Skip to content
Opens in a new window

[1] లేవీవారైన యాజులకు, ఆ మాటకొస్తే లేవీగోత్రికులందరికీ, ఇస్రాయేల్ ప్రజలతో భాగమూ వారసత్వమూ ఉండవు. ప్రజలు యెహోవాకు అర్పించే హోమాలు వారు తింటారు. అదే వారికి భాగం.

[2] స్వదేశస్తుల మధ్య వారికి వారసత్వం ఉండదు. యెహోవా వారితో చెప్పినట్టు ఆయనే వారికి వారసత్వం.

[3] బలులర్పించేవారు యాజులకు ఇవ్వవలసినదేమిటంటే, ఆ బలి ఎద్దు కానివ్వండి, గొర్రె కానివ్వండి వారు యాజికి కుడి జబ్బనూ, రెండు దవడలనూ, పొట్టనూ ఇవ్వాలి.

[4] మీ ధాన్యంలో, ద్రాక్షరసంలో, నూనెలో ప్రథమ ఫలం, మీ గొర్రెల మొదటి బొచ్చు అతడికివ్వాలి.

[5] యెహోవా పేర నిలబడి ఎల్లకాలం సేవ చేయడానికి మీ గోత్రాలన్నిటిలో అతణ్ణీ, అతడి సంతానాన్నీ మీ దేవుడు యెహోవా ఎన్నుకొన్నాడు.

[6] లేవీగోత్రికుడు ఇస్రాయేల్ దేశంలో మీ గ్రామాలలో తాను నివసించే గ్రామంనుంచి యెహోవా ఎన్నుకొన్న ఆ స్థలానికి చాలా అభిలాషతో వస్తాడనుకోండి.

[7] అలాంటప్పుడు అక్కడ యెహోవా సన్నిధానంలో నిలబడే తన సాటి లేవీ గోత్రికులందరిలాగే అతడు కూడా తన దేవుడు యెహోవా పేర సేవ చేయవచ్చు.

[8] తన వంశంవారిపట్ల వచ్చుబడి కాక, అతడు ఇతర యాజులలాగే వంతు పొందాలి.

[9] మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో మీరు ప్రవేశించాక అక్కడి జనాల అసహ్య కార్యకలాపాలను చూచి వాటిని చేయకూడదు.

[10] తన కొడుకును గానీ కూతుర్ని గానీ, అగ్నిద్వారా దాటించేవాణ్ణి మీ మధ్య ఉండనివ్వకూడదు. సోదె చెప్పేవ్యక్తిని గానీ, మేఘశకునాలు, సర్ప శకునాలు చెప్పేవ్యక్తిని గానీ, చేతబడి చేసే వ్యక్తిని గానీ,

[11] మంత్రవిద్య అభ్యసించే వ్యక్తిని గానీ, కర్ణ పిశాచాన్ని సంప్రదించే వ్యక్తిని గానీ, పూనకం వచ్చి పలికే వ్యక్తిని గానీ, చచ్చినవారిని పిలిచే వ్యక్తిని గానీ మీ మధ్య ఉండనివ్వకూడదు.

[12] వీటిని చేసే ప్రతి వ్యక్తీ యెహోవాకు అసహ్యం. ఆ జనాలు ఈ అసహ్యమైన వాటిని చేసినందుకే మీ దేవుడు యెహోవా మీ ఎదుటనుంచి వాళ్ళను వెళ్ళగొట్టివేస్తున్నాడు.

[13] మీరు మీ దేవుడు యెహోవా దృష్టిలో యథార్థవంతులై ఉండాలి.

[14] ఎవరి దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోబోతున్నారో ఆ జనాలు శకునాలు చెప్పేవాళ్ళ మాట, సోదెగాండ్ర మాట వింటారు. మీకైతే అలా చేయడానికి మీ దేవుడు యెహోవా సెలవియ్యలేదు.

[15] మీ దేవుడు యెహోవా మీ మధ్య మీ కోసం నాలాంటి మరో ప్రవక్తను మీ దేశస్తులలోనే బయలుదేరేలా చేస్తాడు. ఆయన మాట మీరు వినాలి.

[16] హోరేబు పర్వతం దగ్గర మీరు సమావేశమైన రోజు మీరు మీ దేవుడైన యెహోవాను కోరినట్టే యెహోవా చేస్తాడు. “మేము చావకుండేలా మా దేవుడు యెహోవా స్వరం మాకు మళ్ళీ వినిపించకుండా ఈ గొప్ప మంట ఇకనుంచి కనిపించకుండా ఉండాలి!” అని మీరన్నారు.

[17] అందుకు యెహోవా నాతో అన్నాడు, “వారు చెప్పిన మాట మంచిదే.

[18] వారికోసం వారి స్వదేశస్తులలో నీలాంటి ప్రవక్త బయలు దేరేలా చేస్తాను. ఆయన నోట నా మాటలను ఉంచుతాను. నేను ఆయనకు ఆజ్ఞాపించినదంతా ఆయన వారితో చెప్తాడు.

[19] నా పేర ఆయన చెప్పే నా మాటలు ఎవరైనా శిరసావహించకపోతే, వారికి తగిన ప్రతిక్రియ చేస్తాను.

[20] అంతేకాదు, ఎవడైనా ఒక ప్రవక్త గర్వించి, నేను అతడి కాజ్ఞాపించని మాట నా పేర పలికితే అతడు చావాలి; ఇతర దేవుళ్ళ పేరున పలికితే ఆ ప్రవక్త చావాలి.”

[21] “ఏదో మాట యెహోవా చెప్పినది కాదని మాకెలా తెలుస్తుంది?” అంటూ మీరు చెప్పుకొంటారేమో.

[22] ఎవడైనా ఒక ప్రవక్త యెహోవా పేర పలికేటప్పుడు ఆ మాటప్రకారం జరుగకపోతే, అది నెరవేరకపోతే అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అతిశయించి ఆ మాట చెప్పాడు. దానికి భయపడవద్దు.

ద్వితీయోపదేశకాండం (ధర్మోపదేశం) — Chapters