Skip to content
Opens in a new window

[1] ఆ కాలంలో యెహోవా నాతో అన్నాడు, “మునుపటి పలకలలాంటి రెండు రాతి పలకలను చెక్కి పర్వతం ఎక్కి నా దగ్గరికి రా. నీవు కర్రతో ఒక పెట్టెను కూడా చేయాలి.

[2] నీవు పగులగొట్టిన ఆ మొదటి పలకలమీద ఉన్న మాటలను నేను ఈ పలకలమీద వ్రాస్తాను. నీవు ఆ పెట్టెలో వాటిని ఉంచాలి.”

[3] అందుచేత తుమ్మకర్రతో పెట్టెను చేసి మొదటి పలకలలాంటి రెండు రాతి పలకలను చెక్కి, ఆ రెండు పలకలు చేతపట్టుకొని పర్వతమెక్కాను.

[4] మీరు సమావేశమైన రోజు యెహోవా పర్వతంమీద మంటలమధ్యనుంచి మీతో పలికిన ఆ పది ఆజ్ఞలను మునుపు వ్రాసినట్టు ఆ పలకలమీద మళ్ళీ వ్రాశాడు, వాటిని నాకిచ్చాడు.

[5] నేను తిరిగి పర్వతం దిగివచ్చి, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్టు నేను చేసిన పెట్టెలో ఆ పలకలు ఉంచాను. అప్పటినుంచి ఆ పెట్టెలో ఉన్నాయి.

[6] (తరువాత ఇస్రాయేల్‌ప్రజలు బెయేరోత్ బెనాయాకాను నుంచి బయలుదేరి మోసేరాకు వచ్చారు. అక్కడ అహరోను చనిపోయి సమాధిపాలయ్యాడు. అతడి స్థానంలో అతడి కొడుకు ఎలియాజరు యాజి అయ్యాడు.

[7] అక్కడనుంచి వారు గుద్గోదుకు, గుద్గోదునుంచి యొతబాతాకు ప్రయాణం అయ్యారు. యొతబాతా నీటి వాగులున్న ప్రదేశం.

[8] ఆ కాలంలో యెహోవా లేవీగోత్రికులను ప్రత్యేకించుకొన్నాడు. యెహోవా యొక్క మందసాన్ని మోయాలని, యెహోవా సన్నిధానంలో నిలబడి సేవ చేయాలని, ఆయన పేర దీవెనలు పలకాలని ఆయన వారిని ప్రత్యేకించుకొన్నాడు. ఈ రోజువరకు వారు అలాగే చేస్తున్నారు.

[9] కాబట్టి లేవీగోత్రికులు తమ ప్రజలతోపాటు భాగం, వారసత్వం పొందలేదు. మీ దేవుడు యెహోవా వారితో చెప్పినట్టు యెహోవాయే వారికి వారసత్వం.)

[10] ఆ కాలంలో, మునుపటిలాగా నలభై రాత్రింబగళ్ళూ నేను ఆ పర్వతంమీద గడిపాను. అప్పుడు కూడా యెహోవా నా మనవి ఆలకించి, మిమ్మల్ని నాశనం చేయకుండా ఉండిపోయాడు.

[11] యెహోవా నాతో “లేచి, ప్రయాణమై ఈ ప్రజల ముందర సాగిపో. నేను వారికిస్తానని వారి పూర్వీకులతో ప్రమాణం చేసిన దేశంలో ప్రవేశించి దానిని స్వాధీనం చేసుకొనేలా చెయ్యి” అన్నాడు.

[12] కాబట్టి ఇస్రాయేల్ ప్రజలారా, మీ దేవుడైన యెహోవా మీరు ఏం చేయాలని కోరుతున్నాడు? మీరు మీ దేవుడు యెహోవా పట్ల భయభక్తులు కలిగి, ఆయన విధానాలన్నిటిలో నడుచుకోవాలి. మీ దేవుడు యెహోవాను ప్రేమిస్తూ హృదయ పూర్వకంగా సంపూర్ణ ఆత్మతో సేవిస్తూ ఉండాలి.

[13] మీ మేలుకోసం ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞలను, చట్టాలను శిరసావహించాలి. ఆయన కోరేది అదే.

[14] చూడండి, ఆకాశం, మహాకాశం, భూమి, భూమిపై ఉన్నదంతా, మీ దేవుడు యెహోవావే.

[15] అయినా యెహోవాకు మీ పూర్వీకులను ప్రేమతో చూడడం ఇష్టమైంది. వారి సంతానమైన మిమ్మల్ని జనాలన్నిటినుంచి ఎన్నుకొన్నాడు. ఈనాటికి ఇది నిజం.

[16] కనుక మీ హృదయాలకు సున్నతి చేసుకోండి. ఇకనుంచి మూర్ఖులు కాకుండా ఉండండి.

[17] మీ దేవుడు యెహోవా దేవుళ్ళకంటే అతీతుడు, ప్రభువులకు ప్రభువు, ఆయనే గొప్ప దేవుడు, బలాఢ్యుడూ బీకరుడూ అయిన దేవుడు. ఆయన పక్షపాతం చూపించనివాడు. లంచం పుచ్చుకోనివాడు.

[18] తల్లిదండ్రులు లేనివారికీ విధవరాండ్లకూ న్యాయం తీరుస్తాడు, విదేశీయులను ప్రేమతో చూస్తూ వారికి అన్నవస్త్రాలను ప్రసాదిస్తాడు.

[19] కనుక మీరు విదేశీయులను ఆదరాభిమానాలతో చూడాలి. పూర్వం మీరు కూడా ఈజిప్ట్‌లో విదేశీయులే గదా.

[20] మీ దేవుడు యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఆయనకు సేవ చేస్తూ ఉండాలి. ఆయనను ఏమాత్రం విడువకుండా ఆయన పేర ప్రమాణం చేయాలి.

[21] కీర్తనీయుడు ఆయనే. మీకు దేవుడు ఆయనే. మీరు కన్నులారా చూస్తుండగా భయంకరమైన ఆ గొప్ప క్రియలు మీకోసం చేశాడు.

[22] మీ పూర్వీకులు ఈజిప్ట్‌కు వెళ్ళినప్పుడు వారు డెబ్భైమంది మాత్రమే. ఇప్పుడు మీ దేవుడు యెహోవా మిమ్మల్ని సంఖ్యలో ఆకాశ నక్షత్రాలలాగా చేశాడు.

ద్వితీయోపదేశకాండం (ధర్మోపదేశం) — Chapters