు ప్రజలంతా “తథాస్తు” అనాలి.