Skip to content
Opens in a new window

[1] ఎవడికైనా వృషణాలు చితగ్గొట్టడం గానీ పురుషాంగం కోయడం గానీ జరిగితే అతడు యెహోవా సమాజంలో చేరకూడదు.

[2] వ్యభిచారం వల్ల పుట్టినవాడు యెహోవా సమాజంలో చేరకూడదు. అతడి సంతానంలో పదో తరంవరకు ఎవరూ యెహోవా సమాజంలో చేరకూడదు. పదో తరంవరకు వాళ్ళలో ఎవరూ ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు.

[3] అమ్మోను జాతివాడు గానీ, మోయాబు జాతివాడు గానీ యెహోవా సమాజంలో చేరకూడదు.

[4] ఎందుకంటే మీరు ఈజిప్ట్ నుంచి వస్తూ ఉన్నప్పుడు వారు అన్నపానాలు తీసుకొని మిమ్మల్ని కలుసుకోలేదు. అంతేగాక, మిమ్మల్ని శపించడానికి బహుమతులిచ్చి అరామ్నహారయింలో ఉన్న పెతోరునుంచి బెయోరు కొడుకు బిలాంను పిలిపించారు.

[5] అయితే మీ దేవుడైన యెహోవా బిలాం మాటకు ఒప్పుకోలేదు. మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు గనుక మీ దేవుడు యెహోవా ఆ శాపాన్ని దీవెనగా చేశాడు.

[6] ఆ కారణంవల్ల మీరు బ్రతికే రోజులన్నిటిలో ఎన్నడూ వాళ్ళకు క్షేమాన్ని గానీ మేలును గానీ కలిగించడానికి ప్రయత్నం చేయకూడదు.

[7] ఎదోం జాతివాళ్ళు మీకు బంధువులు గనుక వాళ్ళను అసహ్యించుకోకూడదు. ఈజిప్ట్‌దేశంలో మీరు విదేశీయులుగా ఉన్నారు గనుక ఈజిప్ట్‌వాళ్ళను అసహ్యించుకోకూడదు.

[8] వారి సంతానంలో మూడో తరంవారు యెహోవా సమాజంలో చేరవచ్చు.

[9] మీరు సైన్యంగా శత్రువులతో యుద్ధానికి బయలు దేరేటప్పుడు మీరు ప్రతి చెడ్డదానికి దూరం కావాలి.

[10] రాత్రివేళ తనకు వీర్యస్ఖలనం జరగడం వల్ల ఒక వ్యక్తి అశుద్ధమైతే అతడు శిబిరం వెలుపలికి వెళ్ళిపోయి, అందులోకి తిరిగి రాక,

[11] సాయంకాలాన స్నానం చేసి ప్రొద్దుక్రుంకిన తరువాత అతడు శిబిరంలో చేరాలి.

[12] శిబిరం వెలుపల బహిర్భూమిగా ప్రత్యేక స్థలం ఏర్పరచుకోవాలి.

[13] మీ దగ్గర ఆయుధాలే గాక ఒక పార కూడా ఉండాలి. బహిర్భూమికి వెళ్ళేటప్పుడు దానితో త్రవ్వి, వెనక్కు తిరిగి, మలాన్ని కప్పివేయాలి.

[14] మీ దేవుడు యెహోవా మిమ్మల్ని రక్షించడానికీ మీ శత్రువులను మీ వశం చేయడానికీ మీ శిబిరంలో నడుస్తూవుంటాడు గనుక మీ శిబిరం పరిశుద్ధంగా ఉండాలి. లేకపోతే ఆయన ఏదైనా అసహ్యమైనదానిని చూచి మిమ్మల్ని వదలివేస్తాడేమో.

[15] ఎవడైనా ఒక దాసుడు తన యజమాని దగ్గరనుంచి తప్పించుకుని మీ దగ్గరికి వస్తే, అతణ్ణి అతడి యజమానికి అప్పగించకూడదు.

[16] అతడు తనకు ఇష్టం వచ్చిన చోట, మీ గ్రామాలలో తను ఎన్నుకొన్నదానిలో మీతో కలిసి మీ మధ్య నివాసం చేయవచ్చు. మీరు అతణ్ణి బాధించకూడదు.

[17] ఇస్రాయేల్‌జాతి స్త్రీలలో ఎవరూ అన్యుల గుళ్ళకు వేశ్యలుగా ఉండకూడదు. పురుషులలో ఎవడూ ఆ గుళ్ళకు చెందిన పురుష సంపర్కులుగా ఉండకూడదు.

[18] అలాంటి పురుష సంపర్కంవల్ల గానీ, ఆ వేశ్యా వృత్తి వల్ల గానీ వచ్చే డబ్బును మ్రొక్కుబడిగా మీ దేవుడైన యెహోవా నివాసానికి తేకూడదు. ఈ రెండూ మీ దేవుడైన యెహోవాకు అసహ్యం.

[19] మీలో ఎవరూ డబ్బును గానీ, భోజన పదార్థాలను గానీ వడ్డీకి వేసే దేనినైనా ఇస్రాయేల్ వారికి వడ్డీకివ్వకూడదు.

[20] విదేశీయుడికి వడ్డీకి అప్పివ్వవచ్చు గాని, ఇస్రాయేల్‌వారికి కాదు. అప్పుడు స్వాధీనం చేసుకోవడానికి చేరబోయే దేశంలో మీ దేవుడు యెహోవా మీ ప్రయత్నాలన్నిటిని దీవిస్తాడు.

[21] మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొన్న తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించడానికి ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేయడం మీకు పాపం అవుతుంది. మీ దేవుడు యెహోవా మీరు చేసినదానిని గురించి విచారణ చేసి తీరుతాడు.

[22] మ్రొక్కుకోకపోవడం మీకు పాపం కాదు.

[23] మీ పెదవులనుంచి బయలుదేరే మాటను నేరవేర్చుకోవాలి. మీ దేవుడైన యెహోవాకు స్వేచ్ఛగా మ్రొక్కుకొంటే నోటి మాటప్రకారం చేయాలి.

[24] మీ పొరుగువాడి ద్రాక్షతోట ద్వారా దాటిపోతుంటే, మీకిష్టమున్న అన్ని పండ్లు తినవచ్చు గాని మీ గంపలో పండ్లేమీ వేసుకోకూడదు.

[25] మీ పొరుగువాడి పంట పొలం మీదుగా దాటిపోతూవుంటే మీ చేతితో వెన్నులు త్రుంచుకోవచ్చు గాని మీ పొరుగువాడి పంట పొలంమీద కొడవలి వేయకూడదు.

ద్వితీయోపదేశకాండం (ధర్మోపదేశం) — Chapters